కూలీలు దొరక్క రైతుల అవస్థలు
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:31 AM
మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట పొలాల్లో పెరిగిపోతున్న కలుపు మొక్కలను తీయలేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కలుపు తీయలేక ఇబ్బందులు
గుండాల, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట పొలాల్లో పెరిగిపోతున్న కలుపు మొక్కలను తీయలేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వర్షాకాలం ప్రారంభమై నెలలు గడుస్తున్నప్పటికీ ఆశించిన వర్షాలు కురవకపోవడంతో ఇన్ని రోజులు నేల గట్టిగా ఉండి పత్తి, కంది చేలల్లో కలుపు తీయలేకపోయారు. ఇటీవల వరుసగా ముసుర్లు పడడంతో పంట పొలాల్లో విపరీతంగా కలుపు పడింది. రైతులందరూ ఒకేసారి కలుపును తొలగించడానికి సిద్ధపడ్డారు. రైతులందరూ ఒకేసారి కలుపు మొక్కలను తొలగించడానికి సిద్దపడడంతో కూలీల కొరత తీవ్రంగా ఏర్పడుతోంది. రోజు రోజుకూ కలుపు వివపరీతంగా పెరిగిపోతోంది. కూలీలు వారి స్వంత గ్రామాల్లో పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపకపోవడంతో జనగాం, సూర్యాపేట జిల్లాలోని దేవరుప్పల, లింగాల ఘనపురం, తిరుమలగిరి, పాలకుర్తి తదితర మండలాల నుంచి నిత్యం ఆటోలో కూలీలను తీసుకువచ్చే పరిస్థితి ఏర్పడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కూలీలకు కూలీ డబ్బులతో పాటు అన్నదాతలకు ఆటో చార్జీలు అదనంగా ఇవ్వాల్సి వస్తోంది. గత సంవత్సరం కలుపు తీయడానికి రూ.300 ఉండగా ప్రస్తుతం రూ.400నుంచి 500 వరకు చెల్లించాల్సి వస్తోంది. దీంతో రైతులు అదనంగా నష్టపోవాల్సి వస్తోంది.
కూలీకి కాకుండా కొత్త విధానంపైనే ఆసక్తి
కూలీలు ప్రతి రోజూ కూలీకి పోకుండా 10 మంది కూలీలు కలిసి కొత్త విధానంగా పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో 4రోజుల్లో జరగాల్సిన పనిని 2రోజుల్లోనే పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఈ విధానంతో కూలీ ధరలు రెట్టింపు స్థాయిలో ఉంటున్నాయి. ఈ విధానం పేద రైతులకు ఇబ్బందిగా మారుతోంది. ఎకరం విస్తీర్ణంలో కలుపు తీయడానికి సుమారు 5వేల నుంచి 6వేల వరకు గుత్త తీసుకుంటున్నారు. కూలీల కొరత ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రెతులు గుత్తకు ఇవ్వాల్సి వస్త్తోంది. ప్రభుత్వం రైతులకు రాయితీపై కలుపు నివారణ యంత్రాలను పంపిణీ చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. లేని పక్షంలో వ్యవసాయం చేయడం తలకు మించిన భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూలీల కొరత తీవ్రంగా ఉంది
ఇటీవల కురుస్తున్న వర్షాలకు గడ్డి విపరీతంగా పెరగడంతో కూలీల కొరత తీవ్రంగా ఏర్పడుతోంది. పంట పొలాల్లో గడ్డి తీయడానికి ఎప్పటిలాగానే కూలీలను పిలిస్తే రోజువారీ కూలీ చేయడానికి ఇష్టపడడం లేదు. చేను వద్దకు వచ్చిన తర్వాత గుండు గుత్త ధర అడుగుతున్నారు. దీంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి పెట్టుబడి పెరిగి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం రాయితీపై కలుపు నివారణ పరికరాలను అందించాలి.
-మల్‌పెద్ది రాందయాకర్‌రెడ్డి, సీతారాంపురం