వ్యవసాయంపై సమీక్షలతోనే సరి!
ABN , Publish Date - May 26 , 2025 | 12:25 AM
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగంపై సమీక్షలతోనే సరిపెడుతోందన్న విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. సీజన్లు వచ్చిపోతున్నా రైతులకు మాత్రం పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు దక్కడం లేదు.
రైతులకు దక్కని సంక్షేమం, అభివృద్ధి పథకాలు
రైతు భరోసాపై స్పష్టత కరువు
యాసంగిలో ఇచ్చిన పెట్టుబడి సాయం నామమాత్రమే
వానాకాలం సీజన్ ముంచుకొస్తున్నా కలగని ఊరట
(ఆంధ్రజ్యోతి, నల్లగొండ): రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగంపై సమీక్షలతోనే సరిపెడుతోందన్న విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. సీజన్లు వచ్చిపోతున్నా రైతులకు మాత్రం పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు దక్కడం లేదు. రైతుభరోసాతో పాటు వ్యవసాయ యాంత్రీకర ణ పథకంపై స్పష్టత కరువైంది. సీఎం రేవంత్‌రెడ్డి వారం క్రితం మంత్రులు, అధికారులతో వ్యవసాయరంగంపై సమీక్ష నిర్వహించారు. ఈనెల 23 నుంచి రైతుభరోసా సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ప్రకటించినా, ఇప్పటి వరకు ట్రెజరీల నుంచి నిధులు విడుదల కాలేదు.
రైతుభరోసాను గత మార్చి నెలలోనే పూర్తిస్థాయిలో ఇస్తామని పలుమార్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా రైతులు ఎదురుచూస్తున్నారు. గత మా ర్చి నెలలో నాలుగు ఎకరాలలోపు రైతులకు మినహా ఆపైగా భూమి ఉన్న రైతులకు రైతుభరోసా అందలే దు. ఈ ఏడాది జనవరి 26న ప్రభుత్వం లాంఛనంగా, పైలెట్ ప్రాజెక్టుగా మండలానికో గ్రామం చొప్పున ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 73 గ్రామాలను ఎంపిక చేసి నూటికి నూరుశాతం ఆయా గ్రామాల్లో రైతుభరోసాను అమలు చేసింది. ఆ గ్రామాల్లో ఎంత భూమి ఉ న్నా రైతులకు పూర్తి స్థాయి భరోసా సొమ్మును విడుదలచేసింది. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ఎకరాల వరకు రైతులకు రైతుభరోసాను అమలు చేశారు.
రైతుభరోసా ఎన్ని ఎకరాలకో?
రైతుభరోసా ఎన్ని ఎకరాల వరకు ఇస్తారనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. సాగు చేస్తున్న భూమి మొత్తానికి రైతుభరోసా ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించడంతో ప్రతీ రైతు రైతుభరోసా కోసం ఎదురుచూస్తున్నారు. ఆ తరువాత ప్రభుత్వం రైతుభరోసాపై ఉమ్మడి జిల్లాల స్థాయిలో సహకారసంఘాలకు చెంది న రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుంది. ఎన్ని ఎకరాలకు రైతుభరోసా ఇవ్వాలనే దానిపై అభిప్రాయాలు సేకరించిన ప్రభుత్వం ఆ ఫైల్‌ను ఆటకెక్కించింది. అభిప్రాయాలను తీసుకున్న తరువాత అసెంబ్లీలో చర్చ పెట్టి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా, తీరా అసెంబ్లీలో చర్చను సైతం పక్కన పెట్టింది. రైతుల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో ప్రభుత్వం జనవరి 26న రైతుభరోసా ప్రక్రియ ప్రారంభించినా, పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో వ్యవసాయ సీజన్‌లో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు.
పెట్టుబడులకు వడ్డీ వ్యాపారులే దిక్కు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 11లక్షల మందికి పైగా రైతులు ఉన్నారు. అందులో నల్లగొండ జిల్లాలో 5.50లక్షల మంది, సూర్యాపేట జిల్లాలో 3.50లక్షల మంది, యాదాద్రి జిల్లాలో 2.10లక్షల మందికిపైగా రైతులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 21లక్షల ఎకరాల వరకు సాగుభూమి ఉంది. ప్రభుత్వం రైతుభరోసాను నాలుగు ఎకరాల వరకే ఇచ్చి మిగతా రైతులకు భరోసా కల్పించకపోవడంతో వారు పెట్టుబడుల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. యాసంగి వ్యవసాయ సీజన్ ముగిసి వానాకాలం సీజన్ సమీపించగా, ఇప్పటి వరకు ప్రభుత్వం అందరి రైతులకు పెట్టుబడిని అందించలేకపోయింది. గత ప్రభుత్వ హయాంలో ఎంత భూమి ఉన్నా ఎకరానికి రూ.5వేల చొప్పున రైతుబంధు కింద అందించే వారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఎకరానికి రూ.7500 చొప్పున ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎకరానికి రూ.6వేల చొప్పున ఏటా రూ.12వేలు నిర్ణయించి నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు ఎకరానికి రూ.6వేల చొప్పున జమచేసింది. ప్రస్తుతం పంటల సాగుకు చేతిలో డబ్బు లేక రైతులు అప్పులు చేస్తున్నారు. ఎకరానికి రూ.25వేల చొప్పున పెట్టుబడి వస్తోంది. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీకి డబ్బు తెచ్చిన రైతులు అప్పుల ఊబిలో కూరుకపోతున్నారు. కాంగ్రెస్ అదనంగా ఎకరాకు రూ.2,500 మొత్తం రూ.7,500ఎకరానికి ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడంతో రైతులు ఆశపడగా, తీరా ప్రభుత్వం ఎకరానికి రూ.6వేలు ఇస్తూ నిర్ణయం చేయడంతో నిరుత్సానికి గురవుతున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతీ రైతుకు ఎంత భూమి ఉన్నా 11సార్లు రైతుబంధును అమలు చేసింది. అప్పట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రతీ సీజన్‌లో రూ.1,450కోట్లకు పైగా రైతుబంధు వచ్చేది. ప్రస్తుతం 11లక్షల మందికి పైగా రైతులకు గతంలో మాదిరిగా అమలు చేస్తే ఎకరాకు రూ.6వేల చొప్పున ఏటా రెండు సీజన్లలో ఎకరాకు రూ.12వేలు చెల్లిస్తే ప్రభుత్వంపై మరింత భారం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తక్కువ భూమికే రైతుభరోసా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? లేద ంటే గతంలో చెప్పిన విధంగా సేద్యం చేస్తున్న భూమి అంతంటికీ రైతుభరోసా కల్పిస్తారా? అనేది వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
యాంత్రీకరణ నిధులు రూ.3.60కోట్లు ఫ్రీజింగ్
ఈ ఏడాది మార్చి నెలలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించి దరఖాస్తులు తీసుకుంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడేళ్లపాటు యాంత్రీకరణ పథకాన్ని నిలిపివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది తరువాత యాంత్రీకరణపై దృష్టి సారించి దరఖాస్తులు తీసుకుంది. ప్రస్తుతం దరఖాస్తులతోనే సరిపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం యాంత్రీకరణ పథకానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రూ.3.60కోట్లు కేటాయించింది. యాదాద్రి జిల్లాకు 240 పరికరాలకు రూ.72లక్షలు, సూర్యాపేట జిల్లాకు 457 పరికరాలకు రూ.1కోటి, నల్లగొండ జిల్లాకు 820 యాంత్రీకరణ పథకాలకు రూ.1.88కోట్లను ప్రకటించారు. అయితే ఈ నిధులను ట్రెజరీకి విడుదల చేసి పరికరాలను కొనుగోలు చేయాల్సి ఉండగా, ట్రెజరీలోనే నిధులను ఫ్రీజింగ్ చేశారు. మళ్లీ ఈ ఏడాది కొత్తగా యాంత్రీకరణకు నిధులు కేటాయించి, గతంలో కేటాయించిన నిధులను విడుదల చేసే ఆలోచనలక్ష ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. దీంతో ఇప్పట్లో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలయ్యే అవకాశాలు కన్పించడం లేదు.
ప్రభుత్వ ఆదేశాలు రాగానే పథకాల అమలు తి: పి.శ్రవణ్‌కుమార్, జేడీఏ, నల్లగొండ
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే రైతుభరోసాతో పాటు వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు నిర్వహించిన అనంతరం అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. యాంత్రీకరణ పథకానికి దరఖాస్తులు కూడా తీసుకున్నాం. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తాం. రైతుభరోసా ఇప్పటికే నాలుగు ఎకరాల వరకు రైతులకు పెట్టుబడి సాయం అందించాం.