Share News

సత్తా చాటాలి

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:28 AM

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా, ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని సన్నద్ధమవుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్‌ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుండటంతో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఏఐసీసీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.

 సత్తా చాటాలి

వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం

స్థానిక ఎన్నికల్లో మండల, జిల్లా కమిటీలదే కీలక పాత్ర

నెలాఖరులోగా కమిటీల నియామకానికి కసరత్తు

క్షేత్రస్థాయిలో కష్టపడేవారికే ప్రాధాన్యం

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి) : స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా, ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని సన్నద్ధమవుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్‌ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుండటంతో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఏఐసీసీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు సాధించేందుకు కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. ఏఐసీసీ పెద్దలు, మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, పార్టీలోని సీనియర్‌ నేతలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. పార్టీపరంగా ఎక్కడా నేతల మధ్య సమన్వయంలోపం లేకుం డా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధిష్ఠానం ఇప్పటికే టీపీసీసీ కార్యవర్గా న్ని ప్రకటించి, జిల్లాల్లోని సీనియర్‌ నేతల కు అందులో అవకాశం కల్పించింది. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం చేపడుతు న్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు రాష్ట్ర, జిల్లా, మండ ల నేతలంతా కృషి చేయాలని సూచించింది. అందుకు వీలైనంతా త్వరగా మండల కమిటీల ఏర్పాటు పూర్తిచేయాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్‌ నాయకులకు సూచించారు. స్థానికసంస్థల ఎన్నికల్లో మండల, జిల్లా కమిటీలే కీలక పాత్ర పోషిస్తాయ ని, నెలాఖరు నాటికి మండల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు. మండల అధ్యక్షుల పదవులకు ఈనెల 17వరకు నేతల పేర్లు సేకరించి, ప్రతి మండలం నుంచి ఐదుగురితో కూడిన జాబితా అందజేయాలని డీసీసీ అధ్యక్షులను కోరారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్‌ జూమ్‌ మీటింగ్‌ సైతం నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై చర్చించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వారీగా పెండింగ్‌లో ఉన్న మండల నేతల జాబితాలు అందజేయాలని డీసీసీ అధ్యక్షులకు సూచించారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు మంగళవారం ఉమ్మడి జిల్లా నుంచి మండల అధ్యక్షుల ఎన్నికకు ప్రదిపాదిత జాబితాలు పంపేందుకు నాయకులు కసరత్తు పూర్తిచేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలతో చర్చించి, అర్హులైన వారి జాబితాలు సిద్ధం చేశారు.

కష్టపడేవారికే అవకాశం...

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ సారి ఎవరికి పడితే వారికి సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధం గా లేదని, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యం ఇస్తామని ఏఐసీసీ స్పష్టం చేసింది. పార్టీని నమ్ముకుని, స్థానికంగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నవారికే సర్పంచ్‌, వార్డు సభ్యులు, ఎం పీటీసీ, జడ్పీటీసీ, మునిసిపల్‌ కౌన్సిలర్లుగా అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. మరోవైపు ఏఐసీసీ పెద్దలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటించాలని సూచించారు. పార్టీ నిర్ణయం మేరకు అన్ని వర్గాలకు, పార్టీలోని విధేయులకు ప్రాధాన్యం కల్పించనున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారి వివరాలు ఏఐసీసీ పరిశీలిస్తుందని, జిల్లాలో అత్యధికస్థానాలు గెలిపించిన నేతల వివరాలు సేకరించి, వారికి భవిష్యత్‌లో ఎలాంటి గుర్తింపు ఇవ్వాలనేది కూడా పరిశీలించనున్నట్టు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ ప్రకటించారు. పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

నామినేటెడ్‌ పదవులకు పేర్లు

రాష్ట్ర, జిల్లా స్థాయిలో నామినేటెడ్‌ పదవులకు అర్హులైన నేతల పేర్లును కూడా ఈ నెల 17లోగా అందించాలని పార్టీ సీనియర్‌ నేతలకు ఏఐసీసీ సూచించింది. ఇటీవల నిర్వహించిన సమావేశంలో టీపీసీసీ కార్యవర్గంలో స్థానం దక్కని వారికి రానున్న రోజుల్లో అవకాశం కల్పిస్తామని, పదవుల భర్తీలోనూ సమన్యాయం పాటిస్తామని అగ్ర నాయకులు ప్రకటించారు. జిల్లాల్లో పార్టీ కోసం కష్టపడుతూ, నామినేటెడ్‌ పదవులకు అర్హులైన పేర్ల జాబితాను గాంధీభవన్‌లో అందించాలని డీసీసీ అధ్యక్షులకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సూచించారు. అయితే జిల్లాలోని పలువురు సీనియర్ల పేర్లను పార్టీ అధిష్ఠానికి మంగళవారం అందించేందుకు కసరత్తు పూర్తయింది.

Updated Date - Jun 17 , 2025 | 12:28 AM