కన్నీరైన పల్లెర్ల
ABN , Publish Date - Jul 16 , 2025 | 12:37 AM
భార్య కుట్రలో హతమైన వస్తుప్పల స్వామి స్వగ్రామం యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం పల్లెర్లలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు.
భార్య కుట్రలో హతమైన స్వామి
గ్రామంలో విషాదఛాయలు
ఆత్మకూరు(ఎం), జూలై 15 (ఆంధ్రజ్యోతి) : భార్య కుట్రలో హతమైన వస్తుప్పల స్వామి స్వగ్రామం యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం పల్లెర్లలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. జరిగిన దారుణాన్ని ప్రతీ ఒక్కరూ ఖండించడంతో పాటు కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్వామికి మేనమామ కుమార్తె స్వాతితో 22 ఏళ్ల కిందటే వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. స్వామి తండ్రి చనిపోగా ఏకైక కుమారుడిని కోల్పోయానని తల్లి లక్ష్మమ్మ రోదించింది. తండ్రి మృతదేహాన్ని చూసి స్వామి పిల్లలు కంటతడిపెట్టారు. స్వామి హత్యకు కారకులైన నిందితులకు కఠిన శిక్ష పడాలని, వారి జీవితఖైదు విధించాలని బంధువులు డిమాండ్ చేశారు.
ఆర్తనాదాలతో మార్మోగిన భువనగిరి ఆసుపత్రి
భువనగిరి టౌన, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : మూటకొండూరు మండలం కాటేపల్లిలో సినిఫక్కీలో దారుణహత్యకు గురైన వస్తువుల స్వామి బంధుమిత్రుల రోదనలతో యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రి ప్రాంగణం మంగళవారం మార్మోగింది.వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే నెపంతో భార్యనే కారు ప్రమాదం రూపంలో హత్య చేయించింది. స్వామి మృతదేహాన్ని చూసేందుకు సమాచారాన్ని అందుకున్న బంధుమిత్రలు పెద్దసంఖ్యలో జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పట్టణ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.