నత్తనడకన ఎత్తిపోతల పనులు
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:04 AM
కృష్ణానది పక్కనే పారుతున్నా సాగు నీరు లేక రైతులు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు గత ప్రభుత్వం రెండు ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టింది.
రూ.90 కోట్ల ఏకేబీఆర్ లిఫ్ట్ ఇరిగేషనకు శ్రీకారం
సీఈసీడీవో అనుమతుల్లో ఆలస్యం
నిలిచిన రెండు సంప్‌ల పనులు
మొదలుకాని భూసేకరణ సర్వే
కృష్ణానది పక్కనే పారుతున్నా సాగు నీరు లేక రైతులు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు గత ప్రభుత్వం రెండు ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలోని ఎస్సీ కాలనీ సమీపంలో నిర్మిస్తున్న అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(ఏకేబీఆర్) ఎత్తిపోతల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది మే నెలలో పూర్తి కావాల్సిన పనులు 50 శాతం కూడా పూర్తికాలేదు. ప్రధానంగా గ్రావిటీ ద్వారా చేపట్టాల్సిన పైప్‌లైన పనుల సర్వే చేపట్టనే లేదు.
(ఆంధ్రజ్యోతి-పెద్దఅడిశర్లపల్లి)
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎమ్మార్పీ)లో భాగమైన అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎగువభాగంలోని ఎస్సీ కాలనీ సమీపంలో ఏకేబీఆర్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. రూ.90 కోట్లతో 6.691 ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా అధికారులు ప్రణాళిక సిద్ధంచేశారు. రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా ఐదు కిలోమీటర్ల దూరంలోని చిలకమర్రి సమీపంలో ఏర్పాటుచేయనున్న మెయిన డెలివరీ సిస్టర్న్(సంపు)లోకి తరలిస్తారు. అక్కడి నుంచి నాలుగు విభాగాలుగా 56 కిలోమీటర్ల వరకు పీవీసీ పైపుల ద్వారా నీటిని చెరువులు, కుంటల్లోకి తరలించేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకు సంబంధించిన పంప్‌హౌస్ పనులు 50శాతం పూర్తి కావొచ్చాయి. పైప్‌లైన పనులు సైతం నాలుగు కిలోమీటర్ల మేర పూర్తయ్యింది. మిగిలిన కిలోమీటర్‌కు సంబంధించి రైతలకు నష్టపరిహరం అందకపోవడంతో పనులు నిలిపివేశారు. రైతులకు పరిహరం అందిన వెంటనే సంపు నిర్మాణం, పైప్‌లైన పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
అనుమతుల్లో ఆలస్యం
చిలకమర్రి సమీపంలో ఏర్పాటు చేసే సంప్ నుంచి నాలుగు విభాగాలుగా నీటిని తరలించేందుకు ప్రణాళికలు రూపొందించారు. గ్రావిటీ ద్వారా 56 కిలోమీటర్ల చేపట్టే ఈ పనులకు చీఫ్ ఇంజనీర్ ఫర్ సెంట్రల్ డిజైన ఆర్గనైజేషన(సీఈసీడీవో) నుంచి అనుమతులు రాలేదు. దీంతో భూసర్వే పనులు సైతం ప్రారంభించలేదు. అనుమతులు వచ్చాకే పనులు మొదలుపెడతామని అధికారులు తెలిపారు. ఈ పైప్‌లేన్ల ద్వారా బాలాజీనగర్, పీఏపల్లి, సూరేపల్లి, రోళ్లకళ్లు, చిలకమర్రి, గుర్రంపోడు మండలంలోని 2,100 ఎకరాలకు సాగు నీరు అందనుంది. ఇదిలా ఉండగా రైతులకు నష్టపరిహారం అందించే విషయంలోనూ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. చిలకమర్రి స్టేజీ సమీపంలో మెయిన డెలివరీ సిస్టర్స్(సంపు)కు సంబంధించి భూనిర్వాసితురాలు శోభ మార్కెట్ రేటు ప్రకారం పరిహారం చెల్లించాలని కోర్టుకు వెళ్లింది. అయితే మహిళా పిటిషన కోర్టు తిరస్కరించడంతో రెవెన్యూ అధికారులు ఆ మహిళా రైతు నష్టపరిహారానికి సంబంధించిన చెక్కును రెవెన్యూ యాక్ట్ ద్వారా సంబంధించిన రైతు ఖాతాలో జమచేశారు. అయితే ఇంకా ఆ భూమిని ఇరిగేషన అధికారులకు అప్పచెప్పాల్సి ఉంది. ఆ తర్వాతే సంప్ పనులు ప్రారంభమవుతాయని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. అయితే భూమి అప్పగింత రెండు నెలలుగా ఆలస్యం కావడంతో పనులు నిలిచాయి.
సీడీసీపీవో నుంచి అనుమతులు రాలేదు
ఏకేబీఆర్ ఎత్తిపోతలలో భాగంగా చేపట్టిన పంప్‌హౌస్ నిర్మాణం దాదాపు పూర్తయింది. పైప్‌లైన పనులు కూడా నాలుగు కిలోమీటర్ల వరకు పూర్తయ్యాయి. సర్జిఫుల్ పంప్, మెయిన డెలివరీ సిస్టర్(సంప్) డిజైన్లకు సంబంధించి అనుమతులు రాలేదు. సీఈసీడీవో అక్కడి అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. రైతులకు పరిహారం కూడా త్వరలోనే అందిస్తాం. రెండు సంప్‌ల పనులు పూర్తయ్యాక గ్రావిటీ పనులకు సంబంధించి సర్వే పనులు ప్రారంభిస్తాం.
నాగయ్య, ఇరిగేషన డీఈ