Share News

అమ్మో జ్వరం

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:59 AM

సీజనల్‌ వ్యాధుల కాలం వచ్చింది. ఏ ఇంటిని చూసినా జ్వరంతో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు. కాళ్లు, కీళ్ల నొప్పులు, దగ్గు, జ్వరంతో దినదినగండంగా గడుపుతున్నారు.

అమ్మో జ్వరం

విజృంభిస్తున్న విషజ్వరాలు

కనిపించని అవగాహన సదస్సులు

ఇంటికి ఇద్దరి చొప్పున యాతన

(ఆంధ్రజ్యోతి-యాదగిరిగుట్ట రూరల్‌): సీజనల్‌ వ్యాధుల కాలం వచ్చింది. ఏ ఇంటిని చూసినా జ్వరంతో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు. కాళ్లు, కీళ్ల నొప్పులు, దగ్గు, జ్వరంతో దినదినగండంగా గడుపుతున్నారు. ఇంటికి ఇద్దరు చొప్పున యాతన పడుతున్నారు. రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.

యాదగిరిగుట్ట పట్టణంతోపాటు మండలవ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. 10 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం మారడం, సీజనల్‌ వ్యాఽ ధులు ప్రబలడంతో రోజు రోజుకూ రోగుల సంఖ్య పెరిగిపోతోంది. దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, ఆకలి మందగించడంతోపాటు నీరసంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రతీ రోజు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఓపీల సంఖ్య 100 నుంచి 150 వరకు చేరుతోంది. ప్రస్తుతం పల్లెల్లో ఇంటికి ఇద్దరు చొప్పున జ్వరంతో బాధపడుతున్నారు. రోగులకు జ్వరం తగ్గకపోవడంతో వారి రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్ష లు చేస్తున్నారు. నలుగురిలో ఒకరికి ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోవడంతో రోగులు ఆవేదన చెందుతున్నారు.

భయాందోళనలో ప్రజలు

రోజు రోజుకూ జ్వరాలు వచ్చిన వారి సంఖ్య పెరిగిపోవడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వారం రోజుల నుంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తే టైఫాయిండ్‌, ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోయిన వారే ఎక్కువగా ఉన్నారు. కొంతమందికి తాత్కాలికంగా జ్వరం తగ్గుతున్నా, మరోవైపు ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతుండటంతో తీవ్ర కలవరం మొదలైంది. మరోవైపు డబ్బులు లేక పేదవారు మెరుగైన వైద్యంకోసం ఇబ్బందులు తప్పడంలేదు.

పత్తాలేని వైద్య సిబ్బంది

పల్లెల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నా వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రోగులు హైరానా పడుతున్నారు. సీజనల్‌ వ్యాధులు సోకకుండా ప్రజలకు అవగహన సదస్సులు నిర్వహించి చైతన్యపర్చాల్సిన వైద్య సిబ్బంది ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. జిల్లాస్థాయి అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.

ఆశాలతో సర్వే చేయిస్తున్నాం : హరీష్‌, డాక్టర్‌, యాదగిరిపల్లి

గ్రామాల్లో ప్రస్తుతం ఆశా కార్యకర్తలతో ఇంటింటి సర్వే చేయిస్తున్నాం. అవసరం ఉన్నవారికి ఉచితంగా మందులు అందిస్తున్నాం. జ్వరం ఎక్కువైతే ఆస్పత్రికి తీసుకొస్తున్నాం. ఈ నెల 20 నుంచి గ్రామ పంచాయతీల వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం.

ఇప్పటి వరకు శిబిరాలు లేవు : బబ్బూరి శ్రీను, గౌరాయిపల్లి

గ్రామంలో విషజ్వరాలు విజృంభిస్తున్నా ఇప్పటివరకు సిబ్బంది ఎలాంటి వైద్య శిబిరాలు నిర్వహించలేదు. ప్రతీ ఇంట్లో ఒకరిద్దరు జ్వరాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వ వైద్యం అందకపోవడంతో ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించడం తప్పడంలేదు.

Updated Date - Aug 22 , 2025 | 12:59 AM