Share News

మూడేళ్లు.. రూ.7 కోట్లు

ABN , Publish Date - Jun 05 , 2025 | 12:18 AM

పేద విద్యార్థులు చదువుకునేందుకు ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకువచ్చింది.

మూడేళ్లు.. రూ.7 కోట్లు

పేరుకుపోయిన ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు

ఇబ్బందుల్లో ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు

పేద విద్యార్థులు చదువుకునేందుకు ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకువచ్చింది. ప్రైవేట్‌ కళాశాలల్లో చదివినప్పటికీ ప్రభుత్వం ఫీజు చెల్లిస్తుంది. దీంతో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కాకుండా ఉంటారని భావించింది. అయితే మూడేళ్లుగా నిధులు విడుదలకావడం లేదు. సుమారు రూ.7 కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఆర్థిక ఇబ్బందులతో కళాశాలలను నెట్టుకొస్తున్నారు. స్కాలర్‌షిప్‌లు కూడా మంజూరు కాకపోవడంతో విద్యార్థులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట)

ప్రైవేట్‌ కళాశాలల నిర్వహణ యాజమాన్యాలకు భారంగా మారింది. తక్కువ ఫీజుతో స్థానికంగా పేద విద్యార్థులకు ఉన్నత చదువులను అందిస్తున్నారు. అయితే ప్రభుత్వం అం దించాల్సిన ఫీజురీయింబర్స్‌మెంట్‌ అందక ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఏడాదికి రూ.5,300, బీసీలకు అడ్మిషన చేరిన నాటి నుంచి రూ.4,200వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ఫీజురీయింబర్స్‌మెంట్‌ను కళాశాలలు విద్యార్థుల ఫీజు కింద జమచేసుకుంటారు. ఇవి రాకపోవడంతో సొంత డబ్బులతో కళాశాలను నిర్వహిస్తున్నారు. కొందరు ఆర్థికభారం భరించలేక ఇటీవల ప్రైవేట్‌ కళాశాలను ఇతర ప్రాంతాల వారికి విక్రయిస్తున్నారు.

నిధులు విడుదల కాకపోవడంతో..

మూడేళ్లుగా ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలకు ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ నిధులు విడుదల కావడంలేదు. జిల్లాలో గతంలో ప్రభు త్వజూనియర్‌ కళాశాలలు75 ఉండగా ప్రస్తుతం 40కి ఆ సంఖ్య చేరింది. కళాశాలలకు 2022-23, 2023-24, 2024-25 వరకు సుమారు రూ.6 నుంచి రూ.7 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. దాదాపు జూనియర్‌ కళాశాలలు అన్ని అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. చాలా తక్కువ సంఖ్యలో సొంతంగా నిర్మించుకొని కళాశాలలను నడుపుతున్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ రాక అధ్యాపకులకు వేతనాలు ఇస్తూ, అద్దెలు చెల్లిస్తూ అప్పులపాలవుతున్నారు. కళశాలల అద్దెలు నెలకు రూ. 50వేలకు పైగా ఉంటున్నాయి. దీంతో పలు కళాశాలలు మూతబడ్డాయి. దీంతో సిబ్బందికి ఉపాధి కరువైంది.

స్కాలర్‌షిప్‌లు కూడా బకాయిలే..

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంటర్‌ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరంలోనూ ఒక్కొక్క విద్యార్థికి స్కాలర్‌షిప్‌ కింద రూ.1,710 చెల్లించాల్సి ఉంది. వీటిని కూడా ప్రభుత్వం చెల్లించడంలేదు. దీంతో విద్యార్థులకు రోజువారి ఖర్చులకు డబ్బులు లేకుండాపోయాయి. అనేకమంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, తిరుమలగిరి, నేరుడుచర్ల మునిసిపాలిటీల్లోని కళాశాలల్లో చదువుతుంటారు. ప్రభుత్వం స్కాలర్‌షి్‌షలు మంజూరు చేస్తే కనీసం పుస్తకాలకు కొనుగోలు చేయడానికి ఆ డబ్బులు అక్కరకు వస్తాయని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడానే కళాశాలల యజమాన్యాలకు అందజేస్తామంటున్నారు. ఇక స్కాలర్‌షి్‌పలు నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే వెళతాయన్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి

కళాశాలలను ప్రభుత్వం ఆదుకోవాలి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గతంలో 18 ప్రైవేట్‌ కళాశాలలు ఉండేవి. కార్పొరేట్‌ కళాశాలలు కాక ప్రస్తుతం ఆరు కళాశాలలు మాత్రమే మిగిలాయి. కేవలం ప్రభుత్వం సకాలంలో ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షి్‌పలు విడుదల చేయకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా పెంచాల్సిన అవసరం ఉంది.

కొలిచెల్మ శ్రీనివాస్‌, మాజీ కరస్పాండెంట్‌

విద్యకు దూరం చేసే కుట్ర

ప్రభుత్వం పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రలు చేస్తోంది. ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షి్‌పలు రాక విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. కార్పొరేట్‌ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.

ఎర్ర అఖిల్‌కుమార్‌, పీడీఎ్‌సయూ నాయకుడు

Updated Date - Jun 05 , 2025 | 12:18 AM