Share News

ఆ ఊరితో అనుబంధం.. ఆత్మీయత ఇక జ్ఞాపకాలే

ABN , Publish Date - Jul 16 , 2025 | 12:36 AM

అక్కా ఏమైందే పొద్దున్నుంచీ కనిపిస్తలేవు.. ఒంట్లో ఎట్లుందే ఏమైన అయ్యిందా, అయ్యో జ్వరమొస్తే చెప్పొచ్చు గదే, వెళ్లి మందులైనా తెచ్చిద్దు.. ఇలా పల్లెల్లో ఒకరికొకరుగా ఉన్నోళ్లు ఇప్పుడు ఒక్కో ఊరిలో ఉంటున్నారు. ఇప్పుడు బంధాలు, అనుబంధాలన్నీ వారికి అవతల గట్టుగా ఉన్నాయి.

ఆ ఊరితో అనుబంధం.. ఆత్మీయత ఇక జ్ఞాపకాలే
ఖాళీగా నర్సిరెడ్డిగూడెం గ్రామం

అక్కా ఏమైందే పొద్దున్నుంచీ కనిపిస్తలేవు.. ఒంట్లో ఎట్లుందే ఏమైన అయ్యిందా, అయ్యో జ్వరమొస్తే చెప్పొచ్చు గదే, వెళ్లి మందులైనా తెచ్చిద్దు.. ఇలా పల్లెల్లో ఒకరికొకరుగా ఉన్నోళ్లు ఇప్పుడు ఒక్కో ఊరిలో ఉంటున్నారు. ఇప్పుడు బంధాలు, అనుబంధాలన్నీ వారికి అవతల గట్టుగా ఉన్నాయి. ఒకప్పుడు గట్టు సమీపంలోని చెరువు ఊరందరినీ చల్లగా చూసి పొట్టనింపితే ,ఆ చెరువును రిజర్వా యర్‌ చేసేందుకు ఊళ్లను ఖాళీ చేయించారు. అందులో నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం నర్సిరెడ్డిగూడెం ఒకటి. గుట్టలు, పచ్చల పొలాల మధ్య కళకళలాడిన ఊరు, గ్రామస్థులు ఊరొదిలిపోవడంతో కళావిహీనమైంది. అక్కడి ప్రజలూ అనుబంధాలకూ దూరమయ్యారు ఊరితోనూ, అందరితోనూ...

(ఆంధ్రజ్యోతి- మర్రిగూడ)

నర్సిరెడ్డిగూడెం గ్రామం 250 ఏళ్ల కిందట ఏర్పాటైనట్లు గ్రామస్థులు తెలిపారు. 1250 జనాభా గల ఈ గ్రామంలో 298 కుటుంబాలు జీవనం సాగించేవి. వ్యవసాయమే ఉపాధిగా జీవిస్తున్న వారే అత్యధికంగా ఉండేవారు. ఈ గ్రామంలో 915 ఎకరాలు ఉండగా 95 మంది రైతులు ఉన్నారు. సమీపంలోనే చర్లగూడెం చెరువు ఉండటంతో సాగు, తాగునీటికి అంతగా ఇబ్బంది పడేవారు కాదు. ఏ కష్టమొచ్చినా ఒక్కతాటిపై నిలబడి ఒకరికొకరు సాయం చేసుకునేవారు. ఏ అరమరికలు లేని గ్రామంగా నర్సిరెడ్డిగూడెంకు పేరుంది. పార్టీల పరంగా ఎవరు ఎలా ఉన్నా గ్రామం విషయానికొస్తే అంతా ఏకతాటిపై ఉండేవారు.

ఒకనాడు వరంగా ఉన్న చర్లగూడెం చెరువు నేడు వారి వలసకు కారణమైంది. ప్రస్తుతం చెరువును రిజర్వాయర్‌గా మారుస్తున్నారు. ఈ రిజర్వాయర్‌ కింద మొదట ముంపునకు గురవుతున్న గ్రామం కూడా ఇదే. చెరువు నీడనే బతికిన ఈ గ్రామస్థులు ఈ చెరువు ముంపు పరిధిలో ఉండటం, వర్షాకాలం సమీపిస్తుండటం, రిజర్వాయర్‌ పనులు పూర్తికావస్తున్న నేపథ్యంలో అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయించారు. రిజర్వాయర్‌ నిర్మాణంతో సర్వం కోల్పోయిన నర్సిరెడ్డిగూడెం గ్రామస్థులు చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్లిపోయారు. ఒకనాడు బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతను పంచుకున్న గ్రామస్థులు గతాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఇదీ ప్రాజెక్టు నేపథ్యం

ఫ్లోరైడ్‌ నుంచి విముక్తి కల్పించాలనే ఉద్దేశంలో 2015లో అప్పటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మర్రిగూడ మండలం చర్లగూడెం రిజర్వాయర్‌ను నిర్మాణానికి పూనుకుంది. ఇందులో భాగంగా రూ.1,452 కోట్లతో 3,247 ఎకరాల విస్తీర్ణంలో రిజర్వాయర్‌ చేపట్టనుండగా, దీని కింద నర్సిరెడ్డిగూడెం, చర్లగూడెం, ఎంకపల్లి, వెంకటపల్లి తండాలు పూర్తిగా ముంపుకు గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు. రిజర్వాయర్‌ ఆయకట్టు నిర్మాణానికి అతి సమీపంలో ఉన్న మొదటి గ్రామం నర్సిరెడ్డిగూడెం. ఈ గ్రామస్థులందరికీ చింతపల్లి మండలంలోని సాయిబాబా టెంపుల్‌ వెనక భాగంలోని ప్రభుత్వ భూమిని కేటాయించారు. 257 మందికి పునరావాసం కల్పిస్తున్నట్లు ధ్రువపత్రాలు ఇవ్వగా, ఇంకా 41 మంది బాధితులకు అందజేయలేదు. అదేవిధంగా 75మంది భూనిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, భూనష్టపరిహారం అందించలేదు. అయితే తమను బలవంతంగా ఖాళీ చేయించారని బాధితులు వాపోతున్నారు. బాధితులకు ఇంటి స్థలాన్ని ఇచ్చి నేరుగా ఇంటిని నిర్మించి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ అమలు చేయలేదు.

ఒక్క కుటుంబంలా ఉండేవాళ్లం

గ్రామంలోని ప్రజలం కులం, మతం భేదాలు లేకుండా ఆత్మీయంగా కలిసి ఉండేవాళ్లం. మా గూడెం చుట్టూ గుట్టలు ఉండేవి. పొద్దున లేస్తే ఉమ్మడి కుటుంబంలా ఉంటూ ఒకరికొకరు వరసలు పెట్టి పలకరించుకునేవాళ్లం. ఊరు వదిలి శివన్నగూడెంకు వచ్చి ఉంటున్నాం. మా పల్లెలో బంధాలను మరువలేక పోతున్నాం.

- మాదగోని సత్తమ్మ, మాజీ ఎంపీటీసీ

నా పిల్లలు చెల్లా చెదురయ్యారు

నాకు ముగ్గురు కుమారులు, కుటుంబం ఉమ్మడిగా ఉండేది. ఊరిలోనే కలిసి ఉండేవారం. రిజర్వాయర్‌ పుణ్యమా అంటూ నా కుమారులు చెల్లా చెదురయ్యారు. పనుల కోసం ఇద్దరు హైదరాబాదులో ఉంటున్నారు. అందరికీ దూరంగా ఉండే పరిస్థితి వచ్చింది. 10 మంది మనమళ్లు, మనవరాళ్లతో కలిసి ఉండే నేను ప్రస్తుతం చిన్నకుమారుడితో కలిసి శివన్నగూడెంలో ఇల్లు తీసుకుని ఉంటున్నా. ఈ జీవిత చరమాంకంలో ఈ పరిస్థితి ఎవరికీ రావొద్దు.

అయితగోని వెంకటయ్యగౌడ్‌,

మరో ఊరిలో కూలీనయ్యా

మా ఊరిలో నాకు జీవనాధారంగా వ్యవసాయ భూమి ఉంది. రిజర్వాయర్‌ కింద నా మూడు ఎకరాల భూమిపోయింది. భూమికి నష్టపరిహారం అందింది. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పునరావాసంలో నా పేరు లేని లేదు. ఇప్పటివరకు నా భూమిలో సేద్యం చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే వాడిని. ఇప్పుడు కొత్తగూడెం వలస వచ్చి వ్యవసాయం లేక కూలి పని చేసుకుంటున్నాం. ఊర్లో ఉంటే కలోగంజో కలిసి బతికేవాళ్లం.. ఇప్పుడిలా దూరంగా తెలియని ఊరిలో ఉండాల్సి వస్తోంది.

మాదగోని యాదయ్య, భూ నిర్వాసితుడు (కొత్తగూడెం)

Updated Date - Jul 16 , 2025 | 12:36 AM