ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలి
ABN , Publish Date - Jul 05 , 2025 | 12:37 AM
ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ రిజిస్టర్ తనిఖీచేసి ఎంతమంది సిబ్బంది హాజరయ్యారని హాజరు పట్టికను పరిశీలించారు.
ప్రతిఒక్కరూ సమయ పాలన పాటించాలి
లేదంటే కఠిన చర్యలు తీసుకుంటాం
కలెక్టర్ హనుమంతరావు
యాదగిరిగుట్ట రూరల్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ రిజిస్టర్ తనిఖీచేసి ఎంతమంది సిబ్బంది హాజరయ్యారని హాజరు పట్టికను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది ఆస్పత్రికి ప్రతిరోజు వస్తున్నారా? లేదా ? అని ఆరాతీశారు. ప్రతీఒక్కరు సమయ పాలన పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓపీ రిజిస్టర్ పరిశీలించి ప్రతిరోజు ఆసుపత్రికి ఎంతమంది రోగులు వస్తున్నారని సిబ్బందిని అడిగితెలుసుకున్నారు. ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని ఫార్మసీలో మందుల కొరత లేకుండా చూడాలని, అవసరమైన మందులు నిల్వ ఉంచాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ల్యాబ్ టెక్నీషియన్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రికి గైర్హాజరు కావడంతో షోకాజ్ నోటీస్ ఇచ్చారు.
మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి
భువనగిరి (కలెక్టరేట్): మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని ముందుకెళితే లక్ష్యం సాధించడం సులభమవుతుందని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. కలెక్టరేట్‌లో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య జయంతి, దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి యాదయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
భువనగిరి రూరల్: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన చదువుతోపాటు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. భువనగిరి మండలంలోని అనంతారం శివారులోగల మహాత్మాజ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, డిగ్రీ హాస్టల్, మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ఆహారాన్ని అందజేయాలన్నారు. ఆయనవెంట అధికారులు ఉన్నారు.