Share News

ఆగని కాచారం మైనింగ్‌

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:53 AM

దేవరకొండ, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): దేవరకొండ మండలం కాచారం సర్వే నెంబర్‌ 13 ప్రభుత్వ భూమిలో మైనింగ్‌ పనులు ప్రజలు, రైతులు వ్యతిరేకిస్తున్నా కొనసాగుతూనే ఉన్నాయి.

  ఆగని కాచారం మైనింగ్‌

దేవరకొండ, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): దేవరకొండ మండలం కాచారం సర్వే నెంబర్‌ 13 ప్రభుత్వ భూమిలో మైనింగ్‌ పనులు ప్రజలు, రైతులు వ్యతిరేకిస్తున్నా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామశివారులోని సర్వే నెంబర్‌ 13లో 24.7 హెక్టార్లలో ప్రభుత్వ భూమి నవభారత్‌ క్వారీ మైనింగ్‌ కంపెనీ అనుమతులు తీసుకొని పనులు ప్రారంభించింది. పనులు ప్రారంభించక ముందే మైనింగ్‌ పనులను నిర్వహించవద్దని గ్రామస్థులు, రైతులు డిమాండ్‌ చేశారు. అయినా మైనింగ్‌ తవ్వకాలు చేపడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. 2022లో మైనింగ్‌ తవ్వకాలను చేపట్టవద్దని ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు, గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. క్వారీ తవ్వకాలతో గ్రామానికి తీవ్రంగా నష్టం జరుగుతుందని, పొలాలలోని పంటలు దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా మైనింగ్‌, రెవెన్యూశాఖలు ప్రభుత్వ భూమిలో మైనింగ్‌ తవ్వకాలకు అనుమతి ఇవ్వడంతో పనులు ప్రారంభించారు. దీంతో గ్రామానికి చెందిన న్యాయవాది నిరసనమెట్ల సుందరయ్యతోపాటు గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు. మైనింగ్‌ తవ్వకాలతో పంట పొలాలు దెబ్బతింటాయని, నీరు కలుషితమవుతుందని, పర్యావరణానికి హాని కలుగుతుందని గ్రామస్థులు వాపోతున్నారు. అనుమతులు రద్దుచేసి వవ్వకాలను నిలిపివేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మైనింగ్‌ తవ్వకాలతో పర్యావరణానికి హాని

మైనింగ్‌ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి. అనుమతులను రద్దు చేయాలి. గ్రా మ సమీపంలోనే గుట్ట ఉండటంతో తవ్వకాలు, బ్లాస్టింగ్‌ నిర్వహిస్తే పంటలు దెబ్బతింటాయి. గ్రామస్థులు, రైతులు వ్యతిరేకించినా అధికారులు అనుమతులు ఇవ్వడం సరికాదు. హైకోర్టుతో పాటు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యా యం చేయాలి

-నిరసనమెట్ల సుందరయ్య, కాచారం

2032 వరకు అనుమతులు

కాచారం ప్రభుత్వ భూ మి సర్వే నెంబర్‌ 13లో క్వారీ వవ్వకాలకు నవభారత్‌ కంపెనీ 2032 వరకు అనుమతి తీసుకుంది. మైనింగ్‌శాఖ కూడా అనుమతి ఇచ్చింది. నవభారత్‌ కంపెనీ తవ్వకాలు చేపట్టింది.

-రమణారెడ్డి, ఆర్డీవో, దేవరకొండ

Updated Date - Apr 12 , 2025 | 12:53 AM