భువన సుందరంగా..
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:39 PM
భువనగిరి పట్టణ ప్రధాన రహదారి పువ్వులతో కనువిందు కానుంది.
పట్టణం ప్రధాన రహదారికి నూతన శోభ
రహదారి మధ్యలో పూల మొక్కలు
2.5 కిలోమీటర్లు, రూ. 40 లక్షలు, 60 వేలకు పైగా మొక్కలు
భువనగిరి టౌన, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): భువనగిరి పట్టణ ప్రధాన రహదారి పువ్వులతో కనువిందు కానుంది. గతంలో రహదారికి ఇరువైపులా, మధ్యలో మొక్కలు నాటగా తాజాగా రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌లో పూల మొక్కలు నాటుతున్నారు. సుమారు రూ.40 లక్షల హెచఎండీఏ వ్యయంతో చేపట్టిన పూలమొక్కల పనులను ఇటీవలే ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. టీచర్స్ కాలనీ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు 2.5 కిలోమీటర్లపాటు డివైడర్ మధ్యలో మొక్కలు నాటనున్నారు. పూల మొక్కలను హెచఎండీఏ ఉచితంగా అందిస్తుండగా, కాంట్రాక్టర్ రూ.40లక్షలతో మొక్కలను నాటి రెండు సంవత్సరాల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. రెండేళ్ల అనంతరం నుంచి నిర్వహణ బాధ్యత మునిసిపాలిటీ నాలుగైదు వర్ణాలతో కూడిన ఒకే తరహా సుమారు 60 వేలకు పైగా మొక్కలు నాటి సంరక్షించనుంది. రూ.25 కోట్లతో చేపట్టిన పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనులు చివరి దశకు చేరాయి. రూ.8 కోట్ల విద్యుత టవర్స్ పనులు చివరి దశకు చేరగా, రూ.1.55 కోట్లతో ఫుట్‌పాత టైల్స్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. అలాగే పట్టణ ప్రధాన రహదారిపై ఉన్న హైదరాబాద్, జగదేవ్‌పూర్, వినాయకచౌరస్తా, పాతబస్టాండ్ చౌరస్తా అభివృద్ధికి ప్రతిపాదించారు. దీంతో ప్రతిపాదిత పనులన్నీ పూర్తయితే పట్టణ ప్రధాన రహదారి సుందరమయం కానుంది.