సాగు విస్తీర్ణం పెంపే లక్ష్యం
ABN , Publish Date - Jun 26 , 2025 | 12:12 AM
అధిక వ్యయంతో కూడిన సాగునీటి పథకాలు కాకుండా తక్కువ ఖర్చుతో పూర్తయ్యే పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.
చిన్న నీటిపారుదలపై దృష్టి
రూ.55కోట్లు కేటాయించాలని మంత్రి ఉత్తమ్‌కు ఎమ్మెల్యే కుంభం వినతి
అలీనగర్, బొల్లెపల్లి, భీమలింగం కత్వలకు మరమ్మతులు
చిన్నేరు వాగుపై చెక్‌డ్యామ్‌కు ప్రతిపాదన
మూసీ పరివాహక ప్రాంతంలో డిస్ట్రిబ్యూటరీ కాల్వల ఆధునికీకరణ
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): అధిక వ్యయంతో కూడిన సాగునీటి పథకాలు కాకుండా తక్కువ ఖర్చుతో పూర్తయ్యే పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. చిన్ననీటి పారుదల పథకాలకు ప్రభుత్వం నిధులిచ్చేందుకు వెనకడుగువేసే ప్రసక్తేలేదని, గతంలో రూపొందించిన ప్రతిపాదనలతో సంబంధం లేకుండా, తాజాగా సాగునీటి కాల్వల పునరుద్ధరణకు తగిన కార్యచరణ ప్రణాళికలు రూపొందించాలని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల భువనగిరిలో జరిగిన సమావేశంలో సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం పెంపుపై స్థానిక ఎమ్మెల్యేలు దృష్టిసారించారు.
మూసీ పరివాహక ప్రాంతంలో ప్రధానంగా యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లోని పలు మండలాలకు సాగునీరు బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల ద్వారా అందుతోంది. ఈ కాల్వల పునరుద్ధరణ పనులు రూ.485కోట్లతో కొనసాగుతున్నాయి. అయితే ఈ కాల్వలను పునరుద్ధరించడంతో పాటు పక్కనున్న గ్రామాల్లోని చెరువులను నిం పేందుకు ప్రస్తుతం ఉన్న చిన్న కాల్వల (డిస్ట్రిబ్యూటరీ) విస్తీర్ణాన్ని పెంచేందుకు అంచనాలు రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్, భువనగిరి మండలాలకు సంబంధించిన బొల్లేపల్లి కాల్వ, వలిగొండ మండలానికి చెందిన భీమలిం గం కాల్వ, పోచంపల్లికి చెందిన అలీసాగర్ కాల్వ మరమ్మతులకు రూ.30కోట్లు, చిన్నేరు వాగుపై ఉన్న మాదారం, వడపర్తి, అనాజీపురం, బోల్లేపల్లి, వద్ద చెక్‌డ్యామ్ నిర్మాణం కోసం రూ.25కోట్లు మంజూరు చేయాలని బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. మూసీ వాగులోని అన్ని ఫీడర్ కాల్వల్లో గుర్రపుడెక్క ఆకు తొలగింపుతోపాటు నిర్వహణకు ఏటా రూ.1.20కోట్లు కేటాయించాలని విన్నవించారు. ప్రభుత్వం నిధులు కేటాయించి ఈ చిన్న కాల్వలను ఆధునీకరించిన పక్షంలో అదనంగా 15వేల సాగు విస్తీర్ణం పెరగనుంది.
అలీనగర్, బొల్లెపల్లి,భీమలింగం కాల్వలను పునరుద్ధరిస్తే..
మూసీ పరివాహక ప్రాంతాంలోని బునాదిగా ని కాల్వకు అనుసంధానంగా ఉన్న అలీనగర్, బొల్లెపల్లి, భీమలింగం కత్వల ద్వారా చుట్టు పక్కన గ్రామాల్లోని చెరువుల్లోకి నీరు చేరుతోం ది. అయితే ఈ కాల్వలు విస్తీర్ణం చిన్నదిగా ఉం డటంతో పాటు కాల్వలు గుర్రపుడెక్క, చెత్తాచెదారంతో మూసుకుపోయాయి. బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి ప్రధాన కాల్వల పునరుద్ధరణ పనులతో పాటు వీటికి అనుసంధానంగా ఉన్న చిన్న కాల్వలను కూడా పునరుద్ధరిస్తే చెరువుల్లోకి నీరుచేరి సాగు విస్తర్ణం పెరిగే అవకాశం ఉంది. గతంలో ఈ కాల్వలపై సరైన రీతి లో డిజైన్‌లు రూపొందించలేదని, ఏడు ఫీట్ల కాల్వకు ఒక మీటరు పైపులైన్ వేయడంతో నీరు వెళ్లడంలేదని ఎమ్మెల్యేలు ఇరిగేషన్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కాల్వలను వెడల్పు చేయాలని రైతులు సైతం ఎమ్మెల్యేల దృష్టి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న కాల్వల పునరుద్ధరణకు ఎంత మేరకు నిధులు అవసరమో అంచనాలు రూపొందించాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు ఎమ్మెల్యేలు సూచించారు. పిల్లాయిపల్లి, బునాదిగాని, ధర్మారెడ్డి కాల్వలను గతంలో రూపొందించిన అంచనాల ప్రకారం పునరుద్ధరించిన పక్షంలో యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లోని ఏడు మండలాల్లో 60వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలీనగర్, బొల్లెపల్లి, భీమలింగం కత్వల కాల్వలను వెడల్పు చేస్తే మూసీ పరివాహక ప్రాంతంలోని భువనగిరి నియోజకవర్గంలో మరో 15వేల ఎకరాల వరకు అదనంగా సాగు విస్తీర్ణం పెరుగుతుంది. ఒక్కో కాల్వను ఆధునికీకరించేందుకు రూ.10కోట్లు అవసరం. మూడు కాల్వలకు మొత్త రూ.30కోట్ల మేరకు వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఈ కాల్వల పొడవు మొత్తం 51 కిలోమీటర్లకు 102 కల్వర్టులు నిర్మించాల్సి ఉంటుంది. పిలాయిపల్లి కాల్వ ద్వారా భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్, రామన్నపేట, చిట్యాల మండలాల్లో 18 డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌తో 46 చెరువులు నిండనున్నాయి ఈ మేరకు ఇరిగేషన్‌శాఖ అధికారులు అంచనాలు రూపొందిస్తే ఎమ్మెల్యేలు సంబంఽధిత మంత్రి దృష్టికి తీసుకొచ్చి నిధులు మంజూరు చేయించేందుకు సన్నద్ధమవుతున్నారు.
మూసీ కాల్వల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలి
భువనగిరి రూరల్: భువనగిరి నియోజకవర్గ పరిధిలో మూసీ కాల్వల మరమ్మతులకు రూ.30కోట్ల నిధులు మంజూరు చేయాలని బుధవారం హైదరాబాద్‌లోని జల సౌధలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి వినతి పత్రం అందచేశారు. భువనగిరి , బీబీనగర్ మండలాలకు సంబంధించిన బొల్లేపల్లి కాల్వ, వలిగొండ మండలానికి సంబంధించిన భీమలింగం కాల్వ, పోచంపల్లి మండలానికి సంబంధించి అలీనగర్ కాల్వల మరమ్మతులకు రూ.30కోట్ల నిధులు మంజూరు చేయించాలన్నారు. చిన్నేరువాగుపై ఉన్న బీబీనగర్ మండలం మాదారం, భువనగిరి మండల పరిధిలోని వడపర్తి, అనాజీపురం, బొల్లేపల్లి వద్ద చెక్‌డ్యాముల నిర్మాణం కోసం రూ. 25కోట్లు మంజూరు చేయాలన్నారు. మూసీ వాగుకు సంబంధించి అన్ని ఫీడర్ కాల్వల్లో గుర్రపు డెక్క ఆకును తొలగించేందుకు ప్రతీ సంవత్సరం రూ.కోటీ 20లక్షల నిధుల బడ్జెట్ కేటాయించాలని వినతి పత్రంలో కోరారు. ఈసందర్భంగా మంత్రి స్పందించి మూసీ కాల్వలకు సంబంధించిన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.