Share News

తుదిదశకు లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల శిక్షణ

ABN , Publish Date - Jul 16 , 2025 | 12:24 AM

భూ సమస్యలకు శాశ్వత పరిష్కా రం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోం ది. ధరణి చట్టంతో రైతులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోగా, దాని స్థానంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం భూభారతిని ప్రవేశపెట్టింది. ఈ చట్టాన్ని ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తోంది.

తుదిదశకు లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల శిక్షణ

థియరీ తరగతులు పూర్తి

జిల్లాలో 180మంది అభ్యర్థులు

ఐదు బ్యాచ్‌లుగా విభజన

మాన్యువల్‌తోపాటు డీజీపీఎస్‌ యంత్రంపై పూర్తి అవగాహన

ఈ నెల 27నుంచి మూడు రోజులు పరీక్షలు

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి) : భూ సమస్యలకు శాశ్వత పరిష్కా రం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోం ది. ధరణి చట్టంతో రైతులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోగా, దాని స్థానంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం భూభారతిని ప్రవేశపెట్టింది. ఈ చట్టాన్ని ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తోంది. భూ సమస్య పరిష్కారానికి ప్రధాన కారణం సరిహద్దు వివాదాలు, పక్కాగా సర్వే చేయకపోవడమేనని తేలింది. అయితే సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉం డా, ఈ సమస్యను అధిగమించేందుకు ప్రైవేట్‌ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా వారికి ఇస్తున్న శిక్షణ తుది దశకు చేరింది.

భూభారతి చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో భూసమస్యల పరిష్కారానికి ప్రైవేట్‌ లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను ప్రతీ మండలానికి నియమించనుంది. జిల్లాలో మొత్తం 17మండలాలు, 301 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అయితే పాలిటెక్నిక్‌, ఐటీఐ, సివిల్‌, బీటెక్‌ అభ్యసించిన వారికి ప్రైవేట్‌ సర్వేయర్లుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించి ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. జిల్లాల వారీగా అర్హులను గుర్తించి 50రోజుల పాటు శిక్షణ ఇస్తోంది. విశ్రాంత సర్వేయర్లు, ప్రస్తుత మండల సర్వేయర్లు వారికి శిక్షణ ఇస్తున్నారు. ప్రతీవారం రోజులకోసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. శిక్షణలో భాగంగా థియరీ, క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్స్‌ నిర్వహించిన అభ్యర్థులకు మూడు రోజులు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి లైసెన్స్‌ జారీ చేయనున్నారు. జిల్లాలో ప్రస్తుతం మొత్తం 180 మంది శిక్షణ పొందుతున్నారు. వీరిలో ప్రభుత్వం నిర్వహించిన శిక్షణ తరగతుల్లో నేర్చుకున్నదెంత? లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల ఎంపిక లెక్క ఎంత అనేది ఈ నెలాఖరులో నిర్వహించే పరీక్షలతో తేలనుంది.

నెలాఖరుకు పరీక్షలు...

లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల శిక్షణ ఈ నెల 26వ తేదీ నాటికి ముగియనుంది. 50రోజుల పాటు శిక్షణలో పాల్గొన్న అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 27న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు థియరీ పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ప్లాటింగ్‌, కాలిక్యులేషన్‌పై పరీక్ష నిర్వహించనున్నారు. 28, 29 తేదీల్లో క్షేత్రస్థాయికి అభ్యర్థులను తీసుకెళ్లి కొంతమేరకు భూ విస్తీర్ణం అప్పగించి, కొలత వేసి ప్లాటింగ్‌ చేయించనున్నారు. అనంతరం కాగితాలపై ప్లాటింగ్‌, కాలిక్యులేషన్‌ చేసే పరీక్ష నిర్వహిస్తారు. జిల్లాలో మొత్తం 180మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల పరీక్షలకు భువనగిరి మునిసిపాలిటీ పరిధిలోని వెన్నెల డిగ్రీ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. డిపార్టుమెంట్‌ ఆఫీసర్‌గా వెన్నెల కళాశాల ప్రిన్సిపాల్‌ను, పరీక్షల అబ్జర్వర్‌గా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీని ఉన్నతాధికారులు నియమించారు. మరోవారం రోజుల్లో శిక్షణను పకడ్బందీగా పూర్తిచేసేందుకు సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అనుభవం ఉన్న వారితో పాఠాలు చెప్పిస్తున్నారు.

ఐదు బ్యాచ్‌లుగా విభజన

లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల శిక్షణ లో భాగంగా అభ్యర్థులను ఐదుబ్యాచ్‌లుగా విభజించారు. వీరితో ఈనెల 27వ తేదీ వర కు మాన్యువల్‌గా, డిఫరెన్స్‌ గ్లోబల్‌ పొజీషన్‌ సిస్టం (డీజీపీఎస్‌) యంత్రం ద్వారా సర్వే చేయిస్తారు. సర్వే చేసే సందర్భంలో ఒరిజినల్‌ రికార్డులను ఎలా చూడాలన్నది వివరిస్తా రు. గ్రామ మ్యాపులతో పాటు సర్వే రికార్డుల ఆధారంగా భూ కొలతలు ఎలా చేయాలన్నది నేర్పిస్తారు. ఇప్పటికే జిల్లాలోని పలు మండలాల్లో సర్వేయర్లతో కలిసి అభ్యర్థులు భూముల కొలతలు చేపట్టారు. మాన్యువల్‌తోపాటు డీజీపీఎస్‌ యంత్రంపై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు.

నోటీసులు జారీ

భూభారతి చట్టం కింద రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి నోటీసులు జారీ చేసే ప్రక్రియను జిల్లా యంత్రాంగం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. తహసీల్దార్‌ కార్యాలయాల్లో నోటీసులు సిద్ధం చేస్తున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. ప్రస్తుతం అన్ని మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జిల్లాలో 14,328 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల ఆన్‌లైన్‌ పూర్తి చేశారు. దరఖాస్తుదారులకు భూ సమస్య దేని ప్రకారం పరిష్కారమైంది? ఎందుకు పరిష్కారం కాలేదు? తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా సమాధానం ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతీ దరఖాస్తుకు ఎండార్స్‌మెంట్‌(సమాధాన నోటీసు)ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో రెవెన్యూ గ్రామాల వారీగా నోటీసులు అందజేయనున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించడానికి బృందాలను ఏర్పాటుచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. భూభారతి చట్టం అమలులో భాగంగా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో అధిక శాతం సర్వేనెంబర్లు, పేర్ల మిస్సింగ్‌లతో పాటు సాదాబైనామా దరఖాస్తులు ఉన్నాయి.

పరీక్షలకు ఏర్పాట్లు చేశాం : మధుసూదన్‌, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని పాలిటెక్నిక్‌, ఐటీఐ, సివిల్‌, బీటెక్‌ అభ్యసించిన వారికి లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల కోసం శిక్షణ ఇస్తున్నాం. జిల్లాలో మొత్తం 180 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరికి థియరీ తరగతులు పూర్తయ్యాయి. ఐదు బ్యాచ్‌లుగా విభజించి క్షేత్రస్థాయిలో మాన్యువల్‌తోపాటు డీజీపీఎస్‌ యంత్రంపై పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. ఒరిజినల్‌ రికార్డుల ప్రకారం సర్వే చేయడంపై అనుభవజ్ఞులైన సర్వేయర్లతో శిక్షణ ఇస్తున్నాం. పలు మండలాల్లో ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే శిక్షణలు కొనసాగుతోంది. అంతేగాక ఈ నెల 27 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

Updated Date - Jul 16 , 2025 | 12:24 AM