తీరు మారడం లేదు!
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:34 AM
కేసుల విచారణలో జాప్యమూ కారణమే ప్రభుత్వశాఖల్లో అధికారులు, ఉద్యోగుల అవినీతి ఆగడం లేదు. తరచూ ఏసీబీకి పట్టుబడుతున్నా లంచాలు పుచ్చుకునేందుకు ఏ మాత్రం వెనకంజ వేయడం లేదు.
ఏసీబీకి పట్టుబడుతున్నా మారని ఉద్యోగులు
ఉమ్మడి జిల్లాలో చిక్కుతున్న అవినీతి తిమింగలాలు
సగటున నెలకో కేసు నమోదు
కీలకశాఖల్లో రాజ్యమేలుతున్న అవినీతి
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): కేసుల విచారణలో జాప్యమూ కారణమే ప్రభుత్వశాఖల్లో అధికారులు, ఉద్యోగుల అవినీతి ఆగడం లేదు. తరచూ ఏసీబీకి పట్టుబడుతున్నా లంచాలు పుచ్చుకునేందుకు ఏ మాత్రం వెనకంజ వేయడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి లంచాలు తీసుకోకుండా పారదర్శకంగా సిటిజన్ చార్టర్ ప్రకా రం పనులు నిర్వహిచాల్సిన అధికారులు వాటి ని గాలికివదిలేసి యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతూ పనులు చక్కబెడుతున్న తీరు తరచూ వెలుగులోకి వస్తోంది. ఎలాంటి బెదురు లేకుండా ఏకంగా పనిచేసే కార్యాలయాల్లోనే లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్నారు. ఆమ్యామ్యాలు ఇవ్వపోతే నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా పనులు కావడం లేదని, అదే దొడ్డిదారిలో అయితే చిటికెలో పనిచేసి పెడుతున్నారనే ఆరోపణలు అన్నిశాఖల అధికారులపై ఉన్నాయి.
ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ‘ప్రజావాణి’కి వచ్చే ఫిర్యాదుల్లో లంచాలు ఇవ్వలేనిస్థితిలో ఉన్న బాధితులే ఉంటున్నారని తెలుస్తోంది. గురువారం నల్లగొండ జిల్లా మత్స్యశాఖ అధికారి చరితారెడ్డి తన కార్యాలయంలోనే మ త్స్యసొసైటీ సభ్యుల నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటూ పట్టుబడడం చర్చనీయాంశమైంది.
కీలకశాఖలకు అవినీతి మకిలీ..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది సగటున నెలకో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వరుసగా ఏసీబీకి పట్టుబడి ఉద్యోగాలు కోల్పోతున్నా మిగిలిన వారిలో ఏమాత్రం బెదురు ఉండడం లేదు. ఈ ఏడాది తాజాగా చరితారెడ్డి కేసుతో కలిపి 8 ఏసీబీ కేసు లు నమదవ్వగా, గత ఏడాది 11 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా విద్యుత్, రెవెన్యూ, పోలీ్‌సశాఖలోని అధికారులే ఏసీబీకి పట్టుబడుతున్నారు. అయితే మునిసిపల్, పట్టణ ప్రణాళిక, రిజిస్ట్రేషన్లు, ల్యాండ్ సర్వే శాఖల్లోనూ అవినీతి రాజ్యమేలుతుందనే ఆరోపణలు ఉన్నాయి. పలువురు బాధితులు నేరుగా ఫిర్యాదులు చేయలేక బతిమాలో, భంగపడో పనులు చేయించుకుంటున్నామని పలువురు చెబుతున్నారు.
సగుటన నెలకో కేసు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2024లో 11 ఏసీబీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 8 కేసులు నమోదయ్యాయి. గురువా రం నాటి ఘటనలో జిల్లా స్థాయి అధికారే ఏసీబీకి పట్టుబడ్డారు. అయితే ఏసీబీకి పట్టుబడిన తక్షణం విధుల నుంచి సస్పెండ్ చేయగా, తిరిగి ఐదారు నెలల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేయించుకొని మళ్లీ ఉద్యోగాల్లో చేరుతున్నారని, కోర్టుల్లోనూ కేసులు సంవత్సరాల తరబడి కొనసాగుతుండడంతో కఠిన చర్యలకు ఆయా శాఖలలో జాప్యం జరుగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక ప్రజాప్రతినిధుల అండదండలతో ఏసీబీకి పట్టుబడ్డ అధికారులు సైతం మళ్లీ కీలక పోస్టింగులు పొందుతుండడంతో ఏసీబీ కేసుల్లో పట్టుబడిన సమయంలో కనిపించిన భయం, ఆతర్వాత ఉద్యోగుల్లో లేకుండా పోయిందనే అభిప్రాయం వెల్లడవుతోంది.
ఈ ఏడాది కేసులు ఇలా..
జనవరి 12న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో పీడీఎస్ బియ్యం అక్రమరవాణా కేసులో ఎస్‌ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు రూ.70వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
మార్చి 6న యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో ట్రాన్స్‌కో ఏడీ శ్యాంప్రసాద్ ఓ ఫార్మాకంపెనీకి విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు, మీటర్ మార్చేందుకు రూ.70వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
ఏప్రిల్ 10న సూర్యాపేట జిల్లా చింతలపాలెం ఎస్‌ఐ అంతిరెడ్డి బియ్యం అక్రమరవాణా కేసులో అరెస్టయిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చే అంశంలో రూ.10వేల లంచం తీసుకుంటూ పట్టుబట్టారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో నకిలీ వైద్యుల కేసు విషయంలో సూర్యాపేట సీఐ వీరరాఘవులు, డీఎస్పీ పార్ధసారధి రూ.16లక్షల లంచం డిమాండ్ చేయగా, వారు ఏసీబీని ఆశ్రయించగా మే 12న రెడ్‌హ్యాండెడ్‌గా ఆధారాలతో సహా పట్టుకొని అరెస్ట్ చేశారు.
పన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి రూ.8వేల లంచం తీసుకుంటూ జూన్ 26న ఏసీబీకి చిక్కాడు.
జూన్ 26న హుజూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలంలో భూభారతి ఆపరేటర్ విజేతారెడ్డి రూ.12వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.
జూలై 7న పౌరసరఫరాలశాఖ మిర్యాలగూడ డిప్యూటీ తహసీల్దార్ జావెద్ ఏసీబీకి పట్టుబట్టారు. బియ్యం అక్రమరవాణా కేసులో పట్టుబడిన మూడు వాహనాలకు రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చేందుకు వాహన యజమానులను రూ.1లక్ష లంచం అడగ్గా, వారు ఇవ్వలేమని చెప్పినా వినకుండా కనీసం రూ.70వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి రిలీజింగ్ ఆర్డర్ ఇవ్వకపోవడంతో వారు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు జావేద్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.