Share News

మూడేళ్లుగా వడదెబ్బ మృతులే లేరట!

ABN , Publish Date - May 12 , 2025 | 12:23 AM

వడదెబ్బకు గురై పలువురు చనిపోతున్నప్పటికీ వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ పరిహారం అందడంలేదు.

మూడేళ్లుగా వడదెబ్బ మృతులే లేరట!

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట)

వడదెబ్బకు గురై పలువురు చనిపోతున్నప్పటికీ వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ పరిహారం అందడంలేదు. సూర్యా పేట జిల్లాలో ఎక్కు వగా ఉపాధిహామీ పనులకు వెళ్లి కూలీలు వడదెబ్బకు గురై చనిపోతున్నారు. అయినప్పటికీ రికార్డుల్లో ఎవరినీ నమోదు చేయలేదు. గతంలో ప్రభుత్వ ఆర్థిక సహాయం రూ.50వేలు ఉండగా ప్రస్తుతం రూ. 4లక్షల వరకు పెంచింది. వాస్తవానికి మూడేళ్లలో 21మంది వడదెబ్బతో చనిపోయారని అనధికారిక సమాచారం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం నేటికీ ఎవరిని గుర్తించలేదు.

త్రిమన కమిటీతో గుర్తింపు

వడదెబ్బకు గురైన చనిపోయిన వారి వివరాలను కుటుంబ సభ్యులు తహసీల్దార్‌కు అందించాలి.తహసీల్థార్‌, ఎస్‌ఐ, డాక్టర్‌ పరిశీలించి వివరాలు సేకరిస్తారు. ఇతరత్రా జబ్బులు ఉన్నాయో లేదో ఆరా తీస్తారు. అనంతరం వారు నివేదికను కలెక్టరేట్‌కు అందజేస్తారు. ప్రభుత్వానికి ఆ నివేదికను జిల్లా స్థాయి అధికారిని పంపించి మృతుల కుటుంబసభ్యులకు ఆర్థికసాయం ఇస్తారు.

ఇటీవల ముగ్గురు

చిలుకూరు మండలం కొడారు కోటయ్య(58) 15రోజుల క్రితం ఉపాధి పనులకు వెళ్లి అదే రోజు వడదెబ్బకు గురైచనిపోయారు. 12 రోజుల క్రితం ఆత్మకూరు(ఎస్‌) మండలం గట్టికల్‌ గ్రామా నికి చెందిన తలారీ నర్సయ్య(58) ఉపాధి పనికి వెళ్లి వడదెబ్బతో చనిపోయారు. తహసీల్దార్‌ విచారణ పూర్తయ్యింది. అదేవిధంగా మిడ్తనపల్లి గ్రామానికి చెందిన పాశం జానమ్మ(80) ఉపాధి పనులకెళ్లి వారం కిందట అస్వస్తతకు గురై ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఈ నెల 8న చనిపోయింది.

ఇతరత్రా జబ్బులున్నాయని..

వడదెబ్బతో చనిపోయినప్పుడు అతడికి గతంలోనే స్టంట్‌ వేశారని, గుండెపోటుతోనే చనిపోయారని త్రిమన కమిటీ నివేదికఇవ్వడంతో వడదెబ్బ మృతుల కుటుంబసభ్యులకు నష్టపరిహారం అందడంలేదు. పాశం జానమ్మకు కాలుకు దెబ్బ తగిలి ఉండడంతో దాంతో చనిపోయినట్లు అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. చనిపోయిన వారి పోస్టుమార్టం నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాక వాతావరణ నివేదికను తెప్పించుకుంటున్నారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడే అర్హులవుతారు. ఇన్ని నిబంధనలతో జిల్లాలో ఏ ఒక్కరికీ ప్రభుత్వం నుంచి ఆర్థికసహాయం అందే మార్గంకనిపించడం లేదు. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, మండుతున్న ఎండల్లో పనిచేయడం వల్లే ఎక్కువ మంది వడదెబ్బకు గురవుతున్నారు.

త్రిమన రిపోర్టు ఆధారంగా ప్రభుత్వసాయం

వడదెబ్బకు గురై చనిపోయిన వారిని తహసీల్దార్‌, డాక్టర్‌, ఎస్‌ఐ పరిశీలించి నివేదిక అందజేస్తారు. దాని ప్రకారం కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందుతుంది.

రాంబాబు, అదనపు కలెక్టర్‌

Updated Date - May 12 , 2025 | 12:23 AM