పరిష్కరించినవి 1269.. వచ్చిన దరఖాస్తులు 15046
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:05 AM
ప్రభుత్వం భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆర్వోఆర్ చట్టం స్థానంలో భూభారతిని తీసుకొచ్చింది. అనంతరం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి, భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంది.
తిరస్కరణకు గురైన వాటికి నోటీసులు జారీ
నెలరోజులుగా పరిశీలించిన రెవెన్యూ యంత్రాంగం
భూభారతి పోర్టల్‌లో డాటా కరెక్షన్లే అధికం
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): ప్రభుత్వం భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆర్వోఆర్ చట్టం స్థానంలో భూభారతిని తీసుకొచ్చింది. అనంతరం జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి, భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంది. ఈ నెల 15వ తేదీలోగా సాధ్యమైనంత మేర సమస్యలను పరిష్కరించాల ని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 15,046 దరఖాస్తులు రాగా, అందు లో 1,782 పరిష్కారయోగ్యమైనవిగా అధికారులు గుర్తించా రు. వాటి లో ఇప్పటి వరకు 1,269 దరఖాస్తులను పరిష్కరించారు.
ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను భూభారతి ద్వారా ఈ నెల 15లోగా పరిష్కరించి నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేసేందు కు ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ సదస్సులు నిర్వహించిన అనంతరం రెవెన్యూ అధికారులు నెలరోజుల పాటు ఆయా గ్రామాల వారీగా వచ్చిన దర ఖాస్తుల పరిశీలన చేశారు. భూభారతి చట్టం పరిధిలో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్ స్థాయిల్లో పరిష్కరించే భూ సమస్యలను అధికారులు గుర్తించారు. వీటిలో ప్రధానంగా పట్టాదా రు భూములు అసైన్డ్, లావాణి, ప్రభుత్వ భూములుగా నమోదుకావడం, సరిహద్దు వివాదాలు, పేరు మార్పిడి వంటి వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారు. మిస్సింగ్ నెంబర్లు, పెండింగ్ మ్యుటేషన్, సర్వేనెంబర్లు, పేర్ల లో తప్పుల సవరణలతో పాటు చిన్నచిన్న సమస్యలను పరిష్కరిస్తున్నారు. అయితే పరిష్కారం లభించని భూ సమస్యలపై సదరు దరఖాస్తుదారులకు ఎండార్స్‌మెంట్ (సమాధాన నోటీసు) ఇవ్వనున్నా రు. శుక్రవారం నుంచి జిల్లాలోని 17 మండలాల్లోని 301 రెవెన్యూ గ్రామాల్లోని దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేయనున్నారు. భూభారతి చట్టం ప్రకారం సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నామో కారణాలను తెలియజేయనున్నారు. రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 15,046దరఖాస్తులు రాగా, వీటిలో ఇప్పటివరకు 1,269 దరఖాస్తులను పరిష్కరించారు.జిల్లా వ్యాప్తం గా 1,782 దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారులు అంగీకరించారు. మిగతా వాటికి సరైన కారణాలు చూపుతూ నోటీసులు జారీ చేయనున్నారు. ఒకటి రైతుకు, మరొకటి పంచాయతీ కార్యాలయం, ఇంకోటి తహసీల్దార్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో వీటిని అంటించనున్నారు.
డాటా కరెక్షన్లే అధికం
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో అధిక శాతం డాటా కరెక్షన్‌వే అధికంగా ఉన్నాయి. జిల్లాలో సర్వేనెంబర్లలో మార్పులు, చేర్పులు, పీపీబీ, ఆర్వోఆర్, నాలా, ఆర్‌ఎ్‌సఆర్ సవరణ, అప్పీల్స్, కోర్టు కేసులు, పోడుభూములు, తదితర 30రకాల భూసమస్యలపై దరఖాస్తులు వచ్చాయి. చాలా మండలాల్లో భూమి ఒకచోట, కబ్జా మరోచోట ఉంది. ఈ సమస్యను పరిష్కరించాలంటే రెవెన్యూ యంత్రాంగం తొలుత అనుభవదారు విభాగాన్ని పునరుద్ధరించాలి. అయితే భూభారతి చట్టంలో ఇప్పటివరకు అనుభవదారు విభాగం లేదు. దీంతో పాటు సర్వే నెంబర్లు, భూముల విస్తీర్ణం, పట్టాదారుల పేరు మార్పు, చేర్పులు చేపట్టాల్సి ఉంది. అయితే జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రస్తుతం వీటి జోలికి వెళ్లడం లేదు. జిల్లాలో సాదాబైనామా దరఖాస్తులు 3,458 వచ్చాయి. వీటి పరిష్కారంపై ప్రభుత్వం భూభారతిలో అవకాశం కల్పిస్తే తప్ప జిల్లా యంత్రాంగం ఎలాంటి నిర్ణ యం తీసుకునే అవకాశం లేదు. ఈ సమస్యలు ఎప్పటిలోగా పరిష్కారం అవుతాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు.
దరఖాస్తులు ఇలా..
ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతిని తీసుకురాగా, అందులో మొత్తం 14 మాడ్యుల్స్ ఉన్నాయి. అందులో డాటా కరెక్షన్ కింద 1,148 దరఖాస్తులు వచ్చాయి. ఎన్‌ఆర్ పీపీపీ ఏడు, కోర్టు కేసులు 123, పీపీబీ కోర్టు కేసులు 79, జీపీఏ 30, ప్రొహిబిటెడ్ 855, నాలా హౌస్ సైట్స్ మూడు, ఖాతా మెర్జింగ్ రెండు, గ్రీవెన్స్ ల్యాండ్ 24, నాలా, పీపీబీ 93, పెండింగ్ మ్యుటేషన్లు 284, సక్సెషన్ 384, అర్బన్ ల్యాండ్ 14 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ దరఖాస్తులను పరిష్కరించడంతో పాటు నోటీసులు జారీచేస్తున్నారు. తొలుత భూభారతో వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ అధికారుల పరిశీలనకు పంపగా, అన్నీ సరిగా ఉన్న పక్షంలో వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. భూభారతితో పాటు రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.