నిధుల్లేక నిలిచిన పనులు
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:18 AM
ఇటీవల కొలువైన గ్రామ పాలకవర్గాలు పంచాయతీకి పక్కా భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నా యి.
కొనసాగుతున్న పంచాయతీ భవనాల నిర్మాణాలు
స్థలాల కొరతతో కొన్నిచోట్ల ప్రారంభం కాని వైనం
అరకొర వసతుల మధ్య నిర్వహణ
ఇటీవల కొలువైన గ్రామ పాలకవర్గాలు పంచాయతీకి పక్కా భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నా యి. పరిపాలనా సౌలభ్యం కోసం 500 జనాభా కలిగిన తండాలు, గూడెంలను గత ప్రభుత్వనం పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. అయితే నూతన గ్రామాల్లో పక్కా భవనాలు లేవు. దీంతో అంగనవాడీ, ప్రభుత్వ పాఠశాల, అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. అరకొర వసతుల మధ్య పాలకవర్గాలు, అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు.
- (ఆంధ్రజ్యోతి-సూర్యాపేట (కలెక్టరేట్)
నూతన గ్రామపంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించేందుకు గత, ప్రస్తుత ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాయి. ఉపాధిహామీ నిధులతో పంచాయతీ ల భవనన నిర్మాణ పనులను ప్రారంభించారు. సర్పంచ,కార్యదర్శులకు ఒకటి చొప్పున గదులతో పాటు సమావేశాలు నిర్వహించేందుకు హాలు, స్టోర్ రూంతో పాటు మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకోసం బీఆర్‌ఎస్ హయాంలో ఒక్కో భవనానికి సుమారు రూ.14లక్షల నుంచి రూ.20లక్షల వరకు మంజూరు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కో గ్రామ పం చాయతీ భవన నిర్మాణానికి రూ.20లక్షల చొప్పు న నిధులు మంజూరు చేశారు. అయితే పనులకు ఉపాధిహామీ పథ కం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. అయితే జిల్లా లో చాలాచోట్ల పనులు ప్రారంభించి కొంతమేర పనులు చేసి నిధులు విడుదల కాకపోవడంతో పనులను నిలిపివేశారు. ఏళ్ల తరబడి పనులు జరుగుతున్నాయి.
అరకొర వసతుల మధ్యనే
గ్రామపంచాయతీ కార్యాలయాలకు పక్కా భవనాలు లేక పాలకవర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గతంలోని పాలకవర్గాలు కూడా అరకొర వసతుల మధ్య పాలన సాగించాయి. గ్రామకార్యదర్శులు, సిబ్బంది ఇబ్బందుల నడుమ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. పక్కా భవనాలు లేక, అద్దె భవనాలు, ఇతర భవనాల్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో 486 పంచాయతీలు
జిల్లాలోని 23 మండలాల పరిధిలో 486 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇదివరకే కొన్ని పంచాయ తీ భవనాల్లో కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. మొత్తం 127 గ్రామాల్లో భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. అందులో 9పంచాయతీల్లో మా త్రమే పనులు పూర్తయ్యాయి. ఇంకా 53 చోట్ల పను లు పురోగతిలో ఉన్నాయి. కాగా 40కి పైగా గ్రామా ల్లో స్థలాల కొరతతో పనులు ప్రారంభం కాలేదు. పలు గ్రామాల్లో నిధుల్లేక పనులను నిలిపివేశారు.
స్థలాల కొరతతో ముందుకు సాగక...
జిల్లాలో నూతన పంచాయతీలో గ్రామపంచాయతీ భవనాలు నిర్మించేందుకు చాలాచోట్ల స్థలాల కొరత తీ వ్రంగా ఉంది. ప్రభుత్వ స్థలాల్లో ఇప్పటికే పాఠశాలలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించారు. దీంతో ప్రైవే ట్ వ్యక్తుల నుంచి స్థలాలను సేకరించాల్సిన పరిస్థితి నెలకొంది. అది ఆర్థికభారంతో కూడుకున్నది కావడంతో పక్కా భవనాల ప్రణాళికలు ముందుకు సాగడం లేదు.
శిథిలావస్థ భవనంలో ఉండలేకపోతున్నాం
శిథిలావస్థలో ఉన్న గ్రామపంచాయతీ భవనంలో ఉండలేకపోతున్నాం. భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియడం లేదు. భయంగా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. మంజూరైన నిధులతో నూతన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని త్వరగా నిర్మించాలి.
భూక్యా అరుణామల్సూర్, బోట్యాతండా సర్పంచ, ఆత్మకూర్(ఎస్) మండలం.
నూతన భవనాన్ని నిర్మించాలి
సింగారంతండా పంచాయతీకి కార్యాలయ భవనాన్ని నిర్మించాలి. పంచాయతీగా ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వ పాఠశాల భవనంలోని ఒక గదిలో కొనసాగిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా పక్కా భవన నిర్మాణానికి నోచుకోవడం లేదు. అధికారులు వెంటనే కార్యాలయ భవనాన్ని నిర్మించాలి.
గుగులోతు సుధాకర్‌నాయక్, సింగారంతండా సర్పంచ, తుంగతుర్తి మండలం.
పలు చోట్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి
జిల్లాలో గ్రామపంచాయతీ కార్యాలయాల నూతన భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల పూర్తయ్యాయి. ఇంకా గ్రామాల్లో స్థలాల కొరతతో పనులు ప్రారంభించలేదు. పనులు జరుగుతున్న చోట త్వరగా పూర్తి చేయిస్తాం.
మాధవి, ఈఈ పీఆర్, సూర్యాపేట.