Share News

మైక్రో రుణాల ఉచ్చులో పేదలు

ABN , Publish Date - May 12 , 2025 | 12:19 AM

గతంలో పలువురు పేద మహిళల ప్రాణాలు బలిగొన్న మైక్రో ఫైనాన్సలు మళ్లీ విజృంభిస్తున్నాయి. పేద కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా పతనం చేస్తూ వారి పాలిట శాపంగా మారిన మైక్రో ఫైనాన్సలను ఉమ్మడి ఆంధ్రప్రదేశలో అప్పటి ప్రభుత్వం నిషేధించింది.

మైక్రో రుణాల ఉచ్చులో పేదలు

మళ్లీ విజృంభిస్తున్న మైక్రో ఫైనాన్సలు

గతంలో రుణాలు చెల్లించలేక పలువురి ఆత్మహత్య

గతంలో పలువురు పేద మహిళల ప్రాణాలు బలిగొన్న మైక్రో ఫైనాన్సలు మళ్లీ విజృంభిస్తున్నాయి. పేద కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా పతనం చేస్తూ వారి పాలిట శాపంగా మారిన మైక్రో ఫైనాన్సలను ఉమ్మడి ఆంధ్రప్రదేశలో అప్పటి ప్రభుత్వం నిషేధించింది. తిరిగి పురుడుపోసుకున్న మైక్రో ఫైనాన్సలు ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుంటూ పడగ విప్పుతున్నాయి. తీసుకున్న రుణాన్ని ప్రతీ వారం చెల్లించాల్సిన మైక్రోఫైనాన్సల ఊబిలో పేదవర్గాలు కూరుకుపోతున్నాయి. మరోసారి పాత దుర్ఘాటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు.

- (ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన)

సమభావన సంఘాలు, స్త్రీనిధి, ముద్ర తదితర రూపకాల లో ప్రభుత్వం రుణాలను అందిస్తున్నప్పటికీ పలువురు మహిళ లు తక్షణ ఆర్థిక అవసరాల కోసం మైక్రో ఫైనాన్సలను ఆశ్రయిస్తున్నారు. కానీ తిరిగి చెల్లింపులో ఇబ్బందులకు గురవుతూ మానసిక, ఆర్థిక క్షోభకు గురవుతుండగా నెలవారీగా చెల్లించాల్సిన బ్యాంకు లింకేజీ రుణాలను చెల్లించలేకపోతున్నారు. దీంతో మైక్రో ఫైనాన్సల ఆగడాలను పురిట్లోనే నియంత్రించాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

స్తోమతకు మించి మైక్రో రుణాలు..

భారత బ్యాంకింగ్‌ వ్యవస్థలో రుణాల చెల్లింపులో మహిళా సంఘాలే అగ్రగామిగా ఉంటున్నాయి. ఏ ఒక్క సభ్యురాలు రు ణ వాయిదాల చెల్లింపులో ఆలస్యం చేసినా మిగతా సభ్యులు బాధ్యత వహిస్తూ ఆ మహిళతో రుణ వాయిదా చెల్లింపచేయడమో లేదా తామే భరించడమో చేస్తున్నారు. దీంతో మహిళా సంఘాల రికవరి సుమారు 100 శాతంగా ఉంటోంది. దీంతో మహిళల ఆర్థిక అవసరాలు, రుణాల చెల్లింపులో నిజాయితీని ఆసరాగా చేసుకుంటూ పలు మైక్రోఫైనాన్సలు విజృంభిస్తున్నా యి. ఆర్‌బీఐ అనుమతులు, నిబంధనల మేరకే మైక్రో రుణాల మంజూరు ప్రక్రియను నిర్వహిస్తున్నామంటూ మైక్రోఫైనాన్సల ఏజెంట్లు పట్టణాలలోని బస్తీలు, గ్రామాల్లో ఇల్లిల్లు తిరుగుతున్నారు. 10 మందితో సంఘాలు ఏర్పాటు చేయించి రుణ మంజూరు తంతును పూర్తిచేసి వారంవారం రుణ వాయిదాలను వసూలు చేస్తున్నారు. మొదటి విడతగా ఒక్కో సభ్యురాలికి రూ.30వేల మైక్రో రుణం మంజూరు చేస్తూ క్రమేపీ రుణ పరపతిని పెంచుతున్నారు. అంతేకాక ఆస్తులపై మార్టిగేజీ లోనలు కూడా ఇస్తున్నారు. దీంతో పలువురు మహిళలు సంఘాలుగా ఏర్పడిన స్తోమతకు మించి మైక్రో రుణాలను స్వీకరిస్తూ చెల్లించలేక చతకిలా పడుతున్నారు. రుణ వాయిదా చెల్లించే రోజున ఇంటికి తాళం పెట్టి వెళ్తున్న సందర్భాలు, ఫోనలో అందుబాటులో ఉండని పరిస్థితులు పెరుగుతున్నాయి. దీంతో సంఘం మిగతా సభ్యులు, మైక్రో ఫైనాన్స ప్రతినిధులు సభ్యురాళ్ల ఇంటి ముందు గొడవలు చేస్తున్నారు. గతంలో రుణ గ్రహితలు అయిన సభ్యురాళ్లు మరణిస్తే రుణ చెల్లింపు జరిపే వరకు అంత్యక్రియలు నిర్వహించకుండా అడ్డుకున్న పరిస్థితులు ఉండేవి. నేడు కూడా అలాంటి దుర్ఘాటనలు పునరావృత్తమయ్యే ప్రమాదాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. మహిళలతో పాటు పురుషులు కూడా సంఘాలుగా ఏర్పడి మైక్రో రుణాలు పొందుతుండటంతో ఆయా కుటుంబాలపై ఆర్థిక భారం మరింత పెరుగుతోంది.

భువనగిరిలో ఆరు మైక్రోఫైనాన్సలు

యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరిలో ఆరు మైక్రోఫైనాన్సలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. భువనగిరి పట్టణంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలలో ఇవి రుణాలను అందిస్తున్నాయి. రూ.30 వేల నుంచి రూ.2లక్షల వరకు ఇస్తున్న రుణాలను 48 వారాల్లో సమ వాయిదాలతో చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క వాయిదా చెల్లింపులో ఆలస్యం జరిగినా భారీ జరిమానాతో వసూళ్లు చేస్తున్నారు. సకాలంలో వాయిదాలు చెల్లించని రుణ గ్రహితల పరువును బజారులో నిలదీస్తున్నారు. దీంతో వాయిదాల చెల్లింపునకు కూడా పలువురు మహిళలు అధిక వడ్డీతో అప్పులు చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో మైక్రో ఫైనాన్సలను నిషేధించాలంటూ ఐద్వా ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించగా వీబీకేలు ఏకంగా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఇదేతరహా పరిస్థితులు ఉమ్మడి జిల్లా అంతటా ఉన్నాయి.

మైక్రో ఫైనాన్సలను నియంత్రించాలి

మైక్రో ఫైనాన్సలను ప్రభుత్వం వెంటనే నిషేధించాలి. లేనిపక్షంలో పలు పేద కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదాలు ఉన్నాయి. అవగాహన రాహిత్యం, ఆర్థిక అవసరాల కోసం అధికవడ్డీతో రుణాలు తీసుకుంటున్న పలువురు మహిళలు వాయిదాలు చెల్లించలేక మొహం చాటేస్తున్న పరిస్థితి. స్తోమతకు మించి రుణాలు మంజూరు జరుగుతుండడంతో తిరిగి చెల్లించలేక ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం స్పందించకుంటే త్వరలోనే గత దుర్ఘటనలు పునరావృత్తమయ్యే ప్రమాదం ఉంది.

- అనురాధ,ఐద్వా జిల్లా కార్యదర్శి, యాదాద్రి భువనగిరి.

రుణ చెల్లింపులో తడబాటు

మైక్రో ఫైనాన్సల రుణాలతో సమభావన, స్త్రీ నిధి రుణాలను పలువురు మహిళలు సక్రమంగా చెల్లించలేకపోతున్నారు. మైక్రో రుణ వాయిదా ప్రతీవారం చెల్లించాల్సి ఉండడంతో బ్యాంకు లింకేజీ రుణాలను మహిళలు సక్రమంగా చెల్లించలేకపోతున్నారు. వారం వాయిదా చెల్లింపులో ఏ మాత్రం ఆలస్యం జరిగినా మైక్రో ఫైనాన్స ఏజెంట్లు సంబంధిత మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో ప్రభుత్వం మైక్రో ఫైనాన్సలపై చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో లింకేజీ రుణాల బకాయిలు పెరుగడంతో పాటు పలువురు మహిళల జీవితాల్లో మైక్రో రుణాలు తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

- ఎం పద్మ, వీబీకే, అనంతారం.

Updated Date - May 12 , 2025 | 12:19 AM