Share News

బతుకులో తీపి లేదు కారమే మిగిలింది

ABN , Publish Date - May 25 , 2025 | 12:21 AM

భోజనం రుచికరంగా ఉండాలంటే చేయి తిరిగిన చెఫ్‌తో వంట చేయించాల్సిందే. అయితే వంట రుచికరంగా ఉండేందుకు చేయి తిరిగిన చెఫ్‌తో వండితే మాత్రమే సరిపోదు.. ఉప్పు ‘కారం’ సరిపడా పడితేనే ఇష్టమైన ఆహారాన్ని ఆహా అంటూ లొట్టలేసుకుని తింటాం.

బతుకులో తీపి లేదు కారమే మిగిలింది

మిల్లు నడిస్తినే ఇల్లు గడిచేది

ఎండాకాలం వస్తే ఏడుపొస్తది

ఊపిరాడదు, నిద్రపట్టదు

రెండు పూటలా స్నానం.. అయినా ఉపశమనం కరువు

(ఆంధ్రజ్యోతి-నార్కట్‌పల్లి): భోజనం రుచికరంగా ఉండాలంటే చేయి తిరిగిన చెఫ్‌తో వంట చేయించాల్సిందే. అయితే వంట రుచికరంగా ఉండేందుకు చేయి తిరిగిన చెఫ్‌తో వండితే మాత్రమే సరిపోదు.. ఉప్పు ‘కారం’ సరిపడా పడితేనే ఇష్టమైన ఆహారాన్ని ఆహా అంటూ లొట్టలేసుకుని తింటాం. పైగా తెలంగాణా ప్రాంత ప్రజలకు ‘కా రం’ మీద కాస్త మమకారం ఎక్కువే. ఇక్కడి సంప్రదాయ వంటకాల్లో వండే పదార్థం, ఆహారం ఏదైనాసరే కొంత మిర్చి ఘాటు తగలాల్సిందే. లేదంటే చప్పగా ఉందంటూ నిట్టూరుస్తారు. అదీ ఎండు మిర్చి కారానికి ఉన్న ప్రాధా న్యం. అయితే పారిశ్రామిక వాడలు, పట్టణాల్లో అయితే ఎండు మిర్చిని పెద్ద పెద్ద యంత్రాలతో కారంగా మార్చి నేరుగా ప్యాకెట్ల రూపంలో మార్కెటింగ్‌ చేస్తున్నారు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో అయితే చేనులో పెరిగిన ఎండు మిర్చి కారంగా మారి మన ఇంటికి చేరడంలో ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి ఎంతో మంది మహిళలు కారం మిల్లులను నిర్వహిస్తున్నారు. ఆరోగ్యానికి హానికరమని తెలిసినా తప్పని జీవన ఆరాటంలో కారంతో పోరాటం చేస్తున్న ఆ మహిళల శ్రమను గుర్తించడం మన కనీస మానవత. కంట్లో నలత పడితేనే విలవిలలాడి పోతాం. అలాంటిది కంట్లో కారం ఽధూళి పడితే పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఎంత కాలం పనిచేసినా ‘కారం’ గానే తప్ప ‘తీపి’ లేని జీవితాలే అవుతున్న కారం మిల్లులను నడిపే మహిళల జీవన చిత్రంపై నేటి ‘సండే స్పెషల్‌’..

కారం మిల్లుల్లో పనిచేసే మహిళలకు ఏకాగ్రత తప్పనిసరి.ప్రస్తుతం కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక నమూనా తో వచ్చిన కారం మిల్లులను నడుపుతున్నారు. కానీ 50ఏళ్ల కిందట అలా కాదు. రోకళ్ల స్టాండ్‌కు అడుగుభాగంలో రెండు గుంటలు ఉండేవి. వాటిలో ఎండు మిర్చి వేసి దంచేటప్పుడు పొరకతో గుంటలోకి దోపడం, కారం పొడిని రేకుతో లాగడం వంటివి చేసేవారు. ఎండు మిర్చి వేసి రోకళ్లతో దంచేటప్పుడు ఏ మాత్రం ఏకాగ్రత చెదిరినా, దృష్టి మరలినా ప్రమాదం బారిన పడాల్సిందే. ఎండు మిర్చిని పొడిగా మార్చేందుకు దంచుతూ వేగంగా కిందికి పైకి కదిలే స్టీలు రోకళ్ల కింద వేలు పడిందా నలిగిపోవాల్సిందే. ఇలా రోకళ్ల కింద ఏమరుపాటులో చేతులు పడి వేళ్లు నలిగిన బాధితులూ ఉన్నారు.

కర్ణబేరి అదిరేలా శబ్ధం :ఏనుగు పద్మ, కారం మిల్లు నిర్వాహకురాలు, నార్కట్‌పల్లి

ఎండు మిర్చిని పొడిగా మార్చాలంటే బియ్యపు పిండి మరలాకాదు. ఇనుప రోకళ్లతో దంచాలి. అందుకోసం రోకళ్ల స్టాండ్‌కు అడుగున భూమి ఏ మాత్రం అదరకుండా పటిష్టమైన సిమెంట్‌ ఫ్లాట్‌ఫాం నిర్మించాలి. రోకళ్లు దిగేలా రాతితో గుంతలను ఏర్పాటు చేయాలి. ఎండు మిర్చిని దంచే సమయంలో రో కళ్ల నుంచి కర్ణభేరి అదిరేలా పెద్దగా శబ్దం వస్తుంది. ఆ సమయంలో మిర్చి దంచే పనిలో ఉన్న వారికి ఏదైనా చెప్పాలనుకుంటే వారి వద్దకు వచ్చి చెవిలోనే చెప్పాల్సి వచ్చేది. ఇప్పటికీ మిర్చిని పట్టించాలంటే అలాంటి రోకళ్లు ఉన్నా వాడే విధానంలో కొంత మార్పు వచ్చింది.

ఎండాకాలం వస్తే ఏడుపొస్తది

కారం గిర్నిని నడపడమంటే అంత సులువుకాదు. ఎండా కాలం వచ్చిందంటే అనుభవించే ఇబ్బందితో ఒక్కోసారి ఏడుపొస్తది. మిర్చి దంచుతుంటే వచ్చే కారం దూళి కంటిలో, ఒంటిపై పడి చెమట ద్వారా ఒళ్లంతా పాకి మంటలు పుడతాయి. రోజుకు రెండు సార్లు స్నానం చేసినా మంటలు తగ్గవు. రాత్రిళ్లు సరిగా నిద్రకూడా రాదు. ఊపిరి తీసుకోవటంలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. అయినా జీవనోపాధి కోసం తప్పటం లేదు. పిండి మర ఆడితేనే, కారం రోకళ్ల చప్పుడవుతేనే మా కుటుంబం గడుస్తది. 12 ఏళ్ల కిందట మా స్వగ్రామం ఎన్నారంలో కూలీ నాలీ పనులు చేసుకునేదాన్ని. నా భర్త లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. కానీ కంటి చూపు కనపడక డ్రైవింగ్‌ వృత్తిని మానేశాడు. దీంతో కారం మిల్లును నడుపుకుంటున్నా. ప్రమాదకరమైన చేతివృత్తులను చేస్తున్న వారికి మాదిరిగానే కారం మిల్లు నడిపే వారికి పెన్షన్‌ ఇస్తే బాగుండు.

ఇంటి వద్దే ఉపాధి ఉంటుందని:కట్టంగూరు లలిత, కారం మిల్లు నిర్వాహకురాలు,

ఎవరి వద్దో లేక ఎక్కడికో వెళ్లి పనిచేయడం కంటే ఇంటి వద్దే ఉండి ఉపాధి చూసుకోవచ్చన్న ఉద్దేశంతో నాలుగేళ్లుగా కారం మిల్లును నడుపుతున్నా. ఇంతకు ముందు రోజువారీ కూలీ పనులు చేసినా పెద్దగా గి ట్టుబాటు లేదు. దీనికి తోడు మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యంలో ఆటో నడుపుకునే నా భర్తకు ఉపాధి కొరవడింది. దీంతో కుటుంబం నడవటం కోసం తప్పనిసరై కారం మిల్లును నడపాల్సి వస్తోంది. కారం దంచేటప్పుడు ఎంత జాగత్త్రలు పా టించినా కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వ స్తుంది. దీంతో ఒక్కోసారి ఈ ఉపాధిని ఎం దుకు ఎంచుకున్నానా అనిపిస్తుంది. వేసవి తప్ప మిగతా సీజన్‌లో పెద్దగా గిరాకీ ఉం డదు. గిరాకీ ఉన్న వేసవిలో అటు ఉష్ణోగత్ర, ఇటు కారం వేడి మంటలతో ఎవరకీ చెప్పుకోలేని అవస్థలు పడతాం. వినియోగదారులు కూడా మా శ్రమను, ఇబ్బందులను గుర్తించి బేరమాడకుండా సహకరించాలి.

నార్కట్‌పల్లి ఒకసారి వేళ్లు నలిగాయి: రంగ ధనమ్మ, కారం మిల్లు నిర్వాహకురాలు, నార్కట్‌పల్లి

1972 నుంచి 2002 వరకు సుమారు 30 ఏళ్ల పాటు నిరంతరాయంగా కారం మిల్లు, పిండి గిర్నీలు నడిపించా. కారం మిల్లు, పిండి మిల్లు ఏదైనా ఆరోగ్యానికి హానికరమే అని తెలిసినా కుటుంబ బాధ్యతలు ఆ పనినే ఉపాధిగా చూపాయి. కా రం దంచేందుకు ఇప్పుడు కొంత అధునాతన యంత్రాలు వచ్చాయి. కానీ 30 ఏళ్ల కిందట ఇలాంటి యంత్రాలు లేవు. రోకళ్లు దంచేప్పుడు వాటి దగ్గరే కూర్చుని ఏకాగ్రతగా ఉండాల్సి వచ్చేది. ఒకసారి ఏమరుపాటుగా ఉన్న సమయంలో రోకలి కింద పడి కుడిచేతి వేళ్లు రెండు నలిగిపోయాయి. అయినా జాగ్రత్త పడుతూ పనిచేశా. కారం మిల్లు నడిపి వచ్చిన రోజు చిన్నపిల్లలను దగ్గరకు తీసుకోవాలంటే కొంత ఆలోచించాల్సి వచ్చేది.

చర్మ సమస్యలు వచ్చేందుకు అవకాశం : డాక్టర్‌ఏ.ఎ్‌స.కే.మనోజ్‌,ఎండీ, జనరల్‌ మెడిసిన్‌, కిమ్స్‌, నార్కట్‌పల్లి

కారం మిల్లుల్లో పనిచేసే వ్యక్తులకు మిరప పొడి కారణంగా ఎక్కువగా చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒంటిపై రాషెస్‌ ఏర్పడి దురద రావడం, కారం ఽధూళితో గొంతు బొంగురుపోవడం వంటివి జరుగుతాయి. కంటిలో పరమాణువులాంటి కారం దూళి పడి కన్ను ఎర్రగా మారడం, కంటి కలకలు రావడం, ఉబ్బడం, నీరు కారడం వంటివి జరుగుతాయి. కొన్ని సమయాల్లో ఒళ్లు ఉబ్బిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కారం వేడితో ఒక్కోసారి శరీరం డీహైడ్రేట్‌ బారిన కూడా పడవచ్చు. ఇలాంటి వాటి బారిన ప డకుండా ఉండాలంటే జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం వహించకూడదు. కళ్లకు పూర్తికవచంగా ఉండే కంటి అద్దాలను వాడాలి. కారం ధూళిని ముక్కు, కన్ను, చెవుల్లోకి వెళ్లకుండా మాస్కులు ధరించాలి. ఒంటికి కూడా పూర్తి రక్షణనిచ్చే ఆర్ఫాన్‌ను వేసుకోవాలి. చేతులకు భుజాల వరకు వచ్చేలా రబ్బరు గ్లౌజ్‌ను వాడాలి. విధిగా వైద్యపరీక్షలు చేయించుకోవాలి.

Updated Date - May 25 , 2025 | 12:21 AM