Share News

నేడు గణేష్‌ నిమజ్జనోత్సవం

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:33 AM

నవరాత్రులు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు నేడు తల్లి గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా గణేష్‌ నిమజ్జన శోభాయాత్రలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విగ్రహాలను నిమజ్జనం చేయనున్న చెరువుల వద్ద అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు, చర్యలు తీసుకుంటున్నారు.

నేడు గణేష్‌ నిమజ్జనోత్సవం

జిల్లా అంతటా శోభాయాత్రలు

భారీ బందోబస్తు, ఏర్పాట్లు పూర్తి

36 గంటలపాటు మద్యం దుకాణాల బంద్‌

మిలాదున్‌నబీ ర్యాలీ 8కి వాయిదా

భువనగిరి టౌన్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): నవరాత్రులు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు నేడు తల్లి గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా గణేష్‌ నిమజ్జన శోభాయాత్రలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విగ్రహాలను నిమజ్జనం చేయనున్న చెరువుల వద్ద అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు, చర్యలు తీసుకుంటున్నారు. మునిసిపాలిటీలు, స్థానిక సంస్థలు, రెవెన్యూ, పోలీస్‌, ట్రాన్స్‌కో, ఇరిగేషన్‌, మత్స్య, ఎక్సైజ్‌, ఆర్‌అండ్‌బీ, వైద్యఆరోగ్య తదితర ప్రభుత్వ శాఖ లు, గణేష్‌ ఉత్సవ సమితులు సంయుక్తంగా నిమజ్జన ఏర్పాట్లలో భాగస్వాములయ్యాయి. జిల్లాలో సుమారు 4వేలకు పైబడి విగ్రహాలను ప్రతిష్ఠించగా ఇప్పటివరకు సుమారు వెయ్యి విగ్రహాల నిమజ్జనం పూర్తయినట్టు సమాచారం. కాగా శుక్రవారం సుమారు 3వేల విగ్రహాలను జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భక్తులు నిమజ్జనం చేయనున్నారు. మిగతా విగ్రహాలను శని, ఆదివారాల్లో గంగమ్మ ఒడికి చేర్చనున్నారు. అయితే అధికారులు మాత్రం అన్ని విగ్రహాలను శుక్రవారమే నిమజ్జనం చేయాలని సూచిస్తున్నారు. నిమజ్జన శోభాయాత్రలో డీజేల వినియోగంపై నిషే ధం విధించారు. జిల్లాలోని 82 వైన్స్‌, 18 బార్లు శుక్రవా రం ఉదయం నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ పి.సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, జిల్లా కేంద్రం భువనగిరిలో శుక్రవారం నిర్వహించాల్సిన మిలాదున్‌ నబీ ర్యాలీని 8వ తేదీకి వాయిదా వేసినట్టు నిర్వాహకులు తెలిపారు.

భువనగిరిలో ..

భువనగిరి పెద్ద చెరువులో గణేష్‌ నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. పట్టణంలో నాలుగు మార్గాల్లో ప్రారంభమయ్యే శోభాయాత్రలు జగ్జీవన్‌రామ్‌ చౌరస్తా వద్ద కలసి పెద్ద చెరువు వైపు సామూహికంగా సాగుతాయి. ఇక్కడ గణేష్‌ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన వేదిక ద్వారా శోభాయాత్రకు స్వాగతం పలుకుతారు. అందుకోసం పట్టణాన్ని కాషాయ జెండాలు, స్వాగత తోరణాలు, ప్లెక్సీలతో అలంకరించారు. పట్టణమంతటా అదనపు లైట్లు బిగించి రహదారులపై గుంతలను పూడ్చారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్‌, నెట్‌ కేబుల్స్‌ తొలగించి చెట్ల కొమ్మలను నరికి వేశారు. పెద్ద చెరువు వద్ద క్రేన్లు, బారీకేడ్లు, లైట్లు, మెడికల్‌ క్యాంప్‌, గజ ఈతగాళ్లు, తాగునీరు, సాంస్కృతిక ప్రదర్శనలు తదితర ఏర్పాట్లు చేశారు. అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, మునిసిపల్‌ కమిషనర్‌ జి.రామలింగం తదితర అధికారులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అలాగే, రాయిగిరి చెరువు వద్ద కూడా నిమజ్జన ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.కాగా, చివరి రోజు గురువారం భువనగిరిలో కలెక్టర్‌ హనుమంతరావు తదితర ప్రముఖులు పలు మండపాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొని అన్నదానం కార్యక్రమాలను ప్రారంభించారు.

శాంతియుతంగా నిర్వహించాలి : ఎం.హనుమంతరావు, కలెక్టర్‌

గణేష్‌ నిమజ్జన శోభాయాత్రల ను శాంతియుతంగా నిర్వహించాలి. నిమజ్జనం కోసం చెరువుల వద్ద పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశాం. చెరువులు నిండి ఉండడంతో ఉత్సవాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు, వృద్ధులు, మహిళలు నిమజ్జనం కోసం చెరువులు, వాగుల్లోకి దిగవద్దు. ఊరేగింపులు భక్తిభావాన్ని నింపేలా ఉండాలి.

భారీ బందోబస్తు : అక్షాంశ్‌యాదవ్‌, డీసీపీ

గణేష్‌ నిమజ్జన శోభాయాత్రల దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్య లు తీసుకుంటాం. ఊరేగింపులు ఉదయమే ప్రారంభించి రాత్రి త్వరగా ముగించాలి. సీసీ కెమెరాలు, మొబైల్‌ పెట్రోలింగ్‌ ద్వా రా ఊరేగింపులను పర్యవేక్షిస్తాం. మహిళలకు ఇబ్బందులు కలిగించే ఆకతాయిల నియంత్రణకు షీటీంలను ఏర్పాటు చేశాం.

సంప్రదాయాలు పాటించాలి : శ్రీశైలం, భువనగిరి గణేష్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు

గణేష్‌ నిమజ్జన శోభాయాత్రలో నిర్వాహకులు సంప్రదాయాలను పాటించాలి. భక్తి పాటలు, భజనలు, ప్రదర్శనలు మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆశ్లీలతకు అవకాశం ఇవ్వొద్దు. శోభాయాత్రకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశాం. ఇక్కడ పలువురు ప్రముఖులు శోభాయాత్రకు స్వాగతం పలుకుతారు.

Updated Date - Sep 05 , 2025 | 12:33 AM