సొసైటీ యూరియా పక్కదారి
ABN , Publish Date - Jul 25 , 2025 | 01:05 AM
వరినాట్ల సీజన్ మొదలవడంతో యూరియా బ్లాక్‌మార్కెట్ దందా జిల్లాలో ప్రారంభమైంది.
డీలర్ ద్వారా విక్రయం!
తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇన్‌వాయిస్ మార్పిడి
ఇన్‌వాయి్‌స ఎర్రర్‌గా పేర్కొని స్టాక్‌కు అనుకూలంగా నమోదు
అక్రమమని తేలినా నామమాత్రపు చర్యలతో సరిపుచ్చిన అధికారులు
స్టాప్‌సేల్ రాసి చేతులు దులుపుకున్న వైనంపై విమర్శలు
నల్లగొండ, జూలై 24 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): వరినాట్ల సీజన్ మొదలవడంతో యూరియా బ్లాక్‌మార్కెట్ దందా జిల్లాలో ప్రారంభమైంది. సహకార సంఘాలకు కేటాయించే యూరియాను దొడ్డిదారిలో డీలర్ల ద్వారా విక్రయించి సొమ్ముచేసుకుంటున్న దందా కొనసాగుతోంది. అక్రమ తరలింపు, బ్లాక్‌మార్కెట్‌పై ఫిర్యాదులు వస్తే తనిఖీల్లో బయటపడకుండా ఆథరైజ్డ్ ఏజెన్సీల నుంచి నకిలీ బిల్లులు ఇస్తూ బ్లాక్‌మార్కెట్‌కు బాహాటంగా సహకరిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. నకిరేకల్ మండలంలోని ఓ సహకార సంఘానికి చెందిన యూరియాను సమీపంలోని శాలిగౌరారం మండలం పెర్కకొండారంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణంలో అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ నకిలీ బిల్లులు, యూరియా బ్లాక్ మార్కెట్ వ్యవహారం బట్టబయలైంది. వ్యవసాయాధికారుల తనిఖీల్లో స్పష్టంగా తప్పులు కనిపించినా కేవలం స్టాప్ సేల్ రాసి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది.
పక్కదారి పట్టించిన తీరిదీ
శాలిగౌరారం మండలం పెర్కకొండారంలోని ఓ ఫర్టిలైజర్ దు కాణంలో నకిరేకల్ మండలంలోని ఓ సహకార సంఘానికి కేటాయించిన యూరియాను విక్రయిస్తున్నారు. ఈ సమాచారం అం దగానే నకిరేకల్ ఏడీఏ, రెండు మండలాల వ్యవసాయాధికారు లు, సంబంధిత వ్యవసాయ విస్తరణ అఽధికారి మంగళవారం స దరు దుకాణాన్ని తనిఖీ చేశారు. తనిఖీల సమయంలో దుకాణం లో ఎలాంటి రికార్డుల్లో లేని 80 బస్తాలకుపైగా యూరియాను అధికారులు గుర్తించారు. ఈ రకం యూరియా నకిరేకల్ మండలంలోని సొసైటీకి కేటాయించినట్టు సదరు ఏవో గుర్తించారు. ఈ యూరియా ఎక్కడిదని, వివరాలివ్వాలని కోరగా, సదరు దుకాణ నిర్వాహకుడు తాను రైతునని, 30 ఎకరాల వ్యవసాయం ఉం దని, తన సొంత వ్యవసాయానికి ఈ యూరియా తెచ్చుకున్నానని బుకాయించాడు. రైతుకు సంబంధించిన యూరియా రైతు ఇంట్లో ఉండాలే తప్ప, ఫర్టిలైజర్ దుకాణంలో ఉండడడం చట్టవిరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో దుకాణంలోని స్టాకు వివరాలేవీ పీవోఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) మిషన్‌లో కూడా నమోదు కాలేదని, అంతేకాకుండా స్టాక్ రిజిస్టర్లు, సేల్ బుక్స్ ఏవీ సక్రమంగా లేని విషయాన్ని అధికారులు గుర్తించారు. తనిఖీల్లో పట్టుబడ్డ 80 బస్తాల యూరియాను ఆథరైజ్డ్ డీలర్ నుంచే కొనుగోలు చేసినట్లు చూపించే క్రమంలో సదరు డీలర్ మిర్యాలగూడకు చెందిన ఓ ప్రముఖ ఏజెన్సీకి చెందిన మరో బిల్లును అప్పటికప్పుడు సృష్టించి అధికారులకు చూపించడం ద్వారా మరో తప్పు చేశాడు. ఒకే తేదీన, ఒకే సమయాన, ఒకే నెంబర్ ఉన్న లారీ ద్వారా, ఒకే బిల్లు ద్వారా వచ్చిన యూరియాను, ఒక బిల్లులో ఒక రకం యూరియాగా పేర్కొనగా, ఇంకో బిల్లులో మూడు రకాల కంపెనీలకు చెందిన యూరియాగా పేర్కొన్నారు. ఒక బిల్లులో ఈ నెల 21వ తేదీన మిర్యాలగూడకు చెందిన ప్రముఖ ఆథరైజ్డ్ ఏజెన్సీ నుంచి సాయంత్రం 7.24గంటలకు ఇన్‌వాయి్‌స నెంబర్ 830 ద్వారా, లారీ నెంబర్ ఏపీ 24 డబ్ల్యూ 3249 ద్వారా పెర్కకొండారంలోని సదరు దుకాణానికి ఎన్‌ఎ్‌ఫఎల్ జీఆర్ నీమ్ యూరియా 183బస్తాలు, క్రిబ్‌కో జీఆర్ నీమ్ యూరియా 150 బస్తాలు, క్రిబ్‌కో పీఆర్ నీమ్ యూరియా 111 బస్తాలు కలిపి మొత్తం 444 బస్తాల యూరియా పంపినట్లు ఉంది. అదే ఇన్‌వాయి్‌స నెంబర్, అదే సమయం, అదే రోజు, అదే లారీ నెంబర్‌తో తనిఖీల సమయంలో వాట్స్‌పలో తెప్పించి చూపించిన ఇన్‌వాయి్‌సలో సీఐఎల్ జీఆర్ నీమ్ యూరియా 444 బస్తాలు వచ్చినట్లు రాశారు. ఒక తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో డీలర్, ఆథరైజ్డ్ ఏజెన్సీ కలిసి మరో తప్పు చేసిన విషయం తేలింది. అంతేగాక సదరు డీలర్ దుకాణంలో ఎరువుల విక్రయాలు, కొనుగోలు రికార్డులేవీ సక్రమంగా లేని విషయం సైతం తనిఖీల్లో అధికారులు గుర్తించారు. తనిఖీల్లో పట్టుబడ్డ అదనపు యూరియాను వేరే సొసైటీకి చెందినదిగా ఆధారాలు లభించలేదని అధికారులు తెలిపారు. ఇన్‌వాయి్‌స ఎర్రర్ రావడంతో సదరు ఆథరైజ్డ్ ఏజెన్సీ నుంచి ఒరిజినల్ ఇన్‌వాయి్‌స తెప్పించి పరిశీలించామని, ఎర్రర్ సరిచేసి పంపిన ఇన్‌వాయి్‌సను పరిశీలించిన తర్వాత చిన్న పొరపాట్లు ఉన్నట్లు గుర్తించి స్టాప్ సేల్ రాశామని అధికారులు చెబుతున్నారు. సొసైటీకి సంబంధించిన ఎరువులు విక్రయించినట్టు ఆఽధారాలు లభించలేదని పేర్కొంటున్నారు.
విక్రయాల్లో తప్పులు తేలితే చర్యలు
పెర్కకొండారం ఫర్టిలైజర్ దుకాణంలో ఏడీఏ, ఇద్దరు ఏవోలు, ఇతర సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో గుర్తించిన తప్పులపై నోటీసులు జారీ చేశాం. పీవోఎ్‌సలో లేకుండా 28 బస్తాలు అదనంగా ఉన్నట్టు తేలింది. సింగిల్ విండోకు సంబంధించిన ఎరువులు ఇక్కడ విక్రయించినట్టు తేలలేదు. రెండు రకాల ఇన్‌వాయి్‌సపై విచారణ నిర్వహించాం. ఇన్‌వాయి్‌స రైజ్ చేసినప్పుడు ఎర్రర్ రావడం వల్లే ఒరిజినల్ ఇనవాయిస్ మళ్లీ రాసినట్లు పేర్కొన్నారు. ఎరువుల మూమెంట్‌పై జాతీయస్థాయిలో ఐఎ్‌ఫఎంఎస్ పోర్టల్ ద్వారా పర్యవేక్షణ ఉంటుంది. రవాణాలో పొరపాట్లకు వీలుండదు. జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా ఎరువులను బ్లాక్ చేయడానికి ప్రయత్నించినా, లేక సొసైటీలకు కేటాయించిన ఎరువులను బ్లాక్‌లో విక్రయించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటాం. లైసెన్స్‌లు రద్దు చేస్తాం. క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తాం.
పి.శ్రవణ్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి