వరికి మద్దతు కొంతే
ABN , Publish Date - May 29 , 2025 | 11:47 PM
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నెల ముందుగానే పంటలకు మద్దతు ధరలను ప్రకటించింది. ఏటా జూన్‌లో మద్దతు ధరలు ప్రకటించేది. ఈ సారి మే నెలలోనే ప్రకటించింది. ఏటా సాగు ఖర్చు పెరుగుతుండగా, కేంద్ర ప్రభుత్వం పత్తికి మినహా మిగతా పంటలన్నింటికీ గత ఏడాదితో పోల్చితే ధరలను తక్కువగా పెంచింది.
పంటలకు మద్దతు ధరపెంచిన కేంద్ర ప్రభుత్వం
వరికి రూ.69 మాత్రమే పెంపు
పత్తికి రూ.589,కందికి రూ.550, నువ్వులకు రూ.579 పెంపు
(ఆంధ్రజ్యోతి,మోత్కూరు) : కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నెల ముందుగానే పంటలకు మద్దతు ధరలను ప్రకటించింది. ఏటా జూన్‌లో మద్దతు ధరలు ప్రకటించేది. ఈ సారి మే నెలలోనే ప్రకటించింది. ఏటా సాగు ఖర్చు పెరుగుతుండగా, కేంద్ర ప్రభుత్వం పత్తికి మినహా మిగతా పంటలన్నింటికీ గత ఏడాదితో పోల్చితే ధరలను తక్కువగా పెంచింది. పెట్టుబడి వ్యయం మాత్రం గత ఏడాదితో పోల్చితే పెరిగింది.
గత ఏడాది వరికి రూ.117,కందికి రూ.550,నువ్వులకు రూ.632, పొద్దుతిరుగుడు రూ.520,పెసరకు రూ.124 పెంచగా,ఈఏడాది వరికిరూ.69,కందికి రూ. 450,నువ్వులకు రూ.579, పొద్దుతిరుగుడుకు రూ.441, పెసరకు రూ.86 మాత్ర మే పెంచింది. పత్తికి మాత్రం గత ఏడాది రూ.501 పెంచగా, ఈ ఏడాది రూ.589పెంచింది. పెట్ట పంటలకు ఆశించినస్థాయి మద్దుత ధర పెరగపోయి నా, కొంత ఫరవాలేదని,వరి మద్దతు ధర పెంపులో మాత్రం అన్యాయం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం సన్నరకం ధా న్యానికి మద్దతుధర ప్రకటించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం రూ.500బోనస్ ఇస్తోంది.
ఉమ్మడి జిల్లాలో వరి సాగే ఎక్కువ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరి, పత్తి అధికంగా సాగవుతోంది. కంది, వేరుశనగ, తదితర పంటలు చాలా తక్కువ విస్తీర్ణంలో సాగవుతాయి. నువ్వులు, పెసలు, పొద్దుతిరుగుడు, మినుములు లాంటి పంటలు నామమాత్రంగా సాగవుతాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీజన్‌కు సుమారు 12.66లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. సాగునీటి వనరులు అందుబాటులో లేనిప్రాంతాల్లో వానాకాలంలో సన్న రకాలు పండించేది 25 శాతమే. మిగతాదంతా దొడ్డు రకమే. ఆయకట్టు ప్రాంతాల్లో మాత్రం అధికంగా సన్నాలు సాగవుతుంటాయి.
పెరిగిన సాగు ఖర్చులు
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది సాగు ఖర్చులు పెరిగాయి. విత్తనాలు, ట్రాక్టర్ దున్నకం, ఫ్లౌవేయడం, కూలి రేట్లు పెరిగాయి. వ్యవసాయ పంపుసెట్లు, ట్రాక్టర్ లాంటి వ్యవసాయ యంత్రాల రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. సాగు ఖర్చు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం పెంచే మద్దతు ధరలు పెట్టుబడి ఖర్చుల పెరుగుదలతో సరిపోలడం లేదని రైతులు వాపోతున్నారు.
వరి సాగుచేస్తే ఎకరాకు సగటున 22 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. ప్రభుత్వరంగ సంస్థలు కొనుగోలు చేస్తే మద్దతు ధర లభిస్తుంది. ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తే క్వింటా రూ.2,000లకే కొనుగోలుచేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తే పెట్టిన పెట్టుబడే చేతికి వచ్చే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వరం సంస్థలు మద్దతు ధరకు కొనుగోలుచేస్తే రూ.52,118 వస్తుంది. స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం రైతు ఖర్చుకు 50శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించాలి. స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం ఎకరాకు రైతు పెట్టుబడి ఖర్చు రూ.44,900, దానికి 50శాతం రూ.22,450 కలిపితే మొత్తం రూ.67,350 ఆదాయం వచ్చేలా ధర నిర్ణయించాలి. ఆ ధర రావాలంటే క్వింటాకు రూ.3,000 మద్దతు ధర ప్రకటించాలి. కనీసం క్వింటాకు రూ.2,700 మద్దతు ధర ప్రకటిస్తే బాగుంటుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి వరికి ధర పెంచాలని రైతులు కోరుతున్నారు.
మద్దతు ధర ప్రకటించే ముందు రైతు సంఘాలతో చర్చించాలి
యానాల దామోదర్‌రెడ్డి, రైతు, యాదాద్రి సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి
కేంద్ర ప్రభుత్వం ఏటా పంటలకు మద్దతు ధర పెంచుతున్నా రైతులకు గిట్టుబాటు కావడం లేదు. పంట సాగుకు అయ్యే ఖర్చుకు 50శాతం అదనంగా కలిపి మద్దతు ధర ప్రకటించాలని స్వామినాథన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కేంద్రం ప్రభుత్వం వాస్తవ ఖర్చులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించే ముందు రైతులు లేదా రైతు సంఘాల నాయకులతో చర్చించి గిట్టుబాటు అయ్యేలా మద్దతు ధరలు ప్రకటించాలి. లేనిపక్షంలో వ్యవసాయం కుంటుపడుతుంది.
పంటల మద్దతు మద్దతు ధర పెంపు ఇలా...
పంటరకం 2022 2023 పెంపు 2024 పెంపు 2025 పెంపు
వరి (సాధారణం) 2,040 2,183 143 2,300 117 2,369 69
వరి (ఏ-గ్రేడ్) 2,060 2,203 143 2,320 117 2,389 69
పత్తి (మధ్యస్థపింజ) 6,080 6,620 540 7,121 501 7,710 589
పత్తి (పొడువుపింజ) 6,380 7,020 640 7,521 501 8,110 589
కంది 6,600 7,000 400 7,550 550 8,000 450
పెసర 7,755 8,558 803 8,682 124 8,768 86
మినుములు 6,600 6,950 350 7,400 450 7,800 400
జొన్న (హైబ్రీడ్) 2,970 3,180 210 3,371 191 3,699 328
జొన్న (మాల్దండి) 2,990 3,225 235 3,421 196 3,749 328
సజ్జ 2,350 2,500 150 2,625 125 2,775 150
రాగులు 3,578 3,846 268 4,290 444 4,886 596
మొక్కజొన్న 1,962 2,090 128 2,225 135 2,400 175
వేరుశనగ 5,850 6,377 527 6,783 406 7,263 480
పొద్దుతిరుగుడు 6,400 6,760 360 7,280 520 7,721 441
సోయాబిన్ 4,300 4,600 300 4,892 292 5,328 436
నువ్వులు 7,830 8,635 805 9,267 632 9,846 579
వరి సాగుకు ఎకరాకు అయ్యే ఖర్చు
దున్నకం, గొర్రు తోలడం 7,000
విత్తనాలు 45కిలోలు 2,000
ఒరాలు తీసిపెట్టడం 1,000
నాటు కూళ్లు 6,000
కలుపు మందు 500
కలుపు తీత కూళ్లు 1,600
2 డీఏపీ సంచులు 2,700
2 యూరియా 600
గుళికలు 800
సస్యరక్షణ మందులు 1,200
కూళ్లు 1,000
వరి కోత 2,000
ధాన్యం ఆరబోత,
తూర్పార బట్టడం 3,000
ధాన్యం మార్కెట్‌కు రవాణా 500
ఎకరాకు కౌలు 10,000
రైతు/పాలేరు నిర్వహణ
ఖర్చు 5,000
మొత్తం 44,900