సాగర తీరం తారాతోరణం
ABN , Publish Date - May 13 , 2025 | 12:18 AM
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొనే ఆసియన్ దేశాలకు చెందిన 22మంది ప్రతినిధులు సోమవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ సందర్శనకు వచ్చారు.
సాగర్‌లో అందాల భామల సందడి
విజయవిహార్ అతిథి గృహానికి 22 దేశాల పోటీదారులు
బుద్ధుడికి కొవ్వొత్తులతో నివాళులర్పించిన ప్రపంచ సుందరులు
బుద్ధ జయంతి రోజే బుద్ధవనం సందర్శించి మురిసిన తీరు
నల్లగొండ, మే 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) / నాగార్జునసాగర్: రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొనే ఆసియన్ దేశాలకు చెందిన 22మంది ప్రతినిధులు సోమవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ సందర్శనకు వచ్చారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక బస్సులో బయలుదేరి సాయంత్రం 4:45 గంటలకు నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ అతి థి గృహానికి చేరుకున్నారు. అక్కడ వారికి అదనపు కలెక్టర్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్ స్వాగతం పలికారు. అనంతరం వారంతా నేరుగా అతిథి గృహం వెనుక ఉన్న సాగర్ జలాశయాన్ని సందర్శించారు. జలాశ యం వ్యూ వచ్చేలా సెల్పీలు తీసుకున్నారు. మీడి యా ప్రతినిధులకు చేతులు ఊపి సందడి చేశా రు. అనంతరం తమకు కేటాయించిన గదుల్లోకి వెళ్లారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే ఆసి యా, ఓసియానా గ్రూప్-4 దేశాలైన ఇండి యా, బంగ్లాదేశ్, కాంబోడియా, మయన్మార్, వియత్నాం, అస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, జపాన్, కజకిస్తాన్, కిర్గిస్థాన్, లెబనాన్, మంగోలియా, నేపాల్, ఇండోనేషియా, ఫిలిఫ్పైన్స్, సింగపూర్, శ్రీలంక, టర్కీ, చైనా, థాయ్‌లాండ్, ఆర్మేనియా దేశాలకు చెందిన సుందరీమణులు ఉన్నారు.
కృష్ణాతీరంలో ఫొటో షూట్
నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో విజయవిహార్ అతిథి గృహానికి వచ్చిన 22 మంది సుందరీమణులు సాయంత్రం 5:10 గంటల నుంచి 5:30 గంటల వరకు కృష్ణానది తీరం లో ప్రత్యేక ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. విజయవిహార్ అతి థి గృహం వెనకవైపున ఈ ఫొటో షూట్ జరిగింది. పలురకాల స్టిల్స్‌తో అందాల భామలు ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, ఏఎస్పీ మౌనిక తదితరులు ప్రపంచ సుందరిమణులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సాయంత్రం 6 గంటలకు విజయవిహార్ నుంచి బుద్ధవనానికి చేరుకున్నారు.
బుద్ధుడి యాదిలో....
ప్రపంచ సుందరి పోటీదారులు బుద్ధవనంలో అడుగడుగునా తన్మయం చెందారు. సాయంత్రం ఆరు గంటలకు బుద్ధవనానికి చేరుకున్న అందాల బామలకు నిర్వాహకులు బుద్ధ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లంబాడ నృత్యాలతో ఆహ్వానించారు. అనంతరం బుద్ధుడి విగ్రహం వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బుద్ధజయంతిని పురస్కరించుకుని ప్రపంచ సుందరులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. అనంతరం ధ్యాన మందిరం లో ధ్యానం చేశారు. ఈ సందర్భంగా పర్యాట క శాఖ గైడ్ శివనాగిరెడ్డి బుద్ధవనం విశేషాలను వారికి వివరించారు. అనంతరం జాతక వనంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పర్యాటకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, నల్లగొం డ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐజీ సత్యనారాయణ, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, బాలునాయక్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయ క్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, ఏఎస్పీ మౌనిక పాల్గొన్నారు.
నమస్తే.. తెలంగాణ.. జరూర్ ఆనా
సాగర్ విజయవిహార్‌కు సాయంత్రం చేరుకున్న సుందరీమణులు ‘నమస్తే..తెలంగాణ జరూర్ ఆనా’ అంటూ సందడి చేశారు. విజయవిహార్‌ను సందర్శించిన తర్వాత ఫొటో షూట్‌లో పాల్గొన తర్వాత వారు అభివాదాలు, నమస్కారాలు చేస్తూ పలకరించారు. నమస్తే.. గుడ్ ఈవినింగ్ అంటూ పలకరించారు. వరుసలో నిలబడి ఫొటోలు, వీడియోలకు ఫోజులిచ్చారు.
నీవే నా మిస్ వరల్డ్ అన్నారు నా భర్త : ఇలా త్రిపాఠి, నల్లగొండ జిల్లా కలెక్టర్
మిస్‌వరల్డ్ పోటీదారుల సాగర్ పర్యటనకు వస్తున్న నన్ను చూసి నా భర్త ‘నీవే నా మిస్ వరల్డ్’ అన్నారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. బుద్ధవనం ఒక ప్రత్యేకమైన బౌద్ధ ప్రదేశమని, అలాంటి ప్రదేశాన్ని బుద్ధపూర్ణిమ రోజు మీరంతా సందర్శించడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందన్నారు. పోటీలు పూర్తయిన తర్వాత మీ దేశాల్లో ఆడపిల్లల కోసం, మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు.