నకిలీ మద్యం కేసులో మరో ఏడుగురు అరెస్ట్
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:18 AM
సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలంలో నకిలీ మద్యం కేసులో తాజాగా ఏడుగురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను హుజూర్‌నగర్‌లోని సర్కిల్ కార్యాలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ స్టిఫెనసన, ఎక్సైజ్ సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు.
హుజూర్‌నగర్ , జూలై 25 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలంలో నకిలీ మద్యం కేసులో తాజాగా ఏడుగురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను హుజూర్‌నగర్‌లోని సర్కిల్ కార్యాలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ స్టిఫెనసన, ఎక్సైజ్ సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు. స్థానికసంస్థల ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో మేళ్లచెర్వు మండలం రామాపురంలో అదే గ్రామానికి చెందిన తోట శివశంకర్, సూర్యప్రకాశ్‌రావులు నకిలీ మద్యం తయారు చేశారని, వారిని మూడురోజుల కిందట అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు తెలిపారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న రామాపురం గ్రామానికి చెందిన డీలర్ నర్సింహారావు, రంగిశెట్టి సైదేశ్వరరావు, భీమన ప్రవీణ్, కొట్టె నాగసైదేశ్వరరావు, రంగిశెట్టి వీరభద్రరావు, కీత నాగార్జునరావులను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ చేశామన్నారు. ఆంధ్రప్రదేశ రాష్ట్రం ప్రకాశం జిల్లా కందుకూరులో ప్రాంతంలో నకిలీ మద్యం పట్టుబడగా అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు రామాపురంలోని తోట శివశంకర్, సూర్యప్రకాశ్‌రావుకు సంబంధించిన స్థలాలపై గ్రామంలో ఈ నెల 21న దాడులు చేశామన్నారు. ఇదే కేసులకు అనుసంధానంగా తోట శివశంకర్, రంగిశెట్టి సైదయ్యలు రామాపురంలో డీలర్ నర్సింహారావుకు 150 కార్టన్ల నకిలీ మద్యం విక్రయించగా ఆ మద్యాన్ని సైదీ పొలంలో పాతిపెట్టినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 30 కాటన్లు స్వాధీనం చేసుకోగా 120 కాటన్ల నకిలీ మద్యాన్ని భూమిలోనేఽ ధ్వంసం చేశామన్నారు. వీరితో పాటు రంగిశెట్టి సైదేశ్వరరావు ఇంట్లో ఆరు కాటన్ల నకిలీ మద్యాన్ని, సైదీ స్నేహితుడైన ప్రవీణ్, నరేష్ నివాసాల్లో 30లీటర్ల స్పిరిట్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులకు సంబంధించి మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. కాగా స్పిరిట్ సరఫరా చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన రుతుల శ్రీనివాస్, శివచరణ్‌సింగ్‌లు ఆంధ్రప్రదేశ నకిలీ మద్యం కేసులో రిమాండ్‌లో ఉండగా వారిని ఈ కేసుల్లో కూడా తెలంగాణలో రిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. సుమారు రూ.40 లక్షల విలువచేసే నకిలీ మద్యాన్ని సీజ్ చేశామన్నారు. ఇదిలా ఉండగా కేసులో నిందితులుగా ఉన్న శివశంకర్, ప్రవీణ్‌లు మేళ్లచెర్వు, దొండుపాడు మద్యం దుకాణాల్లో పనిచేస్తూ నకిలీ మద్యం దందా చేస్తున్న నేపథ్యంలో వారికి సంబంధాలు కలిగి ఉండడంతో మేళ్లచెర్వు మద్యం దుకాణాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. దొండపాడు దుకాణాన్ని కూడా రెండురోజులలో సీజ్ చేస్తామన్నారు. దాడులలో ఎక్సైజ్ అఽధికారులు జగన్మోహన్‌రెడ్డి, వెన్నెల, రామకృష్ణ, రుక్మారెడ్డి, ధనుంజయ్, నాగరాజు, రవి, మధు, నాగయ్య, గోపిరెడ్డి, బాలు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.