ఫలితాలు భళా.. బకాయిలతో డీలా
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:10 AM
విద్యాశాఖకు ఈ సంవత్సరం కలిసి వచ్చింది. 10, ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరగడంతో పాటు విద్యార్థుల సంఖ్య పాఠశాలల్లో గణనీయంగా పెరిగింది.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో పెరిగిన ప్రవేశాలు
చాలాఏళ్లకు ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు
అందని ఫీజురీయింబర్స్‌మెంట్
విద్యాశాఖకు ఈ సంవత్సరం కలిసి వచ్చింది. 10, ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరగడంతో పాటు విద్యార్థుల సంఖ్య పాఠశాలల్లో గణనీయంగా పెరిగింది. జూనలోనే అడ్మిషన్లు ప్రారంభం కాగా సకాలంలో పాఠ్యపుస్తకాలు, దుస్తుల పంపిణీ పూర్తయ్యింది. 2024తో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలతో పాటు డిగ్రీ కళాశాల్లోనూ విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి. అటు కాస్మోటిక్ చార్జీల పెంపుతో పాటు పదోన్నతులు, బదిలీలతో ఉపాధ్యాయులు ఒకింత సంతోషంగా ఉండటంతో విద్యాశాఖ మెరుగైన పనితీరును కనబరిచింది.
(ఆంధ్రజ్యోతి-కోదాడ)
ఈ ఏడాది విద్యాశాఖ మెరుగైన పనితీరును కనబరిచింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,731 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో నల్లగొండ జిల్లాలో 2,039, యాదాద్రి జిల్లాలో 712, సూర్యాపేట జిల్లాలో 980పాఠశాలలు ఉన్నాయి. వీటికి తోడు 53 కస్తూర్బా ఇతర గురుకుల పాఠశాలలు ఉండగా ఆయా పాఠశాలలో సుమారు 4.70 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గతేడాదితో పోలీస్తే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వవిద్యాసంస్థలకే విద్యార్థులకు మొగ్గు చూపారు. దీంతో అడ్మిషన్లు పెరిగాయి. అంతేకాకుండా పదవ, ఇంటర్‌లలో విద్యార్థులు గతేడాదికంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ పరంగా కాస్మిటిక్ చార్జీలను 0 శాతం పెంచడంతో పాటు విద్యార్థులకు విద్యాసంవత్సరం ప్రారంభంలోనే దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందించటంతో చదువు సజావుగా సాగినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం కోసం మెనూ రేట్లు పెంచినా గుడ్డు రేటు రూ.6 నుంచి రూ.8.30లకు పెరగటంతో నిర్వాహకులు వారంలో మూడు రోజులకు బదులు రెండు రోజులు అందించే పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం దూరమయినట్లేనని ఉపాధ్యాయ సంఘనేతలు పేర్కొంటున్నారు. ఇంటర్, డిగ్రీ చేరిన విద్యార్థులు, సెప్టెంబర్ నాటికే ఉపకారవేతనాల కొరకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి తోడు ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయటంతో కొరత కొంత తీరింది. పూర్తిస్థాయి ఎంఈవోలను నియమించటం, ఒకటో తేదీన జీతాలు అందటం, బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టటంతో ఉపాధ్యాయులకు, విద్యారంగానికి కొంత కలిసి వచ్చినట్లయింది. దీంతో ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేట్ స్థాయి విద్యపై ఆశలు
అన్నిరకాల గురుకులాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి, ఒకే క్యాంప్‌సలో విద్య అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోస నియోజకవర్గానికి ఒకటి చొప్పున 22 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు ఈ ఏడాది శ్రీకారం చుట్టింది. కొన్నిచోట్ల ఇంటిగ్రేట్‌డ్ స్కూల్స్ ఏర్పాటుకు భూమిని సేకరించగా కొన్ని మండలాల్లో భూసేకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు విద్యనిపుణులు చెబుతున్నారు. 2026 విద్య సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు జరగవచ్చునని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
డిగ్రీలో పెరిగిన విద్యార్థులు
ఎంజీ యూనివర్సిటీ పరిధిలో 59డిగ్రీ కళాశాలల ఉన్నాయి. వాటిలో 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కాగా, 48 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు. ఆయా కళాశాలలో 23,400 సీట్లు ఉన్నాయి. కాగా 2025 విద్యాసంవత్సరంలో మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులు 9,021వేలు. 2024 విద్యసంవత్సరంలో 8 వేలు చేరగా, 2025లో ఆసంఖ్య 9,021కి పెరిగింది. 10 కళాశాలలో ఒక్కొక్క కళాశాలలో 14మాత్రమే అడ్మిషన్లు వచ్చాయి.
...అయినప్పటికీ...
ప్రభుత్వ విద్యారంగం కొంత మెరుగ్గా కనిపించినా 2023 నుంచి ఉపాధ్యాయులకు రావాల్సిన ఐదు డీఏలు, పీఆర్సీలు అందకపోవటంతో ఉపాధ్యాయులు ప్రభుత్వంపై కినుక వహిస్తున్నారు. ఈఎల్స్, మెడికల్ బిల్లులు, దాచుకున్న సొమ్ముతో, దరఖాస్తు చేస్తుకున్న లోన్లు మంజూరు కాకపోవటంతో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,737 పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇళ్లల్లో మంచీచెడు కార్యక్రమాలకు సొమ్ముల్లేక అవస్థలు పడుతున్నామని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బకాయిలతో ఆందోళన
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 16 ఇంజనీరింగ్, 48 ప్రైవేట్ డిగ్రీ కళాశాలల ఉన్నాయి. ఆయా కళాశాలలకు ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.300కోట్లు రావాల్సి ఉంది. టోకెన్లు ఇచ్చి నెలలు గడుస్తున్నా నేటికీ బకాయిలు అందక కళాశాలల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. డిగ్రీ కళాశాల నిర్వాహకులు బకాయిలు విడుదల చేయకపోతే ఈ ఏడాదిలో రెండుసార్లు బంద్ పాటించగా ఇంజనీరింగ్ కళాశాలలు నాలుగురోజుల బంద్ నిర్వహించాయి. ప్రభుత్వం డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల నిర్వాహకులతో చర్చలు జరిపినప్పటికీ, నేటికీ పూర్తి బకాయిలు విడుదల కాకపోవటంతో యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విద్యసంవత్సరం పూర్తయ్యేనాటికి బకాయిలు విడుదల చేయాలని యాజమాన్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
సెంట్రల్ గవర్నమెంట్‌కు అప్పగిస్తే సమస్యకు పరిష్కారం : కళాశాల నిర్వాహకులు
రాష్ట్ర ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్‌ను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తే పరిష్కారం దొరుకుతుందని పలు ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాల నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్ ఇవ్వటానికి కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎస్సీ విద్యార్థుల ఫీజు కింద రాష్ట్ర ప్రభుత్వం 40శాతం భరిస్తే, మిగిలిన 60శాతం కేంద్రం భరిస్తుందని, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం 25శాతం భరిస్తే, కేంద్రం 75శాతం భరిస్తుందని, దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారం తగ్గుతుందని, కళాశాలలకు ఊడా ఇబ్బంది ఉండదంటున్నారు. కేంద్రం కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఫీజురీయింబర్స్‌మెంట్ భరిస్తున్నట్లు పేర్కొంటున్నారు. రాష్ట్రం ప్రభుత్తం ఆ దిశగా ఆలోచించాలని కోరుతున్నారు.