Share News

ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్వాసితుల పోరుబాట

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:10 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మిస్తున్న రీజినల్‌ రింగ్‌రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌)కు పరిహారం చెల్లింపు రైతులు మరోసారి ఆందోళనబాట పట్టారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్వాసితుల పోరుబాట

ఓ వైపు రైతుల పరిహారానికి ప్రభుత్వం సన్నాహాలు

మరోవైపు బహిరంగ మార్కెట్‌ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్‌

కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి ధర్నాకు దిగిన భూ నిర్వాసితులు

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మిస్తున్న రీజినల్‌ రింగ్‌రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌)కు పరిహారం చెల్లింపు రైతులు మరోసారి ఆందోళనబాట పట్టారు. ప్రభుత్వం ఓవైపు భూసేకరణ వేగవంతం చేసి పరిహారం చెల్లింపునకు ముందుకెళ్తుంటే, బహిరంగ మార్కెట్‌ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు.

త్రిపుల్‌ ఆర్‌ నిర్మాణంతో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై రెవెన్యూ అధికారులు నోటీసులు జారీచేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ భూములు ఇచ్చే ప్రసక్తేలేదని రైతులు తేల్చి చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు రైతులతో చర్చించకుండానే పరిహారానికి సంబంధించిన నోటీసులు ఎలా జారీచేస్తారని అధికారులను నిలదీస్తున్నారు. రైతులకు న్యాయపరంగా పరిహా రం ఇచ్చిన తర్వాతనే భూములు సేకరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లాలోని భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్‌ మండలాల్లోని రైతులు మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట భైఠాయించి నిరసన తెలిపారు. సంబంధిత అధికారులు విచ్చేసి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. దీంతో చౌటుప్పల్‌ ఆర్డీవో శేఖర్‌రెడ్డి రైతుల వద్దకు వచ్చి, నోటీసుల జారీ పై వివారాలు వెల్లడించారు. రైతులతో చర్చించకుండా భూములు ఎలా సేకరిస్తారని ప్రశ్నించారు. బహిరంగ మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం చెల్లించే వరకూ తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. కొన్ని రోజులుగా నిశ్శబ్దంగా ఉన్నరైతులు ఒక్కసారిగా కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు దిగారు. రైతులు మరోసారి పోరాటాన్ని సన్నద్ధమవుతున్నారు.

మొత్తం 1952.44ఎకరాలు...

ఉత్తర భాగం (158కిలోమీటర్లు) నిర్మాణంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 1952.44ఎకరాల మేరకు ప్రభుత్వం భూసేకరణకు సన్నాహాలు చేస్తోంది. రెవెన్యూ, సర్వే అధికారులు రైతుల పొలాల్లో భూములు సర్వే చేపట్టి, హద్దురాళ్లు పా తారు. ఏ రైతు ఎంతమేరకు భూమిని కోల్పోతారనే జాబబితాను సిద్ధంచేశారు. ప్రభుత్వ అలైన్‌మెంట్‌ ప్రకారం ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం మొత్తం సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్‌, జిల్లాల్లో 19 మండలాలకు చెందిన 113 గ్రామాల నుంచి వెళ్తుంది. జిల్లాలో 34 గ్రామాల నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మిస్తున్నారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. భారత్‌మాల పరియోజన పథకం కింద ఈ రింగురోడ్డును నిర్మిస్తున్నట్లు స్పష్టం చేసింది. జిల్లాలో 718 హెక్టార్లు సేకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు త్రీ ఏ నోటిఫికేషన్‌ జారీచేశారు. ఇందులో చౌటుప్పల్‌ మునిసిపాలిటీ పరిధిలో ఆరు హెక్టార్లకు త్రీడీ నోటిఫికేషన్‌ గెజిట్‌ జారీచేశారు. భు వనగిరి మండలంలో 25 హెక్టార్లు మిస్సింగ్‌ సర్వే నెంబర్ల త్రీడీ నోటిఫికేషన్‌ చేయాల్సి ఉంది. జిల్లాలో 685 హెక్టార్లకు త్రీజీ నోటిఫికేషన్‌ జారీచేశారు. ఇందులో 429 హెక్టార్లలో త్రీజీ విచారణ పూర్తయింది. భువనగిరి, చౌటుప్పల్‌ పరిధిలోని 288 హెక్టార్లలో త్రీజీవిచారణ చేయాల్సి ఉంది. చౌటుప్పల్‌ మండలం లింగోజీగూడెం, తాళ్ల సింగారం, తంగడపల్లిలో 92 హెక్టార్లు, భువనగిరి పరిధిలోని అన్ని గ్రామాల్లో 196 హెక్టార్లకు త్రీజీ విచారణ చేపట్టారు. జిల్లాలోని తుర్కపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి, కోనాపురం, దత్తాయిపల్లి, ఇబ్రహీంపూర్‌, వేల్పల్లి, యాదగిరిగుట్ట మండలం మల్లాపూ ర్‌, దాతర్‌పల్లి, భువనగిరి మండలం రాయిగిరి, కాచారం, పెంచికల్‌పహాడ్‌, తుక్కాపూర్‌, గోస్‌నగర్‌, ఎర్రంబెల్లి, వలిగొండ మండలం పహిల్వాన్‌పూర్‌, చౌటుప్పల్‌ మండలం చిన్నకొండూరు, నేలపట్ట, తాళ్ల సింగారం, చౌటుప్పల్‌ లింగోజీగూడెం, తంగేడుపల్లి, భూసేకరణ చేస్తున్నారు.

పెరిగిన భూముల ధరలు

ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ గెజిట్‌ విడుదల కాగానే భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్‌ మండలాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. నోటిఫికేషన్‌ రావడానికి ముందే రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ఈ ప్రాంతంలో భూములను కొనుగోలుచేసి, లేఅవుట్ల అభివృద్ధికి సిద్ధమయ్యారు. భువనగిరి శివారులో ఎకరాకు దాదాపు రూ.2.50 కోట్ల నుంచి రూ.3కోట్లు పేగా ధర పలుకుతోంది. అదేవిధంగా చౌటుప్పల్‌ మునిసిపాలిటీ పరిధిలోనూ ఎకరాకు రూ.3 కోట్లకు పైగా ఉంది. వలిగొండ, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలంలో ఎకరాకు రూ.కోటి వరకు బహిరంగ మార్కెట్‌లో ధరలు ఉన్నాయి. భూ నిర్వాసితులకు హెచ్‌ఎండీఏ పరిధిలో వేయి గజాల ప్లాట్‌ కేటాయించాలని, నష్టపరిహారం బహిరంగ మార్కెట్‌ ధర చెల్లించాలని కోరుతున్నారు. భువనగిరి, చౌటుప్పల్‌ మండలాల్లో బహిరంగ మార్కెట్‌లో ఎకరానికి రూ.2.50కోట్లు ఉండగా, ఎకరానికి రూ.9లక్షల నుంచి రూ.11లక్షల మేరకు చెల్లిస్తున్నారు. రాయిగిరిలో రిజిస్ర్టేషన్‌ విలువ ప్రకారం రూ.2లక్షలు ఉంది. మూడింతలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పరిహారం ఏ మాత్రం న్యాయమైంది కాదని రైతులు అధికారులకు విన్నవిస్తున్నారు. ప్రభుత్వం చర్చించి న్యాయమైన పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

బహిరంగమార్కెట్‌ ప్రకారం చెల్లించాలి: అవుశెట్టిపాండు, రాయిగిరి, రైతు

పరిహారం చెల్లింపు ధర చాలా తక్కువ ఉంది. బహిరంగ మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం చెల్లించాలి. భూములు కోల్పోతోన్న రైతులకు అధికారులు నోటీసులు జారీచేశారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పరిహారం చెల్లిస్తున్నారు. విలువైన భూములను ప్రభుత్వం సేకరిస్తున్నప్పుడు, రైతుల న్యాయమైన కోర్కెలు పట్టించుకోవాలి. రైతులు అంగీకరించకుండానే పరిహారంపై నోటీసులు ఎలా జారీచేస్తారు. ఇప్పటికే రాయిగిరిలో పలు సంస్థలకు భూములను ఇచ్చాం. మరోసారి ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం అలైన్‌మెంట్‌ కూడా రాయిగిరి నుంచి రూపొందించారు. న్యాయపరంగా ఆర్‌ఆర్‌ఆర్‌ రైతులకు బహిరంగ మార్కెట్‌ధర ప్రకారం రూ.2.50కోట్లు చెల్లించాలి.

ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకెళ్తాం : శేఖర్‌రెడ్డి, చౌటుప్పల్‌ ఆర్డీవో

ఆర్‌ఆర్‌ఆర్‌తో భూములు కోల్పోతోన్న రైతుల సమస్యలను కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై పలు గ్రామాల్లోని నోటీసులు జారీచేశాం. పరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వం నిర్ణయం మేరకు రైతులకు చెల్లిస్తాం. నిబంధనల ప్రకారం తాము భూసేకరణ చేపడుతున్నాం. పరిహారం పెంపుపై రైతు లు ఇచ్చిన వినతి మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.

Updated Date - Jun 25 , 2025 | 12:10 AM