రహదారులపై రుధిర ధారలు
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:27 AM
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, రహదారుల వెంట ఉన్న వ్యాపారుల స్వార్థం, మితిమీరిన రాజకీయ జోక్యంతో జిల్లా కేంద్రం భువనగిరిలో రహదారులు ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి.
జిల్లా కేంద్రంలో నిత్యం ప్రమాదాలు
ప్రభుత్వ శాఖల మధ్య కొరవడిన సమన్వయం
ప్రమాదాలకు పరోక్షంగా కారణమవుతున్న రాజకీయ జోక్యం
(ఆంధ్రజ్యోతి,భువనగిరి టౌన్) : ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, రహదారుల వెంట ఉన్న వ్యాపారుల స్వార్థం, మితిమీరిన రాజకీయ జోక్యంతో జిల్లా కేంద్రం భువనగిరిలో రహదారులు ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. పట్టణ రహదారుల నిర్వహణ, ఆక్రమణల తొలగింపు, ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయా శాఖల అధికారుల మధ్య స్పష్టత లేకపోవడమూ ఇందుకు కారణం. దీంతో పట్టణ ప్రధాన రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయి.
జిల్లా కేంద్రంలోని జగదేవ్‌పూర్ చౌరస్తా వద్ద మూడు రోజుల క్రితం ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన లారీ పాదచారులు, నిలిపి ఉన్న వాహనాలు, మూసి ఉన్న దుకాణాల పైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు గాయాలపాలయ్యారు. రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనాలు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఇక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి లారీ వేగంగా రావడంతోపాటు రహదారిపై ఆక్రమణలు కారణమని తెలుస్తోంది. ఇది జాతీయ రహదారి అయినా ఆక్రమణ కారణంగా కుంచించుకుపోయింది.
భువనగిరి పట్టణంలోని రహదారులు రెండు శాఖల పరిధిలో ఉండటంతో వీటి నిర్వహణ ఎవరికీ పట్టనట్టుగా ఉం ది. ట్రిపుల్‌ఆర్ నిర్మాణం కోసం ప్రభుత్వం తాత్కాలికంగా గుర్తించిన 161ఏఏ జాతీయ రహదారి మెదక్ జిల్లా తుఫ్రాన్ నుంచి భువనగిరిలోని జగదేవ్‌పూర్ చౌరస్తా వరకు సిద్ధిపేట డివిజన్‌లో, హైదరాబాద్ చౌరస్తా నుంచి నల్లగొండ చౌరస్తా వరకు, ఇక్కడి నుంచి వలిగొండ వైపు జనగామ డివిజన్ పరిధిలో ఉంది. అయితే జగదేవ్‌పూర్ చౌరస్తా నుం చి హైదరాబాద్ చౌరస్తా వరకు ఉన్న సుమారు కిలోమీటర్ పట్టణ ప్రధాన రహదారి రాష్ట్ర రహదారిగా ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉంది. అలాగే కలెక్టరేట్ వరకు, వినాయకచౌరస్తా నుం చి నల్లగొండ చౌరస్తా వరకు రహదారి ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్నాయి. పట్టణ ప్రధాన రహదారులు నేషనల్ హైవే అథారిటీ,ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్నాయి. ఈ రహదారులన్నీ భువనగిరి మునిసిపాలిటీ పరిధిలోనే ఉన్నాయి. దీంతో ఆ రహదారుల నిర్వహణ, మరమ్మతులు, నియంత్రణ, ప్రమాద ని వారణ చర్యలపై తరచూ ఆయా శాఖల మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రహదారుల నిర్వహణపై ఏ శాఖ కూడా ఏ ఒక్క సొంత నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంది.దీంతో ఆయా రహదారులు గుంతలమయం అవుతుండటం, రహదారులకు ఇరువైపులా ఆక్రమణలు పెరుగుతుండటం పరిపాటిగా మారాయి. అయితే ట్రిపుల్‌ఆర్ పనులు ప్రారంభమైన వెంటనే జాతీయ రహదారి 163ఏఏ పరిధిలోని రహదారులన్నీ ఆర్‌అండ్‌బీ పరిధిలోకి రానున్నాయి.
ప్రజల భద్రత గాలిలో దీపం...
పట్టణ ప్రధాన రహదారుల నిర్వహణ రెండు ప్రభుత్వ శాఖల మధ్య వివాదానికి కారణం అవుతుండగా, అవే రహదారులపై ప్రజల భద్రత నాలుగు వ్యవస్థల మధ్య గాలిలో దీపంలా మారింది. మునిసిపల్, ట్రాఫిక్ పోలీసుల వైఖరి, ఆక్రమణదారులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా భువనగిరి రహదారులు ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. సుమారు రూ.30కోట్ల వ్యయంతో పట్టణ ప్రధాన రహదారిని 100ఫీట్లకు విస్తరించారు. కానీ, ఆ రహదారి వెంట గతంలో మాదిరిగానే ఆక్రమణలు, ఫుట్‌పాత్‌పై వ్యాపారులు కొనసాగుతున్నాయి. దీంతో ఫుట్‌పాత్ ఆక్రమణలను, చౌరస్తాల వద్ద వీధి వ్యాపారాలను నియంత్రించడంపై ట్రాఫిక్ పోలీసులు, మునిసిపాలిటీ మధ్య సమన్వయం కొరవడింది. ఆక్రమణల రహదారులపై ఏర్పాటు చేసిన దుకాణాల బోర్డుల తొలగింపు, వాహనాల ఇష్టానుసారం పార్కింగ్‌పై నియంత్రణ బాధ్యత వారిదంటే వారిదంటూ రెండు శాఖల మధ్య అంతర్గత వివాదం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన రహదారుల వెంట పార్కింగ్ సదుపాయం లేకుండానే బహుళ అంతస్తుల భవనాలకు మునిసిపాలిటీ ఇస్తున్న అనుమతులతోనే ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలు ఏర్పడుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ట్రాఫిక్ పోలీసులు వాహనాల ఫొటోలను తీస్తూ జరిమానాలు మాత్రం వేస్తూ నియంత్రణను విస్మరిస్తుండటంతోనే రోడ్డు ప్రమాదాలకు కారణమమని మునిసిపల్ సిబ్బంది వాదిస్తున్నారు. సందట్లో సడే మియాలా ఆక్రమణదారులు మరింత రెచ్చిపోతూ ఫుట్‌పాత్, పార్కింగ్ లైన్‌దాటి రహదారిపైకి వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆక్రమణల తొలగింపునకు ట్రాఫిక్, మునిసిపల్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలను స్థానిక రాజకీయ నాయకులు కొందరు పలుకుబడి కోసం అడ్డుకుంటున్నారని ఆయా శాఖల అధికారులు బహిరంగంగా పేర్కొంటున్నారు. దీంతో రహదారులు, చౌరస్తాలు ఇరుకుగా మారి రక్తసిక్తమవుతున్నాయి.
తాజాగా లారీ బీభత్సం
జగదేవ్‌పూర్‌చౌరస్తాలో మూడు రోజుల క్రితం ఓ లారీ అదుపుతప్పి సృష్టించిన బీభత్సంతో ఇద్దరు మృతిచెందగా మరో ముగ్గురు గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆస్తినష్టం కూడా జరిగింది. ఇదే చౌరస్తాలో గతంలో కూడా పలు ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్, వినాయకచౌరస్తా, పట్టణ రహదారుల వెంట జరిగిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా, వారిపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. ఈ ప్రమాదాలన్నిటికీ ప్రధాన కారణం రోడ్డు వెంట ఆక్రమణలు, ఫుట్‌పాత్ వ్యాపారులు, ట్రాఫిక్ నియంత్రణ కొరవడటమేనని పోలీసులు పలు యాక్సిడెంట్ రిపోర్టులో పేర్కొన్నారు. పేరుకు జాతీయ రహదారి అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో 20ఫీట్ల వెడల్పు కూడా లేని బాహర్‌పేట రహదారిని 100ఫీట్ల రహదారిగా విస్తరించాలని మార్కింగ్ జరిగినా పలు కారణాలతో దీన్ని కుదించి పనులను చేపట్టాలని ప్రతిపాదించారు. అయితే ఆ పనులకు గ్రహణం పట్టింది. ఇరుకైన ఈ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో బాధితులు ప్రాణాలు కోల్పోయారు. పలు భవనాలు కూలిపోయాయి. అలాగే పట్టణంలోని ప్రధాన చౌరస్తాలు వినాయక, హైదరాబాద్, జగదేవ్‌పూర్, నల్లగొండ, పాత బస్టాండ్ చౌరస్తాలను విస్తరించి అభివృద్ధి చేసే ప్రతిపాదనలు చాలా రోజులుగా డీపీఆర్ దశలోనే ఉన్నాయి. అయితే 163ఏఏ జాతీయ రహదారి పరిధిలోని తుఫ్రాన్-జగదేవ్‌పూర్ చౌరస్తా వరకు మరమ్మతులు, అభివృద్ధి కోసం రూ.7కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు త్వరలో మోక్షం లభించనుంది.
నివారణ చర్యలు
జగదేవ్‌పూర్ చౌరస్తా వద్ద నాలుగు రోజుల క్రితం జరిగిన ఘోర ప్రమాదంపై ఎమ్మెల్యే కుంభం అనిలకుమార్‌రెడ్డి స్పందించి రహదారుల వెంట ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద స్థలిలోనే ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారులు, మునిసిపల్‌శాఖల అధికారులతో ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు వారి పరిధిలో చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ చౌరస్తా వద్ద తాత్కాలిక డివైడర్‌ను ఏర్పాటు చేశారు. రహదారిపై జిబ్రా లైన్ మార్కింగ్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ప్రమాదాలకు నెలవుగా ఉన్న ప్రిన్స్ చౌరస్తా వద్ద ఆక్రమణలు, ఫుట్‌పాత్ వ్యాపారులు, బోర్డుల తొలగింపునకు మునిసిపల్ ట్రాఫిక్ పోలీసులు సమన్వయంగా పనిచేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు కార్యాచరణను వెంటనే అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.