జీతాలు అద్దెలు లేవ్
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:38 AM
బడుగు, బలహీన విద్యార్థులకు విద్యను దగ్గర చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీ, సాధారణ గురుకులాలు ఏర్పాటుచేసింది. ఫలితంగా పేద విద్యార్థులు గురువుల వద్ద ఉంటూ, సహజ వాతావరణంలో జీవిస్తూ, విద్యాభ్యాసం తో పాటు తోటి విద్యార్థులతో స్నేహభావం, వ్యక్తిగత నైపుణ్యం, జ్ఞానంతో పాటు నైతిక విలువలు అలవర్చుకొని జీవితంలో రాణిస్తారనేది ప్రభుత్వ తలంపు.
గురుకులాలకు ఏడు నెలలుగా బకాయిలు
ఉమ్మడి జిల్లాలో 82 గురుకులాలు
అద్దె భవనాల్లో 55
అద్దెలు రాక ఇబ్బందులుపడుతున్న యజమానులు
గురుకులాల్లో పనిచేస్తున్న 3,280 మంది టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందికి అందని రూ.26 కోట్ల జీతాలు
(ఆంధ్రజ్యోతి-కోదాడ) : బడుగు, బలహీన విద్యార్థులకు విద్యను దగ్గర చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీ, సాధారణ గురుకులాలు ఏర్పాటుచేసింది. ఫలితంగా పేద విద్యార్థులు గురువుల వద్ద ఉంటూ, సహజ వాతావరణంలో జీవిస్తూ, విద్యాభ్యాసం తో పాటు తోటి విద్యార్థులతో స్నేహభావం, వ్యక్తిగత నైపుణ్యం, జ్ఞానంతో పాటు నైతిక విలువలు అలవర్చుకొని జీవితంలో రాణిస్తారనేది ప్రభుత్వ తలంపు. ఈ క్రమంలో కొన్నిచోట్ల సొంత భవనాల్లో, మరికొన్ని చోట్ల అద్దె భవనాలలో విద్యను అందిస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 82 గురుకులాలు ఉంటే వాటిలో 55 భవనాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నా యి. గత ఏడు నెలలుగా వాటికి సుమారు రూ.13.47 కోట్ల అద్దె సొసైటీ వారు చెల్లించకపోవటంతో భవన యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి సమస్య వచ్చినా భవన యజమానులు పట్టించుకోవటంలేదు. దీంతో మౌలిక సదుపాయాల లేమితో విద్యార్థులు ఇబ్బందు లు పడుతున్నారు. అంతేగాక 82 గురుకులాల్లో పనిచేస్తున్న 3,280మంది టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందికి, గత నెల జీతం రూ.26.24 కోట్లు నేటికి అందకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పడంలేదనేది సమాచారం. గత ఏడు, ఎనిమిది నెలలుగా, నెలనెలా జీతాలు సక్రమంగా అందక ఉపాధ్యాయులు సైతం ఇబ్బందులుపడుతున్నట్లు సమాచారం. ఈ విద్యాసంవత్సరం పూర్తి అయ్యే నాటికి గురుకులాల అద్దెలు, వాటిలో పనిచేస్తున్న టీచింగ్, నాన్‌టీచింగ్ జీతాలు ఇచ్చి, వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే లోపు సొంత భవనాలు నిర్మించాలని, నెలనెలా జీతాలు ఇచ్చి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలని ఉపాధ్యాయులు సొసైటీ నిర్వాహకులను కోరుతున్నారు.
సగానికిపైగా అద్దె వాటిలోనే..
ఉమ్మడి జిల్లాలో ఎస్సీ గురుకులాలు 18 ఉన్నాయి. వాటిలో ఎనిమిది అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. బీసీ 26 ఉండగా, 26 అద్దె భవనాల్లో, ఎస్టీ గురుకులాల 20 ఉండగా, వాటిలో 5 అద్దె భవనాల్లో, మైనార్టీ 16ఉండగా వాటిలో 11 అద్దె భవనాలలో నడుస్తున్నాయి. సాధారాణ గురుకులాలు రెండు ఉండగా, రెండింటికీ సొంతభవనాలు ఉన్నాయి. మొత్తంగా 82 గురుకులాలు ఉండగా, వాటిలో 55 గురుకులాలు అద్దె భవనాలలో నడుస్తున్నాయి. ఒక్కో భవనం అద్దె సగటున రూ.3.50 లక్షలు ఉన్నట్లు సమాచారం. ఆ చొప్పున 55 గురుకులాలకు చెల్లించాల్సిన అద్దె నెలకు రూ.1.92 కోట్లు. ఏడు నెలలుగా బకాయి మొత్తం రూ.13.47 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. మైనార్టీ గురుకులాలకు 11 నెలలుగా అద్దె చెల్లించడం లేదు. అంటే మైనార్టీ గురుకులాలకు మరో నాలుగు నెలల అద్దె రూ.14లక్షలు ఇవ్వాల్సి ఉంది. విద్యాసంవత్సరం పూర్తవుతున్నా అద్దెలు అందకపోవటంపై భవన యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈఎంఐలు ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలని వారంటున్నారు. కోట్లు పెట్టి భవనాలు నిర్మిస్తే, ప్రభుత్వం నెలవారీగా అద్దెలు చెల్లించకపోవటంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా బకాయిలు ఇచ్చి, నెలనెలా అద్దెలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అందని రూ.26 కోట్ల వేతనాలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 82 గురుకులాల్లో 52,480మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఒక్కో గురుకులంలో 32 మంది టీచింగ్, ఎనిమిది మంది నాన్‌టీచింగ్, మొత్తం 40 మంది పనిచేస్తున్నారు. ఆ చొప్పున 82 గురుకులాల్లో 3,280 మంది పనిచేస్తున్నారు. గత నెల వరకు వారికి జీతాలు రూ.26 కోట్లు అందాల్సి ఉంది. ఈ నెల 20 రోజులు గడుస్తున్నా మార్చి నెల జీతం నేటికీ అందకపోవడంతో ఇబ్బందులుపడుతున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నుంచి నెలనెలా జీతాలు అందడంలేదని రెండు, మూడు నెలలకు ఒకసారి వస్తుండటంతో పస్తులతో తాము పనిచేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన, సౌకర్యాలు అందాలంటే సిబ్బందికి నెలనెలా జీతం అందేలా, సొసైటీ వారు ప్రణాళిక సిద్ధం చేసుకొని, వచ్చే విద్య సంవత్సరంలోనైనా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వారు కోరుతున్నారు.
2008 డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకూ అందని వేతనాలు
కనగల్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): 2008 డీఎస్సీ కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా నియమితులైన ఉపాధ్యాయులకు రెండు నెలలుగా వేతనాలు అందడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 157 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం గత ఫిబ్రవరి 15న కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించింది. వీరికి రూ.31వేల గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉండగా, ఉద్యోగంలో చేరి రెండునెలలైనా వేతనాలు ఇంకా అందలేదు. ఉద్యోగంలో చేరక ముందు ప్రైవేట్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీస్తుండగా, రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఉద్యోగంలో చేరామని వారు సంబరపడ్డారు. అయితే ఉద్యోగంలోకి చేరాక వేతనాలు అందకపోవడంతో వారి సంతోషం ఆవిరైంది. ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకుని వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు.