Share News

‘కార్పొరేట్‌’కు అనుకూలంగా కేంద్రం పాలన

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:20 AM

కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల పాలన సాగిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు.

‘కార్పొరేట్‌’కు అనుకూలంగా కేంద్రం పాలన
సమావేశంలో మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం

సూర్యాపేటటౌన, జూలై 3 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల పాలన సాగిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో గురువారం తెలంగాణ ప్రజాసంఘాల పోరాటవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. 2025-26 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ వ్యక్తులకు అనుకూలంగా నిధులు కేటాయించి, సామాజిక సంక్షేమానికి కోతలు విధించిదన్నారు. సామాన్యులపై భారాలు మోపి, కార్పొరేట్‌ సంస్థలకు పెట్టుబడిదారులకు రూ. 5వేల కోట్ల రాయితీ ప్రకటించిందని మండిపడ్డారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కార్మిక వర్గం ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు నిర్వీర్యం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఇస్తానన్న ఏడాదికి రూ.12వేలు నేటికి అమలు కావడంలేదన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బారతదేశంపై ఆంక్షలు విధిస్తుంటే ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 9వతేదీన నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక జిల్లా కన్వీనర్‌ మల్లు నాగార్జునరెడ్డి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోటగోపి, ఏకలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 12:20 AM