అక్కడ జలకళ..ఇక్కడ వెలవెల
ABN , Publish Date - May 09 , 2025 | 12:22 AM
(ఆంధ్రజ్యోతి -వేములపల్లి) పాలేరు జలాలను వృథాగా పోకుండా అడ్డుకట్ట వేసి సాగు, తాగు నీటి కష్టాలను తీర్చాలన్న తలంపుతో చేపట్టిన చెక్‌డ్యామ్‌ల నిర్మా ణం నాలుగేళ్లుగా నత్తనడకన కొన సాగుతున్నాయి.
మండలంలోని సల్కునూరు, రావులపెంట గ్రామాల మధ్య ప్రవహిస్తున్న పాలేరు వాగుపై 2020 జూలైలో రూ.2.48 కోట్లతో చెక్‌డ్యామ్ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ 2021లో పనులను ప్రారంభించారు. ప్రారంభ దశలో పనులు వేగంగా చేపట్టిన కాంట్రాక్టర్ ఆ తరువాత పనుల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ రావడంతో నేటికి నిర్మాణం అసంపూర్తిగానే ఉండిపోయింది. నాటి నుంచి పలుమార్లు పనులను చేపట్టాలని కాంట్రాక్టర్‌ను అధికారులు ఆదేశిస్తున్నప్పటికీ నిర్లక్ష్యం గా వ్యవహరించడంతో ఆరుసార్లు నోటీసులు సైతం జారీ చేసినా నిర్మాణ పనులను మాత్రం పూర్తి కాలేదు. ఇప్పటివరకు రూ.1.87 కోట్ల మేరా పనులను చేపట్టడంతో సదరు కాంట్రాక్టర్‌కు రూ.1.50 కోట్లను చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఇంకా రూ.67 లక్షల పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నప్పటికీ సదరు కాంట్రాక్టర్ తనకేమీ పట్టన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో నాలుగేళ్లుగా పాలేరు జలాలు వృఽథాగా కిందకు పోతున్నాయి. కొద్ది రోజులుగా అధికారులు కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తీసుకురాగా ఇటీవల పనులను పునఃప్రారంభించారు.
పూర్తయినవి ఇవీ..
పాలేరు వాగుపై సల్కునూరు సమీపంలో రూ.4.32 కోట్లతో మరొకటి, కామేపల్లి గ్రామ శివారులో రూ.3.44 కోట్లతో మరో చెక్‌డ్యాం నిర్మాణానికి 2023 అక్టోబర్ 3న ప్రారంభించారు. వాటి నిర్మాణ పనులు పూర్తయి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జలకళతో కళకళలాడుతున్నాయి. కానీ వీటికంటే ముం దు ప్రారంభించిన సల్కునూరు, రావులపెంట చెక్ డ్యాం నిర్మాణ పనులు మాత్రం ఇంతవరకు పూర్తి కాకపోవడం పలు విమర్శలకు దారితీసింది. దీంతో సమీపంలో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోవడంతోపాటు పశుపక్ష్యాదులు నీటి కోసం అలమటించాల్సిన పరిస్థితి నెలకొంది. సదరు కాంట్రాక్టర్ పనులను వేగవంతంగా పూర్తి చేసి ఈ సారైనా పాలేరు జలాలు వృధా పోకుండా వానాకాలం నాటికి జలకళను సంతరించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సమీప గ్రామాల ప్రజలు, రైతులు కోరుకుంటున్నారు.
పనులను పూర్తి చేయాలి
చెక్‌డ్యాం అసంపూర్ణంగా ఉండడంతో పాలేరు జలాలు వృఽథా గా పోతున్నాయి. దీంతో సమీపంలో భూగర్భజలాలు తగ్గి బోరుబావుల ఆధారంగా సాగు కష్టంగా మారుతుంది. మరోవైపు వరద సమయంలో చెక్ డ్యాం పనులు పూర్తి కాకపోవడంతో ఇరువైపులా భూమి కోతకు గురై పంట పొలాలు నష్టపోతున్నాం. అధికారులు పనులు పూర్తయ్యేలా కృషి చేయాలి.
- జెర్రిపోతుల చంద్రయ్య (రైతు, సల్కునూరు)
నెల రోజుల్లో పూర్తయ్యేలా కృషి
చెక్‌డ్యామ్ నిర్మాణంలో మిగిలిన పనులను మరో నెల రోజు ల్లో పూర్తయ్యేలా కృషి చేస్తాం. ఇప్పటికే కాంట్రాక్టర్ పెండింగ్ పనులను పునఃప్రారంభించారు. ఈ సీజనలో పాలేరు జలాలు వృఽథాగా కిందకు పోకుండా చెక్‌డ్యామ్ నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. -పాండునాయక్ (ఇరిగేషన ఈఈ)