Share News

ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రాగిజావ

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:43 AM

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. పోషకాహార లోపంతో విద్యార్థులు ఇబ్బందులుపడుతున్న నేపథ్యంలో వారికి రాగిజావను అందించనుంది.

 ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రాగిజావ

అమలుకు ప్రభుత్వం నిర్ణయం

ఒక్కో విద్యార్థికి వారంలో మూడు రోజుల పాటు అందజేత

10 గ్రాముల రాగి పిండి, 10 గ్రాముల బెల్లంతో జావ తయారీ

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట(కలెక్టరేట్‌)

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. పోషకాహార లోపంతో విద్యార్థులు ఇబ్బందులుపడుతున్న నేపథ్యంలో వారికి రాగిజావను అందించనుంది. ఇందుకోసం ఇప్పటికే సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్‌తో అంగీకారం కుదిరింది. 60 శాతం ట్రస్ట్‌, 40 శాతం ప్రభుత్వ నిధులతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. విద్యార్థుల్లో చాలామంది పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ నివేదికలు చెబుతున్నాయి. ఆరోగ్యం విషయంలో సరిగా లేకపోతే విద్యార్థులు విద్యపై దృష్టి సారించలేరని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో పోషకాలతో కూడిన రాగిజావను అందించాలని నిర్ణయించింది.

వారంలో మూడు రోజుల పాటు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారంలో మూడు రోజుల పాటు రాగిజావను అందించనున్నారు. ఉదయం ప్రార్థనా సమయానికి ముందు అందిస్తారు. ఒక్కో విద్యార్థికి 10 గ్రాముల రాగిపిండి, 10 గ్రాముల బెల్లం కలిసి రాగిజావను తయారు చేయనున్నారు. ఇప్పటికే వారంలో మూడురోజులు కోడిగుడ్లు అందిస్తుండగా, మిగిలిన మూడు రోజుల్లో రాగిజావను అందించనున్నారు. రాగిజావను తయారు చేసే బాధ్యతను మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు అప్పగించారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థికి 25 పైసల చొప్పున వారికి ఇవ్వనున్నారు. మండల రీసోర్స్‌ కేంద్రం నుంచి పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా రాగి పిండి, బెల్లం పదార్థాలను సరఫరా చేయనున్నారు.

రాగిజావతో ప్రయోజనాలు

రాగిజావ తీసుకోవడంవల్ల అనేక ఉపయోగాలు కలగనున్నాయి. రాగులు, బెల్లం పదార్థాల్లో కాల్షియం, ఐరన ఎక్కువగా ఉంటాయి. రాగులు ఎముకల ఆరోగ్యానికి, ఐరన అలసట, రక్తహీనతను నివారించగానికి ఉపయోగపడనుంది. అధికఫైబర్‌, ప్రోటీన ఉండడంలో ఈ పోషకాలు జీర్ణక్రియకు, కండరాల అభివృద్ధికి తోడ్పడుతాయి.

సూర్యాపేట జిల్లాలో 881 ప్రాఠశాలలు

జిల్లా పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 881 పాఠశాలలు ఉన్నాయి. 49వేల మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అమలుచేస్తున్నారు. తాజాగా రాగిజావను కూడా త్వరలో అందించనున్నారు.

త్వరలో అమలు చేస్తాం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు త్వరలో రాగిజావను అందజేస్తాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే మధ్యాహ్నం భోజనంలో వారంలో మూడురోజులు కోడిగుడ్డు అందజేస్తున్నాం. మిగిలిన రోజులు రాగిజావను అందిస్తాం. రాగిజావతో విద్యార్థులకు పోషకాలు అందుతాయి.

అశోక్‌కుమార్‌, డీఈవో సూర్యాపేట.

Updated Date - Sep 03 , 2025 | 12:43 AM