Share News

అప్పు తెస్తోన్న ముప్పు

ABN , Publish Date - May 17 , 2025 | 12:25 AM

పల్లె, పట్నం తేడా లేదు, ఎక్కడా అప్పు పుట్టడంలేదు. చేబదులూ అందడం లేదు. అవసరానికి డబ్బు సర్దుబాటు కానీ పరిస్థితుల్లో పేద, మధ్య తరగతి కుటుంబాల ఇబ్బందులు వర్ణణాతీతం.

అప్పు తెస్తోన్న ముప్పు

సగటు జీవికి తప్పని అగచాట్లు!!

పల్లె, పట్నం తేడా లేదు, ఎక్కడా అప్పు పుట్టడంలేదు. చేబదులూ అందడం లేదు. అవసరానికి డబ్బు సర్దుబాటు కానీ పరిస్థితుల్లో పేద, మధ్య తరగతి కుటుంబాల ఇబ్బందులు వర్ణణాతీతం. ఎవరిని కదిలించినా డబ్బు సమస్య కనిపిస్తోంది. గతంలో డబ్బులు అవసరం ఉందంటే ఎవరో ఒక రు సర్దుబాటు చేసేవారు. బంధువులు, స్నేహితు లు చేబదులు ఇచ్చేవారు లేదంటే అప్పు అయినా పుట్టేది. వాటితో అవసరాలు తీర్చుకొని, డబ్బులు సర్దుబాటు కాగానే తిరిగి చెల్లించేవారు. ఫైనాన్స్‌ నిర్వాహకులు, వడ్డీ వ్యాపారులు, నమ్మకం ఉన్నవారికి అప్పులు ఇచ్చేవారు. అయితే ఇచ్చిన అప్పులు తిరిగి తీసుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. దీనికితోడు మార్కెట్‌ లేకపోవడం, అప్పు తిరిగి చెల్లించేందుకు జాప్యం నెలకొనడంతో అప్పు పుట్టడం లేదేమోనని సామాజిక వేత్తలు పేర్కొంటున్నారు.

- (ఆంధ్రజ్యోతి-యాదగిరిగుట్ట రూరల్‌)

ఆరుగాలం సాగులో శ్రమించే రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. సాగుకు పెట్టుబడు లు పెరగడం, దిగుబడులు తగ్గి కష్టానికి తగిన ఫలి తం రాక తీవ్ర నిరాశలో రైతులు ఉన్నారు. స్వయం ఉపాధి, కులవృత్తులను నమ్ముకుని, చిరువ్యాపారు లు కుటుంబాలు సాకుతున్న వారంతా వ్యాపారాల్లో పోటీ పెరిగి ఆదాయం తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దె, ఇతర అవసరాలు తీర్చుకోవడం పెనుభారంగా మారింది. రోజు వారి కూలీల పరిస్థితి ఎంత కష్టించినా పొట్టాబట్టకు అన్న ట్లు ఉండటంతో పిల్లల చదువులు, పెళ్లిళ్లకు ఇలా ప్రతీపనికి అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించింది.

కొందరి తీరు... అందరికి శాపం..

అప్పు తీసుకున్న వారు సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారం పూర్తిగా చతికిలపడింది. వడ్డీ వ్యాపారానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకపోవడం, డబ్బుల కోసం నిలదీసే పరిస్థితి లేకపోవడంతో వడ్డీ వ్యాపారులు ఎక్కువ శాతం దెబ్బతిన్నారు. పోలీసులు అప్పు ఇచ్చిన వారిని ఇబ్బందుల పాలు చేసిన ఘటనలతో వడ్డీ వ్యాపారులు ఆ వ్యాపారాలను వదిలేశారు. ఇచ్చిన డబ్బులు రాక వడ్డీ వ్యాపారులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో వడ్డీ వ్యాపారం పరిస్థితి కూడా అధ్వానస్థితికి చేరింది. దీంతో కొందరి తీరు నిజాయితీ పరులకు కూడా అప్పుపుట్టని పరిస్థితి తీసుకువచ్చింది. ఇదిలా ఉండగా అప్పు ఇచ్చి, పుచ్చుకునే సమయంలో మధ్య వర్తులుగా ఉన్న వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు. అవసరం మేరకు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో స్నేహితులు, బంధువుల మధ్య గొడవలు దారితీస్తున్నాయి. అవికాస్తా బంధాలు తెగిపోయేలా చేస్తున్నాయి.

మోసాలు తెస్తున్న తంటా..

నమ్మించి మోసం చేస్తున్న పలువురి తీరుతో సామాన్యులకు అప్పు పుట్టని పరిస్థితులు దాపురించాయి. నిజాయితీగా కడదామన్నా, అత్యవసరమైనా అప్పు పుట్టడం లేదు. యాదాద్రిభువనగిరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 50 మంది ఇతర రాష్ట్రాల వ్యాపారులు దుకాణాలు ఏర్పాటుచేసుకుని కొన్నేళ్ల పాటు స్థానికులతో సత్ససంబంధాలు ఏర్పాటుచేసుకుంటోన్నారు. నమ్మించి రూ.కోట్లు అప్పుల తీసుకోవడం, తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇవ్వడం, ఎక్కువ వడ్డీలిస్తామని డబ్బులు తీసుకుని ఆ తర్వాత ఉడాయించారు. ఇలాంటి ఘటనలు అప్పు ఇస్తే తిరిగి రావని, ఇక నుంచి అప్పులు ఎవరికీ ఇవ్వవద్దని చాలామంది నిర్ణయానికొస్తున్నారు. దీంతో అప్పు పుట్టకుండాపోతోంది.

కాంట్రాక్టర్ల లబోదిబో..

ప్రభుత్వ పనులు చేసి డబ్బు సంపాదించాలనుకున్న నాయకులు కొందరు, సర్పంచ్‌, ఎంపీటీసీలు చేయకూడని అప్పులు చేసి అభివృద్ధి పనులు పూర్తిచేశారు. పనులుపూర్తయి ఏళ్లు గడుస్తున్నా బిల్లు రాకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో తాజా మాజీ ప్రజా ప్రతినిధుల్లో సర్పంచలు ఎక్కువ మంది రూ.15 నుంచి రూ.60 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. అప్పులిచ్చిన వారు నిలదీస్తుండటంతో వారి భూములను విక్రయించి అప్పు చెల్లించిన దాఖలాలూ ఉన్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టు పనులతో లాభాలు రాకపోగా కనీసం పెట్టుబడి డబ్బులు సకాలంలో రాక భూములు పోగొట్టుకుని ఆందోళన చెందుతున్నారు.

తాకట్టే ఆధారం..

ఒకప్పుడు మాటమీద డబ్బులు వడ్డీకి ఇచ్చేవారు. బ్యాండ్‌ పేపరో, ఇతరత్రా కాగితాల మీదనే నమ్మకంతో వడ్డీ వ్యాపారం కొనసాగేది. ఇప్పుడు మార్కెట్‌ పరిస్థితులు, కొందరు తీరు సరిగా లేకపోవడంతో వ్యాపారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అప్పు ఇవ్వాలంటే ప్లాట్‌, భూములు, బంగా రం తాకట్టు పెడితే గాని అప్పు పుట్టడం లేదు. అప్పు ఇచ్చే వారి పేరు మీద భూమి, ప్లాట్‌ రిజిస్ట్రేషన చేయించడం, బ్యాంకుల్లో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టడం ద్వారానో అప్పులు తీసుకుంటున్నారు. తాకట్టు లేనిదే అప్పు దొరకని పరిస్థితి. బ్యాం కుల్లో ప్రతి రోజూ గోల్డ్‌లోన కోసం 20 మంది వరకు అప్పులు తీసుకుంటున్న అధికారులు తెలిపారు.

భూములున్నా... రాని భరోసా

భూక్రయవిక్రయాలతో ఎక్కువ లాభాలు గడించవచ్చన్న నమ్మకంతో సామాన్యులు అధిక వడ్డీకి అప్పులు తెచ్చి మరీ భూములు కొన్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగం బాగా నడుస్తుందని, శ్రమ లేకుండా త్వరగా ధనవంతులు కావచ్చన్న ఆలోచనతో అప్పులు చేసి అడ్డగోలుగా భూములు కొనిపెట్టుకున్నారు. ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌వ్యాపారం కుప్పకూలింది. రెండేళ్లుగా సరిగ్గా వ్యాపారంలో వృద్ధి లేకపోగా, కొనుగోళ్లు నిలిచి వారి ఆర్థిక పరిస్థితి ఆందోళకరంగామారింది. అప్పులిచ్చిన వారి వేధింపులతో వారి పరిస్థితి మునిగిపోయే నావాలా మారింది. కోట్లు పెట్టి ఇళ్ల నిర్మాణాలు చేస్తే అవి ప్రస్తుతం విక్రయం కాక అప్పులకు వడ్డీలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు.

ప్రాణాల మీదకు తెస్తున్న అప్పులు

ఐదేళ్ల కిందట యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పెద్దసంఖ్యలో భూములు కొనుగోలు చేయడానికి రూ.కోట్లు అప్పు చేశాడు. ఆకస్మికంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కుదేలుకావడంతో పూర్తిగా రియల్టర్‌ పరిస్థితి తలకిందులైంది. భూములకు గిట్లుబాటు ధరలు లేకపోవడంతో అప్పులు ఇచ్చిన వాళ్లు డబ్బులు కోసం తీవ్రంగా ఒత్తిడితెచ్చారు. ఏళ్లు గడుస్తున్నా రియల్టర్‌ డబ్బులు ఇవ్వడంలేదని రియల్టర్‌ను హత్యచేసినట్లు ఆరోపణలు సైతం వచ్చాయి.

Updated Date - May 17 , 2025 | 12:25 AM