రైతు కంట కన్నీరు
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:47 AM
సీజన్ తొలిరోజుల్లో మురిపించిన వరుణుడు తర్వాత కానరాకుండా పోవడంతో రైతుల్లో నైరాశ్యం నెలకొంది. చినుకామ్మ జాడ ఇవ్వాళో, రేపో కానరాకుండా పోతుందానని ఎదురు చూస్తు న్న కర్షకుల కళ్లలో కన్నీరు తప్ప, ఆనందం లేదు.
బలమైన కార్తెలు వెళ్లిపోతున్నా... జాడ లేని వాన
ఎదగకుండానే పూతకొచ్చిన పత్తి చేలు
వర్షాల్లేక ఎండిపోయి గడ్డి మొలిచిన బావులు
నీరు లేక వెలవెలబోతున్న చెరువులు
(ఆంధ్రజ్యోతి-మోత్కూరు): సీజన్ తొలిరోజుల్లో మురిపించిన వరుణుడు తర్వాత కానరాకుండా పోవడంతో రైతుల్లో నైరాశ్యం నెలకొంది. చినుకామ్మ జాడ ఇవ్వాళో, రేపో కానరాకుండా పోతుందానని ఎదురు చూస్తు న్న కర్షకుల కళ్లలో కన్నీరు తప్ప, ఆనందం లేదు. వేసిన విత్తనాలు వాడిపో యి, తిరిగి వేసినా మొలకెత్తుతాయో లేదో తెలియక ఆందోళన చెందుతున్నారు. చెరువులు, కుంటలు, బావుల ద్వారానైనా సాగు చేద్దామంటే అందులోనూ నీరు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు.
జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా యి. వర్షాకాలం ప్రారంభమై సుమారు రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్క భారీ వర్షమైనా కురువలేదు. చెరువులు, కుంటలు నీరు లేక వెలవెలబోతున్నాయి. జిల్లాలో చెప్పుకోదగిన ప్రాజెక్టులు లేకపోవడంతో వర్షాధారంపైనే పం టలు సాగవుతున్నాయి. పూర్తిగా వర్షాధారంపైనే మెట్టపంటలు సాగువుతాయి. చెరువులు, కుంట లు, బావులు, బోర్లపై ఆధారపడి రైతులు వరిసాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు నిండకపోవడంతో బావులు,బోర్లలో నీరు లభించక కొం దరు ఇంతవరకు నార్లు పోయలేదు. అక్కడక్కడ పోసిన నార్లు ముదిరిపోతున్నాయి. చాలా గ్రా మాల్లో బావులు ఎండిపోయి గడ్డి మొలిచింది. కాలం పరిస్థితి చూస్తే రైతు కంట కన్నీరొస్తుంది.
బలమైన కార్తెలు వెళ్లిపోయాయి
వాన కాలం పంటలు విత్తనాలు విత్తడానికి నార్లు పోయడానికి బలమైన కార్తెలు రోహిణి, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, పునర్వసు కార్తెలు. అవివెళ్లి పోయాయి. ఆదివారం (ఈ నెల 3) నుంచి అశ్లేష కార్తె ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు జిల్లాలో ఒక్క భారీ వర్షమైనా కురవలేదు.
ఎదగకుండానే పూతకొచ్చిన పత్తి చేలు
కత్తెర నుంచి ఇప్పటి వరకు అడపాదడపా కురిసిన ముసురులాంటి వర్షాలకు రైతులు పత్తి విత్తనాలు విత్తగా కొన్ని మొలకెత్తాయి, మరికొన్ని మొలకెత్తలేదు. ఒక్కో రైతు మూడుసార్లు పత్తి గింజలు పెట్టారు. పత్తిచేలకు కూడా అద ను ప్రకారం వర్షాలు కురవకపోవడంతో పత్తి చేలు ఎత్తుగా పెరగలేదు. రెండున్నర నెలల కా లంలో కనీసం మూడు, మూడున్నర అడుగులు చెట్టు (పత్తి మొక్క) పెరిగాల్సి ఉండగా ఇప్పటి కీ చాలాచోట్ల అడుగు ఎత్తులోనే పత్తి చేను ఉం ది. పంగ తోల లేదు. అప్పుడే పూత పూసి గూడ వస్తోంది. చెట్టు పెరిగి పంగ తోలితేనే పంగ పంగకు (కొమ్మలకు) పూత కాత వస్తేనే దిగుబడి ఎక్కువగా వస్తుంది. చెట్టు ఎదగకుండా పూతకు వస్తే కనీసం పెట్టుబడులు కూడా చేతికి రావని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎండిపోయి గడ్డి మొలిచిన బావులు
జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా. ఇప్పటివరకు 50 వేల ఎకరాలు కూడా నాటు వేయలేదు. భారీ వర్షాలు కురవక చెరువులు, కుంటల్లో, బిక్కేరులో నీరు లేక, బావులు, బోర్లలో భూగర్భజలాలు అడగంటిపోయాయి. పలు గ్రామాల్లో బావులు ఎండిపోయి గడ్డి మొలిచింది. చాలామంది రైతులు ఇంతవరకు వానాకాలం నాట్లకోసం నారు పోయలేదు. అక్కడక్కడ పోసిన కొద్దిపాటి నార్లు ముదిరిపోతున్నాయి. అడపాదడపా కురిసిన వర్షాలకు (ముసుర్లకు) దున్ని నాటు వేసిన వరినాట్లు ఇటీవల ఎండలు మండిపోతుండటంతో నీరు అందక ఎండిపోతున్నాయి. సన్నవరి సాగుకు రోహిణి కార్తెలో, కాదంటే ఆరుద్ర కార్తెల్లో నార్లు పోస్తారు. ఇప్పుడు అశ్లేష కార్తె రావడంతో సన్న వరిసాగుకు చరమగీతం పాడినట్టేనంటున్నారు. దొడ్డు రకాల పంటలకు నార్లు పోసే కార్తెలు కూడా వెళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా నాలుగైదు భారీ వర్షాలు కురిస్తేనే ఇటు పత్తి, కంది పంటలకు మేలు జరగడంతోపాటు చెరువులు, కుంటల్లోకి నీరొచ్చి, తద్వారా బావులు, బోర్లలో భూగర్భజలాలు పెరిగి వానాకాలం వరి సాగు ముందుకు సాగుతుందంటున్నారు.
వాడుతున్న పత్తి, కంది చేలు
జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో పత్తి, సుమారు 2వేల ఎకరాల్లో కంది సాగు చేశారు. మెట్ట పంటలకు అవసరమైన వర్షాలు కూడా కురవడంలేదు. జూలై నెల వెళ్లిపోయినా అప్పుడప్పుడు ముసుర్లు తప్ప భారీ వర్షం కురవలేదు. దీంతో మెట్టపంటలకు తగినంత నీ రు అందక ఎత్తు పెరగడంలేదు. రైతులు గుంటుకలు తోలి, ఎరువులు వేశారు. గుంటుకలు తోలిన తర్వాత వర్షం కురువకపోవడంతో పదను ఆరిపోయి, ఇటీవలి ఎండలకు పత్తి, కంది చేలు వాడిపోతున్నాయి.
వెలవెలబోతున్న చెరువులు, కుంటలు
జిల్లాలో 1,011 చెరువులు, కుంటలు ఉండగా, వీటి పరిధిలో 51,325 ఎకరాల ఆయకట్టు ఉంది. జిల్లాలో ఇప్పటివరకు కొన్ని చెరువుల్లోకి మాత్రమే కొద్దిగా నీరు వచ్చింది. భీమలింగం కాల్వ ద్వారా నీరు వచ్చే సౌకర్యం ఉన్న మోత్కూరు మండలం పాలడుగు, దత్తప్పగూడెం చెరువుల్లోకి, బృందావన్ కాల్వ ద్వారా నీరు వచ్చే సౌకర్యం ఉన్న మోత్కూరు, కొండగడప, పాటిమట్ల తదితర చెరువుల్లోకి ఇంతవరకు చుక్క నీరు రాలేదు. గుండాల మండలంలో చెరువులు, కుంటలు నింపేందుకు దేవాదుల కాల్వ ఉన్నా అందులోనూ నీరు వదలడంలేదు. గత ఏడాది కూడా చెరువులు, కుంటలు నిండలేదు. దీంతో కరువొస్తుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎకరం నాటు వేస్తే పూర్తిగా ఎండింది : (ఎల్దండె కిషన్‌రెడ్డి, రైతు, మోత్కూరు)
బోరుబావి కింద వచ్చిపోయే వర్షాలకు ఎకరం వరినాటు వేశాను. వర్షాల్లేక భూగర్భ జలాలు తగ్గి కొద్దికొద్దిగా వెనక్కు వచ్చి ఎకరం వరి నాటు పూర్తిగా ఎండింది. 20 ఆపితే నీరు ఊరబెట్టి మోటరు పెడితే ఒక్క నిముషం పోసి ఆగిపోతుంది. మిగతా నాటుకోసం పోసిన నారు ముదిరిపోతున్నది.
నీరు లేక నారు పోయలేదు : బిళ్లపాటి గోవర్ధన్‌రెడ్డి, సేంద్రియ రైతు, మోత్కూరు
నాకు రెండు బోరుబావులు ఉన్నాయి. గతేడాది నాలుగు ఎకరాలకు నీరందింది. ఈసారి బోర్లు పోయడంలేదు. పశువులు తాగడానికి కూడా నీరు దొరకడంలేదు. దీంతో ఇప్పటివరకు నారు పోయలేదు. నారు పోయడానికి బలమైన కార్తెలు వెళ్లిపోతున్నాయి. ఏం చేయాలో తోచడం లేదు. పత్తి సాగు చేస్తే వర్షాల్లేక అదికూడా ఎదగలేదు. పూతకు వచ్చింది. చేను ఎదగకుండా పూతకు వచ్చిందంటే పెట్టుబడి కూడా చేతికి రాదు. ఎండా కాలంలో వర్షాలు కురుస్తూ వాన కాలంలో ఎండలు మండిపోతున్నాయి. మారిన కాలం రైతు కంట కన్నీరుపెట్టిస్తున్నది.
బీడు భూములకు బునాదిగాని కాల్వతో పునరుజ్జీవం
వలిగొండ: మండలంలోని పలు గ్రామాల ప్రజలు బునాదిగాని కాల్వ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి కావాలని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. నెర్రలుబారిన బీడు భూములకు బునాదిగాని కాల్వ నీటితో పునర్జీవం కలగనుంది. గత 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత రైతులు తమ కళ్లలో వొత్తులు వేసుకొని చూస్తున్నారు. మూసీ నదికి ఎగువ ప్రాంతంలో ఉన్న పహిల్వాన్‌పురం, రెడ్లరేపాక, దాసిరెడ్డిగూడెం, కంచనపలి,్ల పులిగిల్ల, ఎం.తుర్కపల్లి పరిధిలోని రైతులకు అధిక ప్రయోజనం కలుగునుంది. సాధారణంగా వేసవి కాలంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంటుంది. ఈ సీజన్‌లో సాగునీటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యవసాయం కూడా కష్టంగా మారుతుంది. ఈ గ్రామల రైతులు బోర్ల కింద వ్యవసాయం చేస్తారు. ఎండల కారణంగా భూగర్భజలాలు అడుగంటి బోర్లలో నీటి మట్టం తగ్గుతుంది. కనుక వ్యవసాయాన్ని పడవపేడుతారు. ఈసమస్యను గుర్తించిన ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు బునాదిగాని కాల్వనిర్మాణం చేపట్టాలని ఉద్యమాలు చేశారు. ప్రజా పోరాటాలను గుర్తించిన ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో బునాదిగాని కాల్వ నిర్మాణం కోసం బీజం పడింది.
కాల్వ సాగనుంది ఇలా...
బీబీనగర్ మండలం మక్తాఅనంతరం నుంచి కాల్వ ప్రారంభమై భువనగిరి-వలిగొండ మోటకొండూరు, ఆత్మకూరు.ఎం, మోత్కూర్, అడ్డగూడూరు, మండలాల మీదుగా సుమారుగా 98.6 కిలోమీటర్ల పొడవునా బునాదిగాని కాల్వ సాగనుంది. సుమారుగా 48 గ్రామాల గుండా ప్రయాణించనుంది. 50 చెరువులను ఈ కాల్వ నీటితో నిండనుంది. దీని ఆయకట్టు కింద సుమారుగా 2,575 ఎకరాల భూములకు నీరు పారుతుంది. పరోక్షంగా మరో 20 వేల ఎకరాలకు మేలు జరగనుందని ఒక అంచనా.
వలిగొండ మండల రైతులకు లబ్ధి ..
ఈ కాల్వ భువనగిరి మండల పరిధి దాటాక వలిగొండ మండలం పహిల్వాన్‌పురం, గ్రామ సరిహద్దులో ప్రవేశించి కంచెన్నపలి,్ల పులిగిల్ల, ఎం.తుర్కపల్లి గ్రామాల మీదుగా సుమారుగా 8 కిలోమీటర్ల పొడవునా ఈ కాల్వ సాగుతుంది. బీడు భూములకు ఈకాల్వ వల్ల సస్యశ్యామలమై వ్యవసాయంతో రైతులకు లబ్ధి చేకూరుతుంది. సుమారుగా 27 ఎకరాల భూములు కాల్వ నిర్మాణంలో రైతులు తమ భూములను కోల్పోతున్నారు.
రైతుల ఆవేదన
సుదీర్ఘకాలం నుంచి బునాదిగాని కాల్వ నిర్మాణం సాగడం పట్ల రైతులకు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈకాల్వ ద్వారా నీరు రావడం లేదని ఇప్పటికే రెండు పర్యాయాలుగా బునాదిగాని కాల్వకు భూములు కోల్పోయామని నీరు రాని కాల్వకు భూములు ఎందుకు ఇవ్వాలని అధికారులను రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయం చేయలేక పోతున్నామని కాల్వపై కల్వర్టు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు.