Share News

నైరుతి రాగం

ABN , Publish Date - Jun 10 , 2025 | 12:39 AM

గతంలో ఎన్నడూ లేని విధంగా మే మూడో, నాలుగో వారంలో వాతావరణ చల్లబడటం, అక్కడక్కడ వర్షాలు కురియడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. వాతావరణశాఖ సైతం ఈ ఏడాది నైరుతి రుతుపవనా లు ముందుగానే రాష్ట్రంతో పాటు జిల్లాకు చేరుతాయని ప్రకటించింది.

నైరుతి రాగం

మృగశిర కార్తెలోనూ జాడలేని వానలు

మే నెలాఖరులో ఆడపాదడపా కురిసిన వర్షంతోనే సరి

(ఆంధ్రజ్యోతి,నల్లగొండ) : గతంలో ఎన్నడూ లేని విధంగా మే మూడో, నాలుగో వారంలో వాతావరణ చల్లబడటం, అక్కడక్కడ వర్షాలు కురియడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. వాతావరణశాఖ సైతం ఈ ఏడాది నైరుతి రుతుపవనా లు ముందుగానే రాష్ట్రంతో పాటు జిల్లాకు చేరుతాయని ప్రకటించింది. ఆ తరువాత నైరుతి రుతుపవనాలు మొహం చాటేశాయి. భిన్నమైన వాతావరణం ఏర్పడటంతో వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఉమ్మడి జిల్లాలో మే నెలలో కురిసిన వర్షాలతో రైతులు వేసవి దుక్కులు దున్నారు. ఒక్క నల్లగొండ జిల్లాలో సుమారు 6,500 ఎకరాల్లో రైతులు పత్తి విత్తనాలు విత్తారు. ప్రస్తుతం అవి మాడిపోయే దశలో ఉన్నాయి. వాస్తవానికి నైరుతి రుతుపవనాలు జూన్‌ మొదటి వారం నుంచి ప్రారంభం కావాల్సి ఉం ది.మృగశిర కార్తె వచ్చి రెండు రోజులైనా చినుకు జాడ లేదు. నల్లగొండ జిల్లా లో మర్రిగూడ మండలంలో తప్ప మిగతా ఏ ప్రాంతంలో కూడా సరిగా వర్షా లు పడలేదు. ఈ ఏడాదిలో రుతుపవనాలు ముందుగానే రావడం వల్ల మం చి వర్షాలు నమోదవుతాయని, ఇవి వ్యవసాయానికి చాల ఉపయోగపడతాయని వ్యవసాయశాఖ సైతం అంచనా వేసింది. మే నెలాఖరులో 38డిగ్రీల వరకే కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావడంతో పాటు మబ్బులు రైతులను ఊరించాయి. వాతావరణశాఖ అంచనాలు తారుమారయ్యాయి.

నైరుతి రుతుపవనాల మందగమనం

నైరుతి రుతుపవనాల గమనం మందగించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు ముఖం చాటేశాయి. ఈ ఏడాది రుతుపవనాలు నిర్దిష్ట సమయం కంటే ముందే రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఉమ్మడి జిల్లాలో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. గత వారానికి పైగా నైరుతి రుతుపవనాల్లో ఎలాంటి కదలికలు లేవు. ఈనెల 15 తరువాత రుతుపవనాల్లో కొంత మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది. జూలై మొదటి వారం నుంచి వర్షాలు స్థిరంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తోంది. ప్రస్తుతం జూన్‌ మాసం రెండో వారం వచ్చినా పగటి ఉష్ణోగ్రత 37.5డిగ్రీలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వర్షాలు లేకపోవడంతో భూమిలో తేమశాతం లేక వాతావరణం చల్లబడటం లేదు. నల్లగొండ జిల్లాలో దేవరకొండ డివిజన్‌లోని మర్రిగూడ మండలంలో ఇప్పటి వరకు 126.5మి.మీల వర్షం కురిసింది. చింతపల్లి మండలంలో 73.2మి.మీలుగా నమోదైంది. మిగతా అన్ని మండలాలో లోటు వర్షపాతం ఉంది. జిల్లాలో ఈనెల 9వ తేదీ నాటికి 58.5మి.మీల వర్షపాతం లోటు ఉంది. కేవలం 27మి.మీలు మాత్రమే వర్షపాతం నమోదైంది. నల్లగొండ డివిజన్‌లో 73.1మి.మీ లోటు, మిర్యాలగూడ డివిజన్‌లో 36.6లోటు, దేవరకొండ డివిజన్‌లో 409మి.మీ లోటు, చండూరు డివిజన్‌లో 20.2మి.మీల లోటు వర్షపాతం నమోదైంది. ఒకటి, రెండు మండలాల మినహా ఎక్కడా వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

మారిన వాతావరణంతో సతమతం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో సైతం ఎండాకాలం మాదిరిగానే పరిస్థితులు ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగి వాతావరణంలో తేమశాతం తగ్గి ఉక్కపోత పెరిగింది. సమృద్ధిగా వర్షాలు కురిస్తే తప్ప వాతావరణంలో మార్పులు కనిపించే అవకాశాలు లేవు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. ప్రధానంగా నల్లగొండ జిల్లాలోని 17 మండలాల్లో వర్షాల ప్రభావమే లేకపోగా, 14 మండలాల్లో వానలు అంతంతమాత్రమే కురిశాయి. వర్షాల కోసం రైతులు నిత్యం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. అప్పుడప్పుడు మబ్బులు కనిపించడం తప్ప చినుకు జాడ లేదు. ఏదో ఒక చోట కొద్దిసేపు వర్షం కురవడం మినహా వ్యవసాయానికి అనుకూలంగా వర్షాలు లేవు. మే నెలలో కురిసిన వర్షాలకు విత్తనాలు వేసిన రైతులు అవి మొలకెత్తకపోవడంతో ఆర్థికంగా నష్టపోయారు. మే నెలలో కురిసిన ఆడపాదడపా వర్షాలకు దుక్కులు దున్ని సిద్ధంగా ఉన్న రైతులను నైరుతి రుతుపవనాలు ఊరించి ఉసురుమనిపించాయి. బోరుబావుల కింద రైతులు సుమారు 50వేల ఎకరాలకు సరిపడా నార్లు ఇప్పటి వరకు పోసుకున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసినప్పుడే బోరుబావుల్లోకి జలాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా చోట్ల బోర్లు వేసి నీళ్లు పడకపోవడంతో రైతులు నష్టపోయారు.

సమృద్ధిగా వర్షాలు కురిశాక విత్తనాలు వేయాలి : పి. శ్రవణ్‌కుమార్‌, నల్లగొండ జేడీఏ

జిల్లాలో అంతగా వర్షాలు లేవు. మే నెలలో కురిసిన వర్షాలతో 6,500 ఎకరాల్లో రైతులు విత్తనాలు వేశారు. సమృద్ధిగా వర్షాలు కురిశాకే రైతులు విత్తనాలు విత్తాలి. కొద్దిపాటి వర్షానికి విత్తనాలు వేయడం వల్ల నష్టపోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. దీని దృష్ట్యా వానలు కురిసిన తరువాతే విత్తనాలు విత్తితే ప్రయోజనం ఉంటుంది.

Updated Date - Jun 10 , 2025 | 12:39 AM