Share News

ట్రేడ్‌ లైసెన్సలపై వ్యాపారుల నిరాసక్తత

ABN , Publish Date - Oct 08 , 2025 | 12:04 AM

సూర్యాపేట జిల్లాలోని మునిసిపాలిటీల్లో ట్రేడ్‌ లైసెన్స తీసుకోవడంలో వ్యాపారస్తులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ట్రేడ్‌ లైసెన్సలపై వ్యాపారుల నిరాసక్తత

లైసెన్సలు లేకుండానే వ్యాపారాలు

మునిసిపాలిటీ ఆదాయానికి గండి

సూర్యాపేట జిల్లాలోని మునిసిపాలిటీల్లో ట్రేడ్‌ లైసెన్స తీసుకోవడంలో వ్యాపారస్తులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రోజురోజుకూ వ్యాపారాలు విస్తరిస్తున్నాయి. అయితే వ్యాపారులు ట్రేడ్‌ లైసెన్సులు తీసుకోకపోవడంతో ఆ స్థాయిలో ఆదాయం రావడంలేదు.

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేటటౌన్‌)

ట్రేడ్‌ లైసెన్సల కోసం వ్యాపారులు దరఖాస్తు చేసుకుంటే అధికారులు దుకాణాన్ని ముందుగా పరిశీలిస్తారు. స్థలం విలువను బట్టి చదరపు అడుగుకు రూ.5 నుంచి రూ.7వరకు ఫీజు వసూలు చేస్తారు. ఈ క్రమంలో ప్లాస్టిక్‌ దుకాణాలు, గాజుల దుకాణాలు, బేకరీలు, మాంసాహారానికి, ఆటోమొబైల్‌ దుకాణాలకు సాధారణ లైసెన్సలు అందిస్తారు. అదేవిధంగా వెల్డింగ్‌, గ్యాస్‌, అల్యూమినియం, కట్టె కోత మిషన్లు, ఎరువుల దుకాణాలు, ప్రమాదకర విభాగం లైసెన్సలు అందజేశారు. అదేవిధంగా డెయిరీ ఫాం, సిమెంట్‌, ఫార్మాక్లినిక్‌, బుక్‌బైండింగ్‌, ఎలక్ర్టానిక్‌ వస్తువుల తయారీ వంటి వాటికి పారిశ్రామిక లైసెన్సలు అందిస్తారు. అదేవిధంగా బాణాసంచా, గాలిపటాలు, సర్కస్‌ ఎగ్జిబిషన, వినాయక విగ్రహాల విక్రయాలు, రాఖీ వంటి సీజనల్‌ వ్యాపారాలకు తాత్కాలిక లైసెన్సుల అందిస్తారు. ఇలా లైసెన్సలను నాలుగు విభాగాలుగా విభజించి లైసెన్సలు జారీ చేశారు.

సగానికిపైగానే

జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, తిరుమలగిరి, నేరేడుచర్ల మునిసిపాలిటీలు ఉన్నాయి. వీటిలో సూర్యాపేటలో రూ.5వేల వరకు వివిధ రకాల వ్యాపార దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ లైసెన్సలు 2500 వరకు ఉన్నాయి. కోదాడలో 1,630 దుకాణాలు ఉండగా వీటిలో 550 మాత్రమే లైసెన్సలు తీసుకున్నారు. అదేవిధంగా హుజూర్‌నగర్‌లో 820 ఉండగా 548 మాత్రమే లైసెన్స ఉన్నాయి. నేరేడుచర్లలో 285 ఉండగా 202 మాత్రమే లైసెన్సలు తీసుకున్నారు. తిరుమలగిరిలో 532 ఉండగా 473 మాత్రమే లైసెన్స తీసుకున్నారు. మొత్తంగా సగానికి సగం మంది లైసెన్సలు తీసుకోవడం లేదు. లైసెన్సలు కొంతమంది ఒక ఏడాదికి తీసుకుంటే మరో ఏడాది రెన్యూవల్‌కు ముందుకు రావడంలేదు. అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, మునిసిపాలిటీ అధికారులు పరిశుభ్రతపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లైసెన్సలపై వ్యాపారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ముఖ్యంగా లైసెన్సలు తీసుకుంటే బ్యాంకురుణాలు వస్తాయని, అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు, ప్రకృతి విపత్తు సమయంలో ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుందని అవగాహన కల్పిస్తే ప్రయోజనం ఉంటుందని లైసెన్స పొందిన వ్యాపారులు పేర్కొంటున్నారు.

స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాం

ప్రతి ఒక్క వ్యాపారి విధిగా ట్రేడ్‌ లైసెన్సలు తీసుకోవాలి. ఇప్పటికే స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాం. బృందాలుగా ఏర్పడి లైసెన్సులు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. లైసెన్స తీసుకోకుంటే జరిమానా విధిస్తున్నాం.

- సీహెచ హన్మంతరెడ్డి, సూర్యాపేట మునిసిపల్‌ కమిషనర్‌

Updated Date - Oct 08 , 2025 | 12:04 AM