పశుపోషకులకు వరప్రదాయిని సురభి చియాన శ్రఖ్ల
ABN , Publish Date - May 08 , 2025 | 12:14 AM
పశుపోషకులకు సురభి చియాన శ్రఖ్ల పథకం వరప్రదాయిని కానుందని జిల్లా పశువైద్య, పశుసంవర్ధక అధికారి డాక్టర్ దాచేపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సురభి చియాన శ్రఖ్ల పథకంలో భాగంగా పశువుల గుర్తింపు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
కోదాడ రూరల్, మే 7 (ఆంధ్రజ్యోతి): పశుపోషకులకు సురభి చియాన శ్రఖ్ల పథకం వరప్రదాయిని కానుందని జిల్లా పశువైద్య, పశుసంవర్ధక అధికారి డాక్టర్ దాచేపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సురభి చియాన శ్రఖ్ల పథకంలో భాగంగా పశువుల గుర్తింపు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం పథకం విశేషాలను వివరించారు. దేశంలో 10 లీటర్ల నుంచి 15 లీటర్ల పాలిచ్చే పశువులను గుర్తించి వాటి జాతి, వయస్సు, ఈతలు, రోజువారీ పాల దిగుబడి, వాటి తల్లి, తండ్రి వివరాలు, మేత అలవాట్లు యజమాని వివరాలను భారత పశుదాన యాప్‌లో అప్‌లోడ్ చేస్తామన్నారు. అలా సేకరించిన అత్యుత్తమ పశువుల యాజమాన్యం, సంరక్షణ,పోషకులకు చేయూత అందించే పథక రూపకల్పనకు ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో భాగ ంగా జిల్లాలో 10 లీటర్లపైన పాలిచ్చే అన్నిపశువుల వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తామన్నారు. పశుపోషకులు ఆ పశువుల వివరాలను తమ పరిధిలోని పశువైద్యాధికారులను సంప్రదించి నమోదు చేయించుకోవాలని సూచించారు. కోదాడ పరిసర ప్రాంతాల్లో 18లీటర్ల వరకు పాలిచ్చేవి రూ.1.5 లక్షలు, రూ.2.5 లక్షల విలువైన గేదెలు ఉన్నాయని, వాటి పోషణలో శాస్త్రీయత పాటిస్తూ అధికలాభాలు పొందాలంటే వీరికి ఒక శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని ప్రాంతీయ పశువైద్యశాలఅసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య ప్రతిపాదించారన్నారు. ఇందుకు అనుమతిస్తూ కావాల్సిన సౌకర్యాల ఏర్పాటుకి చేయూతిస్తామన్నారు. రైతులను గుర్తించి త్వరలో శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆరో విడత సామూహిక గాలికుంటు నివారణ కార్యక్రమంలో భాగంగా 30 గేదెలు, 15 ఆవులతో డెయిరీ ఫాం నిర్వహిస్తున్న షేక్ ఉస్మాన ఫారాన్ని సందర్శించారు. గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. టీకా కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. పశువులన్నింటికీ టీకా అందించి జిల్లాలో గాలికుంటు వ్యాధి ఆనవాళ్లు లేకుండా చేయాలన్నారు. కార్యక్రమంలో సిబ్బంది రాజు, సాగర్ తదితరులు పాల్గొన్నారు