Share News

టెక్నికల్‌ అసిస్టెంట్ల సమస్యలను అసెంబ్లీలో చర్చిస్తా

ABN , Publish Date - Aug 04 , 2025 | 12:49 AM

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథ కం టెక్నికల్‌ అసిస్టెంట్ల సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య భరోసా ఇచ్చారు.

టెక్నికల్‌ అసిస్టెంట్ల సమస్యలను అసెంబ్లీలో చర్చిస్తా

ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట రూరల్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథ కం టెక్నికల్‌ అసిస్టెంట్ల సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య భరోసా ఇచ్చారు. ఆదివారం యాదగిరిగుట్టలో ఉపాధి హామీ టెక్నికల్‌ అసిస్టెంట్ల రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విప్‌ అయిలయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అసిస్టెంట్లకు ఇచ్చిన హామీ మేరకు వారిని రెగ్యులర్‌ చేయడానికి పేస్కేల్‌, ప్రభుత్వం నుంచి రావాల్సిన అలవెన్స్‌లపై అసెంబ్లీలో చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత వరకు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. 33 జిల్లాల నుంచి టెక్నికల్‌ అసిస్టెంట్లు ఒకే వేదికపైకి రావడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఫీల్డ్‌ అసిస్టెంట్లు నృసింహుడి పాదాల వద్ద మోకాళ్లపై కూర్చొని వేడుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం హుండీలో పలు వినతిపత్రాన్ని వేశారు. టీజీజేఏసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మందడి ఉపేందర్‌రెడ్డి, ఎండీ ఖధీర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు పెండెం శ్రీనివాస్‌, టెక్నికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కె. రమేష్‌, కోశాధికారి వై.రామచంద్రయ్యచారి, చంద్రశేఖర్‌, కృష్ణ, అశోక్‌, వెంకట్‌ పాల్గొన్నారు.

పేదింటి కల నెరవేరుతుంది:బీర్ల

రాజాపేట: ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవాడికి సొంతింటి కల నెరవేరాలన్నదే సీఎం ఆశయమని బీర్ల అయిలయ్య అన్నారు. రాజాపేట మండలకేంద్రంలో ఆయన మార్నింగ్‌ వాక్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలకేంద్రంలో వీధుల్లో పర్యటిస్తూ ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించి లబ్ధిదారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య కార్మికులతో కలిసి వీధులను ఊడుస్తూ మురుగుకాల్వల్లోని చెత్తను తొలగించారు.కుల వృత్తులు, చేతివృత్తులను పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు నెమిల మహేందర్‌ గౌడ్‌, బుడిగె పెంటయ్యగౌడ్‌, చిలువేరు బాలరాజు, గౌటె లక్ష్మణ్‌, రాంజీనాయక్‌, మోత్కుపల్లి ప్రవీన్‌, విఠల్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2025 | 12:49 AM