ఓటర్ల జాబితా సవరణకు సర్
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:09 AM
దేశంలో నివసించే 18 ఏళ్లు నిండిన వారందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్-326 ద్వారా కుల, మత, జాతి, లింగ, ప్రాంత, భాష అనే తారతమ్యం లేకుండా ఓటుహక్కు కల్పించారు.
దేశంలో నివసించే 18 ఏళ్లు నిండిన వారందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్-326 ద్వారా కుల, మత, జాతి, లింగ, ప్రాంత, భాష అనే తారతమ్యం లేకుండా ఓటుహక్కు కల్పించారు. సమాజ నిర్మాణానికి పునాది అయిన ఓటు దేశ చరిత్రను, రాష్ట్రాల భవిష్యతను ప్రభావితం చేస్తోంది. అర్హత కలిగిన పౌరులందరూ ఓటు హక్కుతో తమ ప్రతినిధులను ఎన్నుకోవచ్చు. ప్రజాస్వామ్య పరిరక్షణకు వజ్రాయుధం లాంటి ఓటు దుర్వినియోగం కాకుండా ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా చేపట్టిన ప్రతిష్టాత్మక విధానమే ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన(ఎ్‌సఐఆర్).
- (ఆంధ్రజ్యోతి - మిర్యాలగూడ టౌన)
బిహార్ రాష్ట్ర శాసనసభా ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సర్వే చేపట్టింది. మలివిడతలో 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. నవంబరు 4న ప్రారంభమయ్యే ఈ సర్వే డిసెంబరు 4వ తేదీకి పూర్తి చేసేలా షెడ్యూల్‌ను ప్రకటించింది.
క్షేత్రస్థాయిలో పరిశీలన
బిహార్ రాష్ట్రంలో చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన(ఎ్‌సఐఆర్) ప్రకంపనలు సృష్టించింది. ఓట్ల తొలగింపే లక్ష్యంగా ఎన్నికల కమిషన(ఈసీ) ఎస్‌ఐఆర్ చేపట్టిందని, అర్హులైన లక్షలాది మంది ఓట్లను తొలగించారన్న విపక్షాల నిరసనలు హోరెత్తాయి. కొందరు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, పార్లమెంట్ పలు సమావేశాలో ఎస్‌ఐఆర్(సర్)కు వ్యతిరేక నినాదాలతో వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఐఆర్‌ను అధికారులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ప్రధానంగా గుర్తింపు పత్రాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించారు. తుది జాబితా కూర్పు పారదర్శంగా ఉండేలా అధికారులు సన్నద్ధమవుతున్నారు.
సుదీర్ఘకాలం అనంతరం..
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన(ఎ్‌సఐఆర్/సర్)ను ఎనిమిది సార్లు మాత్రమే నిర్వహించారు. చివరిసారిగా 2002-04 పర్యాయం చేపట్టారు. ప్రస్తుతం చేపడుతున్న ఎస్‌ఐఆర్ తొమ్మిదోసారి కావడంతో ప్రతిష్టాత్మకంగా ఓటర్లను నమోదు చేసేందుకు అవసరమైన యంత్రాగాన్ని సిద్ధం చేస్తున్నారు. సర్‌ను తొలిదిశలో బిహార్ రాష్ట్రంలో పూర్తిచేసిన ఎన్నికల సంఘం మలిదిశలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించి ఓటర్ల జాబితాను సవరించనుంది. అర్హులు ఏ ఒక్క ఓటరూ తుది జాబితా నుంచి తొలగించబోమని, అనర్హుల్లో ఏ ఒక్క ఓటరుకు చోటుదక్కనివ్వమని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంటోంది.
వివరాల సేకరణ ఇలా
ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఎన్నికల సిబ్బంది 2002 ఓటరు జాబితాతో 2025 జాబితాను పోల్చి చూస్తారు. నాటి ఓటర్లు మినహా ప్రస్తుత ఓటర్లు ఎలా ఓటు హక్కు పొందారో, అందుకు ఎటువంటి గుర్తింపుపత్రాలు సమర్పించారో తెలుసుకుంటారు. వారికి ఓటుహక్కు కల్పించేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, వివరాలు సేకరిస్తారు. నిర్ధారించేందుకు అవసరమైన పత్రాలు చూపని ఓటర్లను తొలగించి తుదిజాబితా రూపొందిస్తారు. అయితే ఈ తతంగాన్ని పూర్తి చేసేందుకు ఒకటికి రెండుసార్లు దరఖాస్తుదారుల(ఓటర్ల) పత్రాలను పరిశీలిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.
అత్యంత సమర్థంగా సర్ నిర్వహణ
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాను నిబంధనల మేరకు సవరించనున్నాం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజనను అత్యంత సమర్థంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నాం. నిబంధనలకు అనుగుణంగా ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలు సేకరిస్తాం. బీఎల్వోలు, సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించి, సంబంధిత పత్రాలు చూపించి, వివరాలు సమర్పించాలి.
- అమిత నారాయణ్, సబ్ కలెక్టర్, మిర్యాలగూడ.