మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - May 18 , 2025 | 12:05 AM
గోదాం వద్ద లారీలు ఏ రోజుకారోజు అన లోడ్ కావవడం లేదు. దీంతో కేంద్రాలకు లారీలు రాక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మందగించింది.
లారీ అనలోడ్ కావాలంలే మూడు రోజులు ఆగాల్సిందే
గోదాం వద్ద హమాలీల కొరత
తుర్కపల్లి, ఏఫ్రిల్ 17(ఆంధ్రజ్యోతి): ఽగోదాం వద్ద లారీలు ఏ రోజుకారోజు అన లోడ్ కావవడం లేదు. దీంతో కేంద్రాలకు లారీలు రాక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మందగించింది. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన బస్తాలు ఎగుమతి కాకపోవడంతో కొనుగోలు ప్రక్రియ నిలిచిపోతోందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. తూకం వేసిన ధాన్యం ఎగుమతి కాకపోవడం వల్ల తరుగు వచ్చే అవకాశం ఉందని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పేర్కొంటున్నారు. తుర్కపల్లి మండలంతో పాటు భువనగిరి, బొమ్మలరామారం మండలాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మండలంలోని రామపురంలోని గోడౌనకు అధికారులు తరలిస్తున్నారు. ఈ గోదాం వద్ద సరిపోను హమాలీలు లేకపోవడంతో అనలోడ్ ప్రక్రియ జాప్యం జరుగుతోందని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఒక లారీ అనలోడ్ కావాలంటే మూడు రోజులు పడుతుందంటున్నారు. గోదాం వద్ద లారీలు అనలోడ్ చేయడానికి 30 మంది హమాలీలు పని చేస్తున్నారని, రోజుకు10 నుంచి 12లారీలు అనలోడ్ చేస్తారని లారీ డ్రైవర్లు పేర్కొంటున్నారు. లారీలు రాక పోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేయడం లేదని రైతులు అంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి 10నుంచి 15 రోజులు కావస్తోందని, ధాన్యాన్ని తూకం పెట్టేందుకు పడిగాపులు కాస్తున్నామని రైతులు చెబుతున్నారు. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
భయపెడుతున్న వాన మబ్బులు
రోజూ మధ్యాహ్నం కాగానే మేఘాలు కమ్ముకుంటున్నాయి. వాన మబ్బులు బయపెడుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకాలు వేస్తే త్వరగా ధాన్యాన్ని విక్రయించి వెళ్లి పోవాలని రైతులు ఆరాటపడుతున్నారు. మండలంలో కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం రాశులు తడిసి పోవడం, కొంత మేరకు నష్టాలు జరుగుతుండడం వంటి పరిణామాలతో ఈ ప్రాంత రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ధాన్యం తూకాలను ఆలస్యం చేస్తుండడంతో రైతుల్లో ఆందోళన, ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిస్తే మళ్లీ ఆరబెట్టాల్సిన వస్తుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేసున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టడం, క్లీనింగ్ చేయడం వంటి పనులను పూర్తి చేసి, తూకం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.
14 కేంద్రాల ద్వార ధాన్యం కొనుగోళ్లు..
మండలంలో ధాన్యం కొనుగోళ్ల కోసం 13 కేంద్రాలను ఏర్పాటు చేసారు. అందులో ఐకేపీ 4, పీఎసీఏఎస్ 10 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలకు తూకాల కాంటాలు, మ్యాచర్ మిషనలను పంపించారు. 10 పీఎసీఏస్ కేంద్రాల్లోని మండల కేంద్రంతోపాటు వాసాలమర్రి, పెద్దతండ, పల్లెపహాడ్, వీరారెడ్డిపల్లి, నాగాయపల్లి, తిర్మలాపూర్ కేంద్రాల్లో బీహర్ కూలీలను హమాలీలుగా నియమించగా ముల్కలపల్లి, గందమల్ల, చిన్నలక్ష్మాపూర్ గ్రామాల్లో స్థానిక హమాలీలను నిమించారు. మండలంలోని వీరారెడ్డిపల్లి, తుర్కపల్లి, ముల్కలపల్లి గ్రామాల్లోని కేంద్రాల్లో హమాలీలను ఏర్పాటు చేయడంలో ముందు కొంత జాప్యం జరిగింది. దీంతో ఆ కేంద్రాల్లో ధాన్యం నిల్వలు అధికంగా కనిపిస్తున్నాయి. అంతే కాకుండా కోనుగోలు కేంద్రాల్లో క్రమ పద్ధతిలో కొనుగోళ్లు చేపట్టడం లేదని, ముందు వచ్చిన రైతులను కాకుండా తర్వాత వచ్చిన రైతుల వడ్లకు తూకం వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
కేంద్రానికి ధాన్యం తెచ్చి 15 రోజులైంది
ధాన్యం కొనుగోలు కేంద్రంలో వెంటనే ధాన్యానికి తూకం వేయాలి. 15 రోజలు క్రితం ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చాను. ధాన్యాన్ని ఆరబెట్టి, తూర్పారపట్టి తూకం వేసేందుకు సిద్ధం చేశాను. తూకం వేయకపోవడంతో రోజు ఽవరి కుప్పల వద్ద కాపాలా కాయాల్సి వస్తోంది. వర్షం పడితే మళ్లీ ఆరబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అధికారులు స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి.
-కోట శివరాములు ,రైతు, తుర్కపల్లి
గోదాంకు లోడ్ తెచ్చి మూడు రోజులైంది
మండలంలోని వాసాలమర్రి పీఏసీఏస్ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ఽరామపురం గోదాంకు ధాన్యం లోడ్ తెచ్చాను. ఇక్కడ వెంట నే అనలోడ్ కావడం లేదు. మూడు రోజులు పడుతోంది. దీంతో లారీ టైర్లు దెబ్బ తినే ప్రమాదముంది. ఇక్కడ భోజన వసతి కూడా లేదు. భోజనం కోసం హోటళ్లకు వెళ్లాల్సి వస్తోంది. అధికారులు స్పందించి లారీలు వెంటనే అనలోడ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలి.
-దీరావతు మనోజ్, లారీ డ్రైవర్