Share News

విద్యార్థుల్లేక పాఠశాల మూత

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:13 AM

రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి మౌలిక వసతులు కల్పించి ఏర్పాటుచేసిన యాదాద్రిభువనగిరి తుర్కపల్లి మండలం రామోజీనాయక్‌తండా ప్రాథమిక పాఠశాల నిరూపయోగంగా మారింది.

విద్యార్థుల్లేక పాఠశాల మూత

(ఆంధ్రజ్యోతి-తుర్కపల్లి)

రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి మౌలిక వసతులు కల్పించి ఏర్పాటుచేసిన యాదాద్రిభువనగిరి తుర్కపల్లి మండలం రామోజీనాయక్‌తండా ప్రాథమిక పాఠశాల నిరూపయోగంగా మారింది. ప్రభుత్వ పాఠశాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం సన్నగిల్లడంతో ఈ విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయులు చేపట్టిన బడిబాటకు వారి నుంచి స్పందన లభించలేదు. ఉన్న ముగ్గురు విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు విద్యాబోధన చేసేవాడు. ఆ విద్యార్థులు కూడా పాఠశాలకు సక్రమంగా రాకపోవడంతో నెల రోజుల కిందట జిల్లా విద్యాశాఖాధికారులు ఆ పాఠశాలను మూసివేశారు. ఈ గ్రామం నుంచి సుమారు 25 మంది విద్యార్థులు సమీపంలోని వడవర్తి, భువనగిరి, బొమ్మలరామారం మండలం జలాల్‌పూర్‌ గ్రామాల్లోని ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల మూసివేత అనంతరం ముగ్గురు విద్యార్థులను సమీపంలోని కర్షలగడ్డతండా ప్రాథమిక పాఠశాలకు పంపించారు. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని డిఫ్యూటేషనపై పల్లెపహాడ్‌ ప్రాథమిక పాఠశాలకు కేటాయించారు.

వచ్చే ఏడాది అడ్మిషన్లు ఉంటే ప్రారంభిస్తాం

పాఠశాల మూతపడకుండా ఎన్ని ప్ర యత్నాలు చేసినా విద్యార్థుల తల్లిదండ్రు ల నుంచి ఎలాంటి సహకారం లభించలే దు. ముగ్గురు విద్యార్థులు ఉన్నా ఆ విద్యార్థులు కూడా సక్రమంగా రాకపోవడంతో పాఠశాలను మూసివేయాల్సి వచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్లు వస్తే పాఠశాలను తిరిగి ప్రారంభిస్తాం.

- వీరజాల మాలతి, మండల విద్యాశాఖాధికారి తుర్కపల్లి

Updated Date - Oct 31 , 2025 | 12:13 AM