అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్
ABN , Publish Date - May 24 , 2025 | 12:23 AM
రాష్ట్ర ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖలో చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విజయవంతమైంది. దీంతో జూన్ 2 నుంచి మరో 12 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నూతన స్లాట్ బుకింగ్ విధానానికి శ్రీకారం చుట్టనుంది.

జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే అవకాశం
సాంకేతికంగా మార్పులు, చేర్పులు ప్రారంభం
ఇప్పటికే మూడు సబ్‌రిజిస్ట్రేషన్లు విజయవంతం
15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి
(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): రాష్ట్ర ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖలో చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విజయవంతమైంది. దీంతో జూన్ 2 నుంచి మరో 12 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నూతన స్లాట్ బుకింగ్ విధానానికి శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వ ఆదేశాలు రాగానే చండూరు, దేవరకొండ, హుజూర్‌నగర్, కోదాడ, మిర్యాలగూడ,మోత్కూరు, నకిరేకల్, నల్లగొండ, నిడమనూరు, రామన్నపేట, సూర్యాపేట, యాదగిరిగుట్ట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానంలో అమలులోకి రానుంది. అందుకు సంబంధించిన సాంకేతిక మార్పుల్లో యంత్రాంగం నిమగ్నమైంది. ఈ విధానంలో కేవలం 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది.
ఆస్తుల క్రయ, విక్రయదారులకు పారదర్శకంగా, అవినీతి రహితంగా మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నూతన స్లాట్ బుకింగ్‌తో పా టు బయోమెట్రిక్ విధానాన్ని తీసుకువచ్చింది. ప్రస్తుతం స్లాట్ బుకింగ్ లేని కార్యాలయాల్లో ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌కు కనీసం గంట నుంచి గంటన్నర వరకు సమయం పడుతోం ది. అదే స్లాట్ బుకింగ్ విధానం అమలులోకి వచ్చిన భువనగిరి, చౌటుప్పల్, బీబీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతోంది. ఈ ఏడాది మార్చి నెలలో హైదరాబాద్‌లో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖపై సమీక్ష సందర్భంగా ప్రభు త్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆస్తుల క్రయ, విక్రయదారుల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ నేపథ్యంలో సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆధునీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బోట్ సేవలు వినియోగించుకొని ఆస్తుల క్రయ, విక్రయదారులకు మెరుగైనా సేవలు అందించాలని ప్రభుత్వ నిర్ణయం మేరకు నూతనంగా స్లాట్ బుకింగ్ విధానం అమలులోకి వచ్చింది.
ఇప్పటికే మూడు కార్యాలయాల్లో విజయవంతం
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్, భువనగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను ఎంపిక చేయగా, రెండో విడతలో అదే జిల్లాలోని బీబీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఎంపిక చేసి స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకువచ్చింది. ఇక్కడ ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో మిగతా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సైతం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాంకేతికంగా అన్ని పనులు పూర్తయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మిగిలిన 12 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సేవలను త్వరలో అందుబాటులోకి రానున్నాయి. స్లాట్ బుకింగ్ విధానం దృష్ట్యా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్‌వ్యవస్థీకరణ చేయనున్నారు. ఈ విధానంతో ఇకపై నిషేధిత జాబితాలోని ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ‘భూభారతి’ తరహాలో ప్రత్యేకంగా ఒక ఫోర్టల్‌ను తెచ్చి నిషేధిత ఆస్తుల వివరాలను అందులో పొందుపర్చారు. నిషేధిత జాబితా స్థలాలను రిజిస్ట్రేషన్ చేస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా నిషేధిత జాబితాలోని భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే క్షణాల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయంలో ఆన్‌లైన్ తెలిసిపోయేలా వ్యవస్థను ఏర్పాటుచేశారు. నూతన స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా సులభతరమవుతుంది. ఉదయం 10.30 నుంచి 1.30గంటల వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఆస్తుల క్రయ, విక్రయదారులు స్లాట్ బుకింగ్ తరువాత లాగిన్‌లో, డిపార్ట్‌మెంట్ పోర్టల్‌లో పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయి. స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అదే రోజున సంబంధిత ఆస్తుల కొనుగోలుదారులకు ఇస్తారు. ఒకవేళ ఏదైనా కారణంతో పెండింగ్‌లో పడితే దానికి కారణాలను అధికారులు వివరిస్తారు. పారదర్శకంగా, వేగవంతంగా స్లాట్ బుకింగ్‌ను ఉపయోగించుకునేలా యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. పైలెట్ ప్రాజెక్టుగా మూడు కార్యాలయాల్లో చేపట్టిన ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో ఉమ్మడి జిల్లాలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు విస్తరించనున్నారు.
ఏప్రిల్‌లో పుంజుకున్న డాక్యుమెంట్లు
కొన్నాళ్లుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్తబ్దుగా ఉన్న రియల్ వ్యాపారం ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో పుంజుకుంది. 2024లో ఏప్రిల్ మాసంలో 10,443 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరగ్గా, రూ.33.17కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 11,705 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరగ్గా, రూ.33.08కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది కంటే ఈ ఏడాది డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం స్వల్పంగా రూ.9లక్షలు తగ్గింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. స్లాట్ బుకింగ్ విధానం రిజిస్ట్రేషన్లశాఖ ఆదాయానికి కలసివచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 15 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా, కొద్ది నెలలుగా హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు ప్రభావం ఇక్కడి భూముల క్రయ, విక్రయాలపై ప్రభావం చూపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా నల్లగొండలో 1,424 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరగ్గా, సూర్యాపేటలో 1,385, యాదగిరిగుట్టలో 1,524 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి.
అన్నిచోట్ల స్లాట్ బుకింగ్‌కు సన్నాహాలు తి: ఎస్.ప్రకాష్, ఉమ్మడి నల్లగొండ జిల్లా రిజిస్ట్రార్
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పటివరకు బీబీనగర్, భువనగిరి, చౌటుప్పల్‌లో స్లాట్ బుకింగ్ విధానం అమలులోకి వచ్చింది. ఈ విధానంతో సేవలు సులభంగా అందుతున్నాయి. త్వరలో మిగతా కార్యాలయాల్లో స్లాట్‌బుకింగ్ విధానం అమలులోకి వస్తుంది. ఏ రోజు నుంచి అమలు చేయాలన్నది ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నందున ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే అమలు చేస్తాం.