సర్వర్..బిజీ
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:30 AM
ప్రభుత్వ పథకాలు, విద్యా, ఉద్యోగ అంశాలకు సంబంధించి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ప్రస్తుతం అత్యంత ఆవశ్యక్తంగా మారాయి. పుట్టిన ప్రతీ శిశువుకు భవిష్యతలో జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా మారింది.
జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం
భువనగిరిటౌన, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాలు, విద్యా, ఉద్యోగ అంశాలకు సంబంధించి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ప్రస్తుతం అత్యంత ఆవశ్యక్తంగా మారాయి. పుట్టిన ప్రతీ శిశువుకు భవిష్యతలో జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా మారింది. విద్య, ఉద్యోగం, పాస్‌పోర్టు తదితరాలకు జనన ధ్రువీకరణపత్రాన్ని ప్రభుత్వాలు ప్రామాణికం చేశాయి. అలాగే మృతుల కుటుంబాలకు ఆస్తుల పంపిణీ, ఆస్తుల హక్కుల మార్పిడి, కారుణ్య కోటా ఉద్యోగాలకు, పింఛన్లు తదితర అవసరాలకు మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. దీంతో ఆ రెండు సర్టిఫికెట్లను వెంటనే తీసుకునేందుకు సంబంధిత కుటుంబాలు తాపత్రయ పడుతుంటాయి. కానీ కొన్ని రోజులుగా ఆ సర్టిఫికెట్ల జారీలో కీలకమైన యూబీడీ వెబ్‌సైట్ తరచుగా మొరాయిస్తుండటంతో సర్టిఫికెట్లు అవసరమున్న వారు హైరానాకు గురవుతున్నారు.
2022 ఏప్రిల్ నుంచి ఆనలైనలో..
మొదట్లో జనన, మరణ తదితర ధ్రువపత్రాల జారీ ఆఫ్‌లైనలో జరిగేది. దీంతో ధ్రువీకరణ పత్రాల జారీలో అవకతవకలు, జాప్యం నెలకొనేది. సంబందిత శాఖల ఉద్యోగుల దయాదాక్షణ్యాలపైనే సర్టిఫికెట్ల జారీ ప్రక్రియఉండేది. దీంతో ముడుపులు కూడా మారే పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో పారదర్శకంగా సత్వర సేవలు లక్ష్యంగా ప్రభుత్వం 2022, ఏప్రిల్ నుంచి ఆనలైనలో సర్టిఫికెట్ల జారీని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. సర్టిఫికెట్లకోసం యూబీడీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని మీ సేవా కేంద్రాల ద్వారా సర్టిఫికెట్లను పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అలాగే ఆస్పత్రుల్లో జన్మించిన పిల్లల తల్లిదండ్రుల వివరాలతో జనన ధ్రువీకరణ పత్రాలకోసం 14 రోజుల్లో అప్‌లోడ్ చేసేందుకు అన్ని ఆస్పత్రులకు లింక్ ఇచ్చారు. ఆస్పత్రుల్లో మృతి చెందిన వారి, ఇళ్లలో సహజ మరణం పొంది వారి చివరి మజిలీలో అంత్యక్రియలు జరిగే శ్మశానవాటికల నిర్వాహకులు, కాటికాపరులకు కూడా మరణ ధ్రువీకరణపత్రాల దరఖాస్తును అప్‌లోడ్ చేసేందుకు ప్రభుత్వం లింకులు ఇచ్చింది. ఆధార్‌కార్డు తదితర ధ్రువీకరణలతో అప్‌లోడ్ చేసిన దరఖాస్తులను సంబంధిత సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ పూర్తయిన వెంటనే దరఖాస్తుదారుల సెల్‌ఫోనకు వచ్చే మెసేజ్ ఆధారంగా మీసేవా కేంద్రాల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. యూబీడీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన వెంటనే హైదరాబాద్ సీడీఎంఏ కార్యాలయంలోని సర్వర్‌కు చేరుతుంది. అంతేగాక ఇదే సర్వర్ ద్వారా రెవెన్యూ తదితర ప్రభుత్వ శాఖల్లో ఎంపిక చేసిన ధ్రువీకరణ పత్రాల జారీ కూడా జరుగుతోంది. కానీ గత నాలుగైదు నెలలుగా వెబ్‌సైట్, సర్వర్ తరచూ మొరాయిస్తుండటంతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీతోపాటు మరిన్ని సేవలకు అంతరాయం కలుగుతోంది. దీంతో సర్టిఫికెట్లకోసం పట్టణవాసులు మునిసిపల్ కార్యాలయాల చుట్టూ గ్రామస్థులు పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే సర్వర్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని, అయినప్పటికీ సమస్యలు పునరావృతం అవుతున్నాయని సీడీఎంఏ కార్యాలయ సిబ్బంది పేర్కొంటున్నారు. త్వరలోనే శాశ్వతంగా సమస్య పరిష్కరమవుతుందని అంటుండటం గమనార్హం.
సమస్య పరిష్కారమవుతుంది
ఎస్.రజిత, శానిటరీ ఇనస్పెక్టర్
జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో నెలకొన్న సమస్య త్వరలో పరిష్కారం అవుతుంది. సర్వర్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల నివారణపై సీడీఎంఏ కార్యాలయ టెక్నీషియన్లు దృష్టి పెట్టారు. రెండు మూడు రోజుల అనంతరం సర్టిఫికెట్ల జారీ యథావిధిగా కొనసాగుతుంది.