Share News

భవనాలు శిథిలం.. బతుకులు భయం భయం

ABN , Publish Date - Jun 01 , 2025 | 12:18 AM

నిజాం కాలం నాటి భవనాలు. కొన్ని కూలిపోగా, మరికొన్ని కూలిపోయే దశకు చేరుకున్నాయి. వర్షాకాలం ఆరంభం కావడంతో ఈ భవనాలు ఏ సమయంలో నేలమట్టమవుతాయోనన్న భయం ప్రజల్లో నెలకొంది. చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాలు దశాబ్ధాల క్రితం నాటి భవనాల్లో కొనసాగుతున్నాయి.

భవనాలు శిథిలం.. బతుకులు భయం భయం

వానాకాలం ఆరంభంతో అయోమయం

ఎప్పుడు కూలుతాయోనన్న ఆందోళన

ఆంధ్రజ్యోతి-భువనగిరి రూరల్‌: నిజాం కాలం నాటి భవనాలు. కొన్ని కూలిపోగా, మరికొన్ని కూలిపోయే దశకు చేరుకున్నాయి. వర్షాకాలం ఆరంభం కావడంతో ఈ భవనాలు ఏ సమయంలో నేలమట్టమవుతాయోనన్న భయం ప్రజల్లో నెలకొంది. చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాలు దశాబ్ధాల క్రితం నాటి భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే ధ్వంసమైన భవనాల పై కప్పులు పెచ్చులూడుతుండగా, మరికొన్ని కురుస్తున్నాయి. వీటికితోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్థానికులు ఉండే ఇళ్లు కూడా శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు కూలి, ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పాత భవనాలను గుర్తించి, వాటిని కూల్చేయడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని శిథిల భవనాలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం..

భువనగిరి పట్టణ, మండల ప్రజలకు, రైతులకు రెవెన్యూ తదితర సేవలందించే భువనగిరి తహసీల్దార్‌ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దీంతో కార్యాలయంలో పని చేసే అధికారులు, సిబ్బంది, కార్యాలయానికి వివిధ రెవెన్యూ సేవల పనుల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిటిష్‌ పాలకులు భారతదేశాన్ని పాలించే క్రమంలో భువనగిరి రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న ఈస్థలంలో బ్రిటిష్‌ అధికారులు విడిది చేసేందుకు 1930 సంవత్సరంలో ఈ విశాల భవన నిర్మాణం చేపట్టి కార్యకలాపాలు కొనసాగించారు. అయితే 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఈ భవనాన్ని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంగా ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు కొనసాగిస్తు వచ్చారు. కాగా భువనగిరి సబ్‌కలెక్టర్‌ కార్యాలయాన్ని జగదేవ్‌పూర్‌ రోడ్డులోని ప్రగతినగర్‌లో సొంత భవనం నిర్మించి, 1995 నవంబరు 10న ఈ కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అయితే అప్పటివరకు అద్దె భవనంలో కొనసాగుతున్న తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఈ భవనంలోకి తరలించారు. కాలక్రమేణ ఈ భవనంలో పై కప్పు శిథిలావస్థకు చేరడం, చిన్నపాటి వర్షానికి తహసీల్దార్‌ కార్యాలయంతోపాటు పలు వివిధ విభాగాలకు చెందిన గదులు కురుస్తుండడంతో తొమ్మిదేళ్ల క్రితం 2016లో అప్పటి ప్రభుత్వం నూతన కార్యాలయ నిర్మాణానికి రూ.కోటి20లక్షల నిధులను సీసీఎల్‌ఎ ద్వారా మంజూరు చేసింది. అయితే నెల రోజుల వ్యవధిలోనే నూతన జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ జారీచేయడంతో స్థానిక ఆర్డీవోతోపాటు తహసీల్దార్‌, కలెక్టరేట్‌ కార్యాలయ ఏర్పాటుకోసం ముమ్మర ప్రయత్నం చేస్తూ తహసీల్దార్‌ కార్యాలయ నూతన భవన నిర్మాణంపై జాప్యం జరగడంతోపాటు దృష్టి సారించలేదు. దీంతో ఆ నిధులు వెనక్కి వెళ్లాయి. వర్షాకాలంలో పైకప్పు నుంచి వరద నీరు గదుల్లోకి చేరడంతో చిన్నపాటి మరమ్మతులు చేపట్టి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఒక పక్క తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించేందుకు వచ్చిన కలెక్టర్‌, ఆర్డీవోల దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఈ విషయమై సంబంధిత అధికారులు రాష్ట్ర ఉన్నతాధికారులకు నూతన తహసీల్దార్‌ కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పలు దఫాలుగా నివేదికలు కూడా సమర్పిస్తూ వస్తున్నారు. ఇప్పటికైనా శిథిలావస్థకు చేరిన తహసీల్దార్‌ కార్యాలయాన్ని నేల మట్టంచేసి నూతన కార్యాలయ నిర్మాణానికి చొరవ చూపాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ ఎన్‌.అంజిరెడ్డిని వివరణ కోరగా నిధుల మంజూరుకోసం జిల్లా, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు నివేదికలు పంపించామన్నారు. నిధులు మంజూరు కాగానే నూతన తహసీల్దార్‌ కార్యాలయ నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు.

పొంచి ఉన్న ప్రమాదం

ఫ శిథి భవనాలతో పొంచి ఉన్న ప్రమాదం

ఫ 35 భవనాలకు నోటీసులు జారీ

భువనగిరి టౌన్‌: వేసవిలోనూ కురుస్తున్న వరుస వర్షాలు, కొన్ని రోజుల్లో రానున్న వర్షాకాలం తో శిథిల భవనాల రూపంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ప్రమాదకరంగా ఉన్న కొన్ని ఇళ్లలో మాత్రమే కొంత మంది నివాసం ఉంటుండగా కూలడానికి సిద్ధంగా ఉన్న మిగతా శిథిల గృహాల్లో ఎవరు నివాసం ఉండనప్పటికీ వాటితో పరిసర ప్రాంతాల ప్రజలకు ము ప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో భువనగిరి మునిసిపల్‌ పట్టణ ప్రణాళిక విభాగం చేపట్టిన సర్వేలో ఇప్పటివరకు 35 శిథిల ఇళ్లను గుర్తించి యజమానులకు నోటీసులు జారీచేశారు. కొనసాగుతున్న సర్వేలో మరిన్ని ప్రమాదకర ఇళ్లు వెలుగు చూస్తాయని అధికారులు అంటున్నా రు. ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను స్వయంగా కూల్చివేయండిలేదా మేమే కూల్చివేస్తామని నోటీ్‌సలలో పేర్కొంటున్నారు. ఆర్థిక స్తోమత ఉన్న యజమాను లు శిథిలగృహాలను కూల్చివేసి చార్జీలను వసూలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు మునిసిపల్‌ కమిషనర్‌ జి.రామలింగం, టీపీఎస్‌ నరేష్‌, టీపీబీవోలు ప్రవీణ్‌, వెంకట్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వేలో గుర్తించిన ప్రమాదకర గృహాలన్నింటినీ కూల్చివేయాలని మునిసిపల్‌ యంత్రాంగం భావిస్తున్నది. గత రెండు వర్షాకాలాలు, పట్టణ ప్రగతిలో భాగంగా సుమారు 30కిపైగా శిథిల భవనాలను తొలగించినట్లు మునిసిపల్‌ అధికారులు పేర్కొన్నారు. అయితే గుర్తించిన శిథిల భవనాలతో ప్రమాదాల నివారణకు వర్షాకాలం ప్రారంభంలోపే తొలగించాలని స్థానికులు అంటున్నారు.

యాదగిరిగుట్ట రూరల్‌: యాదగిరిగుట్ట మునిసిపాలిటీ పరిధిలోని 12 వార్డు ల్లో ఇప్పటివరకు 12 పాత భవనాలు గుర్తించినట్లు టౌన్‌ ప్లానింగ్‌ ఇన్‌చార్జీ అధికారి నర్సింహులు తెలిపారు. వారందరికీ మున్సిపాలిటీ ద్వారా నోటీసులు జారీ చేశామన్నారు. భవనాల్లో నివసిస్తున్న 12 కుటుంబాల్లో సుమారు 60 మం ది నివసిస్తున్నట్లు, ఇందులో నివసిస్తే ప్రమాదం ఉంటుందని వారికి వివరించినట్లు చెప్పారు. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థలో లేవని చెప్పారు.

ఆరు దశాబ్ధాల నాటి భవనం..

చౌటుప్పల్‌ టౌన్‌: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలో ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన పంచాయతీరాజ్‌ శాఖ భవన సముదాయం శిథిలావస్థకు చేరింది. వర్షాలకు భవన సమూదాయం కూలి పోయే పరిస్థితి నెలకొనడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రూ.కోట్ల విలువైన భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవనాల పైభాగంలో చెట్లు పెరుగుతుండడం, ఆ చెట్ల వేర్లు స్లాబ్‌ను చీల్చుకొని రెండు గదుల్లోకి జారి నిండా అల్లుకున్నాయి. గోడలు సైతం పగుళ్లు వచ్చాయి. ఆవరణ మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోవడంతో పాములు, తేళ్లు దర్శనమిస్తున్నాయి. భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ భవన సముదాయాన్ని మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

20 ఏళ్లుగా నిరుపయోగంగా..

20 ఏళ్లుగా ఈ భవన సముదాయం నిరుపయోగంగా ఉండడంతో శిథిలావస్థకు చేరింది. దీనికి సంబంధించిన ఒక భవనాన్ని ప్రైవేట్‌ వ్యక్తి కబ్జాచేసి నివాసముంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. శిథిలావస్థకు చేరిన ఈ భవనాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

శిథిలావస్థలో ఉన్న భవనాల గుర్తింపు

మోత్కూరు, మే 31 (ఆంధ్రజ్యోతి): వర్షాలు కురిసి ప్రమాదాలు జరిగినప్పుడే హడావిడి చేయడం తప్ప, ముందస్తుగా ప్రమాదాలను గుర్తించి, నివారణ చర్యలు తీసుకోవడం అన్నది ప్రభుత్వ అధికారుల్లో కొరవడింది. పైనుంచి ఆదేశాలు వస్తేనే కింది స్థాయిలో పాటిస్తారు. వర్షాకాలం ప్రారంభమైనా గ్రామాలు, మునిసిపాలిటీల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించడం ఇంకా ప్రారంభంకాలేదు. మోత్కూరు మండలంలోని గ్రామాల్లో, మోత్కూరు మునిసిపాలిటీల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లు ఎన్ని ఉన్నాయి?, వర్షాకాలంలో శిథిలావస్థలో ఉన్న భవనాలు కూలి నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అధికారులను ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించినప్పుడు వారినుంచి సరైన సమాధానం రాలేదు. గత ఏడాది శిథిలావస్థలో ఉండి, ప్రమాదకరంగా ఉన్నాయని గుర్తించి ఇళ్లలో మనుషులు నివసించడం లేదుగాని, వర్షాలకు అవి కూలితే ప్రమాదమని వాటిని తొలగించడం లేదు. ఈ ఏడాది శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తింపు ఇంకా ప్రారంభం కాలేదని తెలిసింది. శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలని ఇటీవలే వార్డు ఆఫీసర్లను ఆదేశించినట్లు మోత్కూరు మునిసిపల్‌ కమిషనర్‌ కె.సతీ్‌షకుమార్‌ తెలిపారు. మునిసిపాలిటీలో ఇప్పటికి 12 ఇళ్లు శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించామన్నారు.

Updated Date - Jun 01 , 2025 | 12:18 AM