Share News

రక్తనిధి కోసం తిప్పలు

ABN , Publish Date - May 14 , 2025 | 12:39 AM

రక్తదానం ప్రాణదానంతో సమా నం అంటారు. చిన్న రక్తపు బొట్టు ప్రాణాన్ని నిలబెడుతుంది. ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఆస్పత్రిలో చేరగానే అవసరమయ్యేది రక్తమే.

రక్తనిధి కోసం తిప్పలు

బ్లడ్‌బ్యాంకు ఏర్పాటుకు స్థలం కావాలని రెడ్‌క్రాస్‌ విజ్ఞప్తి

భవన నిర్మాణానికి భువనగిరిలో 1500 నుంచి 2వేల గజాలు అవసరం

రూ.2కోట్లతో బ్లడ్‌బ్యాంకు నిర్మాణానికి, సౌకర్యాలకు దాతల సిద్ధం

రానున్న రోజుల్లో మెడికల్‌ హబ్‌గా..

బ్లడ్‌బ్యాంక్‌, తలసేమియా వార్డుతో ఉమ్మడి వరంగల్‌, నల్లగొండతోపాటు కరీనంగర్‌, మేడ్చల్‌ జిల్లావాసులకు ప్రయోజనం

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): రక్తదానం ప్రాణదానంతో సమానం అంటారు. చిన్న రక్తపు బొట్టు ప్రాణాన్ని నిలబెడుతుంది. ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఆస్పత్రిలో చేరగానే అవసరమయ్యేది రక్తమే. దీంతో రోగి కుటుంబ సభ్యులు వెంటనే రక్తం కోసం ఉరుకులు పరుగులు తీయడం తరు చూ చూస్తుంటాం. కొంత కాలంగా జిల్లాలో బ్లడ్‌బ్యాంక్‌ లేకపోవడంతో ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. అయితే జిల్లాలో బ్లడ్‌ బ్యాంక్‌ నిర్మాణానికి దాతలు సిద్ధంగా ఉన్నారని, కేవలం స్థలం కేటాయిస్తే సరిపోతుందని రెడ్‌క్రాస్‌ సంస్థ విజ్ఞప్తి చేస్తోంది. దీంతో జిల్లాయంత్రాంగం స్థలం కేటాయింపుపై కసరత్తు మొదలు పెట్టింది.

అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు, ఆపద సమయంలో రక్తం అవసరమవుతోంది. అయితే ఈ రక్తం మనిషి నుంచి తీసిన వెంటనే జబ్బుచేసిన, గాయపడి న రోగికి ఎక్కించే వీలుండదు. ప్రభుత్వ గుర్తింపు పొందిన రక్త నిధి(బ్లడ్‌బ్యాంకు)లోని ప్రయోగశాలలో పరీక్షించిన రక్తాన్ని మాత్రమే రోగులకు వినియోగించాలి. ఈ నేపథ్యంలో రక్తం ఆపదలో ఉన్న వ్యక్తులను కాపాడేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. హైదరాబాద్‌ నగరానికి అతి చేరువలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో బ్లడ్‌బ్యాంకు లేకపోవడంతో జిల్లాతోపా టు చుట్టుపక్కల జిల్లాల వారు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందు లు పడుతున్నారు. జిల్లా నుంచి జాతీయ రహదారులైన ఎన్‌హెచ్‌ 163 హైదరాబాద్‌-వరంగల్‌, ఎన్‌హెచ్‌ 65 హైదరాబాద్‌-విజయవాడ ఉన్నాయి. వీటితోపాటు ఉమ్మడి మెదక్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల కు వెళ్లేందుకు లింకు రోడ్లు కూడా ఉన్నాయి. ఈ రహదారులపై నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. ఈ రోడ్లనుంచి ప్రయాణించే వాహనదారులు తరుచుగా ప్రమాదాలకు గురవుతుంటారు. జిల్లాకేంద్రంతోపాటు ఎయిమ్స్‌, ఇతర ఆస్పత్రుల్లో ఆరకొరగా వైద్య వసతులు ఉండటంతో పాటు రక్తం అందుబాటులో లేకపోవడంతో గాయపడిన వారందర్నీ కూడా హైదరాబాద్‌కు తరలిస్తారు. అయితే రానున్న రోజుల్లో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రి స్థాయి పెంచి..., సౌకర్యాలు కల్పిచంలేదు. అదేవిధంగా ఎయిమ్స్‌ కూడా అన్ని రకా ల వైద్యానికి సిద్ధమవుతోంది. మరోవైపు యాదగిరిగుట్టలో ప్రభుత్వ మెడికల్‌, ఆస్పత్రి నిర్మాణం కానుంది. ఎయిమ్స్‌లో 750 పడకల ఆస్పత్రి,యాదగిరిగుట్ట ఆస్ప త్రిలో 100పడకలతోపాటు ఏరియా ఆస్పత్రులో 200 పడకలు, పీహెచ్‌సీల్లో అత్యవసర సేవలన్నీ కూడా అందుబాటులో రానున్నాయి. ఈ ప్రాంతం రానున్న రోజుల్లో మెడికల్‌ హబ్‌గా మారనుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో బ్లడ్‌బ్యాంకు అత్యవసరంగా మారింది. జిల్లాకేంద్రంలో బ్లడ్‌ బ్యాంకు నిర్మించాలని స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్తున్నారు. బ్లడ్‌ బ్యాంకుకు స్థలం ఇస్తే రెడ్‌క్రాస్‌ సంస్థ దాతల సహకారంతో నిర్మించే అవకాశం ఉంది.

దాతల సహకారంతో వసతులు

భువనగిరి పట్టణంలో బ్లడ్‌ బ్యాంకు నిర్మిస్తే దాతల సహకారంతో అన్ని వసతులు కల్పించేందుకు రెడ్‌క్రాస్‌ సంస్థ సిద్ధంగా ఉంది. బ్లడ్‌బ్యాంకు ఏర్పాటు చేస్తే రక్తాన్ని పరీక్షించేందుకు ల్యాబ్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సిబ్బంది, పరికరాలు, మిషన్లు, నాలుగు వాహనాలు, సాంకేతికపరమైన వసతులన్నీ కూడా రెడ్‌క్రాస్‌ దాతల సహకారంతో సమకూర్చనుంది. బ్లడ్‌బ్యాంక్‌ నిర్మాణంతోపాటు పరికరాలు, ఇతర వాటి కోసం దాదాపు రూ.4కోట్ల వరకు ఖర్చవుతాయి. భవనం నిర్మాణం కోసం దాతలు సిద్ధంగా ఉండగా, ఈ మేరకు దాతలు, ప్రభుత్వ సహాయంతో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు రెడ్‌క్రాస్‌ సంస్థ సిద్ధమవుతోంది. అయితే జిల్లా యంత్రాంగం స్థలం కేటాయించడమే తరువాయి. మరోవైపు జిల్లాకేంద్రంలో అనువైన స్థలాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

స్థలం కేటాయించండి..రూ.2కోట్లతో బ్లడ్‌ బ్యాంకు నిర్మిస్తాం..

యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో సామాజిక అవసరాల్లో భాగంగా బ్లడ్‌బ్యాంకుకోసం స్థలాన్ని కేటాయించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు రెడ్‌క్రాస్‌ సంస్థ ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. భువనగిరి పట్టణంలో 1500 నుంచి 2వేల గజాల స్థలాన్ని రెడ్‌క్రా్‌సకు ఇవ్వాలని కోరుతున్నారు. రెడ్‌క్రా్‌ససంస్థ జిల్లాలో 2016 నుంచి పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా దాత ల సహకారంతో రూ.2కోట్లతో బ్లడ్‌బ్యాంకుతోపాటు తలసేమియా రోగులకు సంబంధించిన వార్డును నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లాయంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. భువనగిరిలో బ్లడ్‌ బ్యాంకుతోపాటు తలసేమియా వార్డును నిర్మించిన పక్షంలో ఉమ్మడి వరంగల్‌, నల్లగొండ, మేడ్చల్‌, మెదక్‌ జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. రక్తంకోసం హైదరాబాద్‌ వెళ్లకుండా ఇక్కడే స్థానికంగా ఉన్న ఆస్పత్రిల్లో చికిత్సలు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. తద్వారా రోగులకు ఆర్థికంగా ఇబ్బందుల్లేకుండా ఉంటుంది. అయితే భువనగిరి పట్టణంలోని జూనియర్‌ కళాశాల, పాఠశాల ఆవరణలో స్థలాన్ని గుర్తించినట్లు తెలిసింది. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నా యా? అనే అంశంపై జిల్లాయంత్రాంగం ఆరా తీస్తోంది. బ్లడ్‌బ్యాంకు నిర్మించేందుకు దాత లు ముందుకు రావడంతో స్థలాన్ని త్వరగా కేటాయించాలని రెడ్‌క్రాస్‌ సంస్థ సభ్యులు కలెక్టర్‌ ఎం.హనుమంతరావుకు ఇటీవల విజ్ఞప్తి చేశారు. అయితే ఏ ప్రాంతంలో అయితే బాగుంటుందో సాధ్యాసాఽధ్యాలను పరిశీలించాలని అధికారులకు కలెక్టర్‌ సూచించినట్లు సమాచారం.

దాతల సహకారంతో నిర్మాణం:దిడ్డి బాలాజీ, జిల్లా రెడ్‌క్రాస్‌ సంస్థ వైస్‌చైర్మన్‌

జిల్లా కేంద్రంలో రెడ్‌క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో బ్లడ్‌ బ్యాంకు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. భువనగిరి పట్టణంలో 1500-2000 గజాల స్థలాన్ని కేటాయిస్తే రెడ్‌క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో రూ.2కోట్లతో భవనాన్ని నిర్మించనున్నాం. భవనం నిర్మాణం కోసం దాతలను కూడా ముందుకు వస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని ఉన్నతాధికారులకు స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశాం.

Updated Date - May 14 , 2025 | 12:39 AM