గంజాయి నిర్మూలనకు అధికారులు కృషి చేయాలి
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:31 AM
విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకొని సంబంధిత అధికారులు గంజాయి నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు ఆదేశించారు. శుక్రవారం గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నిర్మూలనకు అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై డీసీపీ అక్షాంశ్ యాదవ్‌తో కలిసి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
మత్తు పదార్థాలపై అవగాహన కల్పించాలి
కలెక్టర్ హనుమంతరావు
భువనగిరి (కలెక్టరేట్), జూలై 11 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకొని సంబంధిత అధికారులు గంజాయి నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు ఆదేశించారు. శుక్రవారం గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నిర్మూలనకు అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై డీసీపీ అక్షాంశ్ యాదవ్‌తో కలిసి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధిత శాఖల అధికారులు నిబద్ధతతో పనిచేస్తూ గంజాయిపై ఉక్కుపాదం మోపాలన్నారు. పోలీసు, ఎక్సైజ్, ఔషధ తనిఖీ, విద్య, వైద్యశాఖలు, అటవీ శాఖ, రవాణాశాఖ అధికారులు సమన్వయంతో గంజాయి నిర్మూలనకు పటిష్ఠమైన పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించే సందేశాత్మక వీడియోలను రూపొందించి స్కూల్స్, కళాశాలల్లో ప్రదర్శించాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు జరుగుతుందో గుర్తించాలని, సరిహద్దు రాష్ట్రాలనుంచి జిల్లాకు రవాణా జరగకుండా అన్ని చెక్‌పోస్టులపై నిఘా పెంచాలన్నారు. డీసీపీ అక్షాంశ్ యాదవ్ మాట్లాడుతూ డ్రగ్స్ కట్టడి, నిర్మూలనలో పోలీసులది కీలక పాత్ర అని, చెక్ పోస్టుల వద్ద నిఘా ఉండాలన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, అటవీ శాఖ అధికారి పద్మజారాణి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి, జిల్లా సంక్షేమాధికారి నర్సింహారావు, జిల్లా విద్యాధికారి కే. సత్యనారాయణ, డీపీవో సునంద తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి
తుర్కపల్లి: ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని కలెక్టర్ హనుమంతరావు కోరారు. మండలంలోని కోనాపూర్‌లో ఫైలెట్ ప్రాజెక్టుగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం సాయంత్రం పరిశీలించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు దశలవారీగా ఖాతాలో డబ్బులు జమ అవుతాయన్నారు. ఇసుక అవసరమైన వారు రాజాపేట మండలంలోని బేగంపేట వాగునుంచి తెచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి సందీ్‌పరెడ్డి, నాయకులు భాస్కర్‌రెడ్డి, మధు పాల్గొన్నారు.