విద్యార్థి వికాసమే లక్ష్యంగా ‘స్కూల్ రేడియో’
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:44 AM
విద్యార్థికి పాఠాలు చెబితే సరిపోతుందా, మంచి వ్యక్తిత్వం, మంచి ఆలోచన విధానం కూడా వారిలో మెరుగుపడాలి కదా. ఇవే ప్రశ్నలు నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కట్టెబోయిన శ్రీనివాస్‌ను ఆలోచింపజేశాయి.
వినూత్నంగా చేపట్టిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్
యోగా, ధ్యానంతో పాటు పలు పోటీలు
విద్యార్థుల ఆలోచ నల్లో మార్పుకు అవకాశం
విద్యార్థికి పాఠాలు చెబితే సరిపోతుందా, మంచి వ్యక్తిత్వం, మంచి ఆలోచన విధానం కూడా వారిలో మెరుగుపడాలి కదా. ఇవే ప్రశ్నలు నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కట్టెబోయిన శ్రీనివాస్‌ను ఆలోచింపజేశాయి. ఈ క్రమంలో విద్యార్థులకు నచ్చేలా, వారు మెచ్చేలా ఓ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. స్కూల్ రేడియో పేరుతో విద్యార్థులతో పలు కార్యక్రమాలు చేయిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి-కొండమల్లేపల్లి)
కొండమల్లేపల్లి జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 879 మంది విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల 9 గంటలకు ప్రారంభమవుతుండగా అంతకు అరగంట ముందుగానే 8.30 గంటల నుంచి 9 గంటల వరకు స్కూల్ రేడియో కార్యక్రమాన్ని ఉపాధ్యాయుడు కట్టెబోయిన శ్రీనివాస్ చేపడుతున్నారు. ప్రతి రోజూ మొదట 10 నిమిషాలు యోగ, ధ్యానంతో పాటు ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. పిల్లల్లో సమగ్ర మూర్తిత్వం, మానసిక వికాసం పెంపుకోసం పలు పోటీలు రూపొందించారు. నీతి కథలు, ఉపన్యాసం, పాటలు, మంచి అలవాట్లు, క్రమశిక్షణా-విలువలు, వ్యక్తిగత అభిప్రాయాలను విద్యార్థులు తోటివిద్యార్థులతో పంచుకుంటారు. ఇటు ఆనందంతో పాటు మానసిక వికాసానికి దోహదపడుండటంతో విద్యార్థుల హాజరు కూడా పెరిగింది. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో చురుకుదనం సహా పాఠ్య కృత్యాల్లో విరివిగా పాల్గొనే తత్వం పెరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. ఇది భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడానికి కృషిగా వారు పేర్కొంటున్నారు.
సొంత ఆలోచనలు మెరుగుపడతాయి
స్కూల్ రేడియో కార్యక్రమం అనేది ఒక వినూత్న కార్యక్రమం. దీని ద్వారా విద్యార్థులకు సొంత ఆలోచనలు వస్తాయి, అంతేకాకుండా సొంతంగా కథలు చెబుతారు. పిల్లలకు ఆనలైన డెవల్‌పమెంట్ ఉంటుంది. ఉపన్యాస పోటీల్లో నిర్భయంగా మాట్లాడే తత్వం పెరుగుతుంది. శారీరక మానసికంగా, ఆరోగ్యంగా వారు మెరుగుపడతారు.
కట్టెబోయిన శ్రీనివాస్, ఉపాధ్యాయుడు, కొండమల్లేపల్లి