బాలుడి ప్రాణం తీసిన ఈత సరదా
ABN , Publish Date - May 03 , 2025 | 12:01 AM
ఈత సరదా బాలుడి ప్రాణం తీసింది. శుక్రవారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో ఈ ఘటన జరిగింది.
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో ఘటన
మేళ్లచెర్వు, మే 2 (ఆంధ్రజ్యోతి): ఈత సరదా బాలుడి ప్రాణం తీసింది. శుక్రవారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో ఈ ఘటన జరిగింది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపాలెం మండలం నెమలిపురి గ్రామానికి (పులిచింతల కాలనీ) చెందిన కొమ్ము లోకేష్(16) కోదాడ సమీపంలోని గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి పూర్తి చేశాడు. తల్లిదండ్రులు కూలి పనిచేసుకుని జీవిస్తున్నారు. వేసవి సెలవులు కావటంతో స్వగ్రామం నెమలిపురి చేరుకుని ఐదుగురి స్నేహితులతో కలిసి ఈత నేర్చుకునేందుకు పులిచింతల బ్యాక్‌వాటర్‌లో దిగారు. ఖాళీ ప్లాస్టిక్ డబ్బాను నడుముకు కట్టుకుని నీటిలో ఈదుతుండగా, డబ్బా ఊడిపోవటంతో ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. మత్స్యకారులు, గ్రామస్థులు నీటిలో గాలించగా కొంత దూరంలో లోకేష్ మృతదేహం లభ్యమైంది. లోకేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. లోకే్‌షకు ఓ సోదరి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ క్రైం ఎస్‌ఐ అజయ్ తెలిపారు.