భూ సమస్యల పరిష్కారం దిశగా
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:08 AM
భూముల చిక్కులు పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలులోకి తెచ్చిన భూభారతి చట్టంపై ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఈ నెల 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన భూభారతి సదస్సుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 71,823 దరఖాస్తులు వచ్చాయి.
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల వడపోత
సాదాబైనామాలపైనే అందరి ఆసక్తి
ఉమ్మడి జిల్లాలో భారీగా దరఖాస్తులు
ఆగస్టు 15 నాటికి అన్నింటికీ పరిష్కారం
పరిష్కరించకపోతే కారణాలు తెలియజేయనున్న అధికారులు
(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): భూముల చిక్కులు పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలులోకి తెచ్చిన భూభారతి చట్టంపై ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఈ నెల 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన భూభారతి సదస్సుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 71,823 దరఖాస్తులు వచ్చాయి. ప్రతీ రెవెన్యూ గ్రామంలో వేర్వేరు సమస్యలపై దరఖాస్తులు రాగా, రెవెన్యూ సిబ్బంది వాటిని కేటగిరీల వారీగా విభజించి ఫైలింగ్ చేశారు. నకిరేకల్, గరిడేపల్లి మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాల్లో ముందస్తుగానే రెవెన్యూ సదస్సులు నిర్వహించగా, మిగిలిన అన్ని గ్రామాల్లో తాజాగా సదస్సులు నిర్వహించి సమస్యలన్నింటిపై దరఖాస్తులు తీసుకున్నారు. ఈ దరఖాస్తులన్నింటినీ ఆగస్టు 15లోగా పరిష్కరించి దేశంలో అత్యుత్తమ రెవెన్యూ వ్యవస్థగా నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
భూభారతితో సాదాబైనామాల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తారనే ఆశాభావం రైతుల్లో ఉంది. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాల కాలంగా పెద్ద సంఖ్యలో సాదాబైనామా క్రయ, విక్రయాలు కొనసాగాయి. రైతులు, భూయజమానులు వీటి రిజిస్ట్రేషన్ల కోసం భూభారతిపై ఆశలు పెంచుకున్నా రు. గత ప్రభుత్వ హయాంలో 2014కు ముందు ఉన్న సాదాబైనామాలన్నింటికీ మోక్షం కల్పించాలని నిర్ణయించి 2020 అక్టోబరు 12 నుంచి నవంబరు 10వరకు అందుకు గడువు ఇచ్చారు. ఈ నిర్ణీత వ్యవధిలో మీ-సేవా కేంద్రా ల్లో దరఖాస్తు చేసుకోవాలని నాటి ప్రభుత్వం సూచించిం ది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఆ సమయంలో పెద్దసంఖ్య లో సాదాబైనామా దరఖాస్తులు వచ్చాయి. అయితే ధర ణి పోర్టల్ అమలులోకి వచ్చాక సాదాబైనామాల ప్రస్తావన లేకపోవడంతో ఆ దరఖాస్తులన్నీ మూలనపడ్డాయి. తాజాగా, ఽభూభారతిలో సెక్షన్-6 ప్రకారం 2020లో మీ- సేవా కేంద్రాల ద్వారా ఇచ్చిన దరఖాస్తులనే పరిగణనలో కి తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తరువాత జరిగే లావాదేవీలపై ప్రభుత్వం కీలక నిర్ణ యం తీసుకొని 2023 వరకున్న సాదాబైనామాలకు అనుమతించాలని రైతులు కోరుతున్నారు.ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సుల్లో మాత్రం సాదాబైనామాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఇప్పటివర కు పెండింగ్ ఉన్న భూయజమానులంతా దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ సదస్సుల్లో సాదాబైనామాల దరఖాస్తులు నల్లగొండ జిల్లాలో 6,793 రాగా, యాదాద్రి జిల్లాలో 3,458, సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 15,678 వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల్లో సాదాబైనామాలవే సింహభాగం ఉన్నాయి. అయితే సాదాబైనామాలపై హైకోర్టులోనూ కేసు పెండింగ్‌లో ఉండడంతో ఆ తీర్పు వచ్చేంతవరకు వేచి ఉండి దానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో భారీగా దరఖాస్తులు
భూభారతి సదస్సుల్లో ఉమ్మడి జిల్లాలో రెవెన్యూ సమస్యలపై భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి నల్లగొం డ జిల్లాలో మొత్తం 1,136 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో 71,823 దరఖాస్తులు రాగా, వీటిలో అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 44,741 దరఖాస్తులు వచ్చాయి. అందులో అత్యధికంగా సాదాబైనామాలకు సంబంధించినవి ఉండగా, ఆ తర్వాత మిస్సింగ్ సర్వే నెంబర్లు, పౌతి, అసైన్డ్‌భూముల సమస్యలు(పీవోటీలు), పెండింగ్ మ్యుటేషన్లు, క్లరికల్ మిస్టేక్స్, భాగా పంపిణీలు, సర్వేనెంబర్ల ఎర్రర్స్, నాలా సమస్యలు, ఖాతాలు కలిసిపోయినవి, కోర్టు కేసులు, తదితర విభాగాలకు సంబంధించి ఉన్నాయి.
ఎక్కడికక్కడే పరిష్కరించేలా విభజన
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులన్నింటినీ నిర్దిష్ట సూచనల ప్రకారం క్రోడీకరిస్తున్నారు. తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్, కలెక్టర్ స్థాయిలో పరిష్కరించేవాటిని ఆయా అధికారులకు పంపించేలా దరఖాస్తులను వర్గీకరిస్తున్నారు. సీసీఎల్‌ఏ స్థాయిలో పరిష్కరించాల్సినవి, కోర్టు కేసులకు సంబంధించినవి, ప్రభుత్వ విధాన నిర్ణయంతో పరిష్కరించాల్సినవి గుర్తించి వాటిని పక్కన పెడుతున్నారు. అందుకోసం అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తుల వర్గీకరణతో పాటు, ఆన్‌లైన్ నమోదు కొనసాగుతోంది. ఇది పూర్తయ్యాక సంబంధిత దరఖాస్తుదారులను పిలిపించి ఆయా స్థాయిల్లో వాటిని పరిష్కరిస్తారు. అదేవిధంగా పరిష్కరించలేని దరఖాస్తులకు సంబంధించి సైతం సదరు దరఖాస్తుదారులకు ఆ విషయాన్ని వివరించాలని నిర్ణయించారు. ఆగస్టు 15నాటికి ప్రతీ దరఖాస్తును కచ్చితంగా పరిష్కరించాలనే లక్ష్యంతో రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
జిల్లా దరఖాస్తులు
నల్లగొండ 12,754
యాదాద్రి 14,328
సూర్యాపేట 44,741
మొత్తం 71,823