ఎల్‌ఆర్‌ఎస్‌తో రూ.7కోట్ల ఆదాయం
ABN , Publish Date - May 02 , 2025 | 12:19 AM
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మునిసిపాలిటీలోని 4,087 మంది ప్లాట్ల యజమానులు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపుతో ప్రభుత్వానికి రూ.7.01కోట్ల ఆదాయం సమకూరింది.
చెల్లింపు గడువు 3వరకు పొడిగింపు
చౌటుప్పల్ టౌన, మే 1( ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మునిసిపాలిటీలోని 4,087 మంది ప్లాట్ల యజమానులు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపుతో ప్రభుత్వానికి రూ.7.01కోట్ల ఆదాయం సమకూరింది. 2025 ఏప్రిల్ 30వ తేదీ వరకు జరిగిన ఎల్‌ఆర్‌ఎస్ ఆనలైన నమోదు ప్రక్రియలో 4,087మంది యజమానులు ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకున్నారు. అనధికార వెంచర్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్లాట్ల యజమానులకు ఎల్‌ఆర్‌ఎస్( లే అవుట్ రెగ్యులరైజేషన స్కీం) అవకాశాన్ని కల్పించింది. అందుకు గాను ఎల్‌ఆర్‌ఎస్ కోసం మొదటగా 2020లో రూ. 1,000 చెలించి 16,571 మంది ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకున్నారు. రూ. 1000 లు చెల్లించి ధరఖాస్తు చేసుకున్న వారికి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్వీకరించుకునే అవకాశాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. 16,571 మంది ధరఖాస్తు చేసుకోగా, అందులో కేవలం 4,087 మంది ప్లాట్ల ఽయజమానులు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు ను చెల్లించారు. దీంతో అనధికార వెంచర్‌లలోని ప్లాట్లపై యజమానులకు పూర్తి హక్కులను ప్రభుత్వం కల్పించింది. ఈ ఫీజు చెల్లించిన యజమానులు ప్రభుత్వ అనుమతులు పొంది భవన నిర్మాణాలను చేసుకునేందుకు మార్గమం సుగుమమైంది.
అవగాహన కల్పించినా..
అధికారులు సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించినా ఎల్‌ఆర్‌ఎ్‌సను చాలా మంది ఉపయోగించుకోలేక పోయారు. మార్చి నెలలో ప్లాట్ల యజమానులలో ఎల్‌ఆర్‌ఎస్ పట్ల కనిపించిన ఉత్సాహం ఏప్రిల్ నెలలో కనిపించలేదు. ఏప్రిల్ 30వ తేదీతో ముగిసినా ఎల్‌ఆర్‌ఎస్ గడువు ను ప్రభుత్వం మరో మూడు రోజుల పాటు పొడిగించింది.
రీ సేల్‌కు సగం చెల్లింపుతో సరి
అనధికార వెంచర్‌లలోని రీ సేల్ ప్లాట్ల కు కొందరు యజమానులు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజును సగం మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుంటున్నారు. మిగతా ఫీజును ప్లాట్ కొనుగోలుదారులు భరించడమా లేదా ప్లాట్ అమ్మకందారుడు భరించాలా అన్నది క్రయవిక్రయాలు జరిగినప్పుడు తేల్చుకోవలసి ఉంటుంది.
యజమానులకు తప్పని చిక్కులు
2020 లో ప్రభుత్వానికి రూ. 1000లు చెల్లించి ఎల్‌ఆర్‌ఎస్ కు ధరఖాస్తు చేసుకున్న కొంత మంది ప్లాట్ల యజమానులకు కొన్ని చిక్కులు తలెత్తాయి. ప్రధానంగా చెరువులు, కుంటలు ఉన్న ప్రాంతాలలోని ప్లాట్ల కు ఎఫ్‌టీఎల్‌లో ఉండడంతో నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. వీటితో పాటుగా ఎలాంటి సమస్యలు లేని ప్లాట్లు కూడ నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో యజమానులు తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తోంది. నీటి పారుదల, రెవెన్యూ శాఖల అధికారులు సర్వే చేసి వెంట వెంటనే క్లియరెన్స ఇస్తున్నారు. అయినా ఈ తతంగానికి రెండు, మూడు రోజుల వ్యవధి పడుతోంది. ఈ రెండు శాఖల అధికారులు క్లియరెన్స ఇచ్చిన తరువాత మునిసిపల్ సిబ్బంది కూడ చివరగా తనిఖీ చేసి, ఫైనల్ రిపోర్టు ఇస్తున్నారు. ఈ వ్యవహారం తరువాత ఎల్‌ఆర్‌ఎస్ ఫీజును చెల్లించి రశీదును పొందవలసి ఉంటుంది. ఎర్రటి ఎండలో కూడ ఈ మూడు శాఖల అధికారులు, సిబ్బంది ప్లాట్ల ను నేరుగా తనిఖీలు చేసి క్లియరెన్స ఇస్తుండడంతో ఎలాంటి పొరపాట్లు జరిగేందుకు అవకాశాలు లేవు. ఇందులో నీటి పారుదల, మునిసిపల్ శాఖల అధికారులు ఎక్కువగా శ్రమ తీసుకోవలసి వస్తోంది.
ఈనెల 3వరకు అవకాశం
ఎల్‌ఆర్‌ఎస్ కు ప్రభుత్వం మూడు రోజులు(ఈనెల 3వ తేదీ వరకు) అవకాశం కల్పించింది. గత మార్చి, ఏప్రిల్ మాసాలలో 25 శాతం సబ్సిడీ అవకాశం కల్పించిన ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ తో ఆశీంచిన రాబడి రాకపోవడంతో మరో మూడు రోజులు గ్రేస్ పీరియడ్ మాదిరిగా అవకాశం ఇచ్చింది. మార్చి 31 తో ముగిసిన గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. అయినా కూడ రాబడి టార్గెట్ ను ప్రభుత్వం అందుకోలేక పోయింది. గడువును మరోమారు పొడిగిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఎల్‌ఆర్‌ఎస్ తో ఇటు ప్లాట్ల యజమానులకు ప్రయోజనం ఉండగా, అటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది.
ఐబీ సమస్యలను వెంట వెంటనే పరిష్కరించాం
నీటి పారుదల శాఖ కు ధరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానుల సమస్య (ఎఫ్‌టీఎల్)ల ను వెంట వెంట నే పరిష్కరించాం. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాని యజమానులకు అవగాహన కల్పించి, ప్రోత్సహించాం. ఈ అవకాశాన్ని ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలి.
-పుథ్వి, రాజ్యలక్ష్మి, నీటిపారుదల వాఖ ఏఈలు
ఎల్‌ఆర్‌ఎస్ ప్రాధాన్యాన్ని వివరించాం
ఎల్‌ఆర్‌ఎస్ ప్రాధాన్యాన్ని ప్లాట్ల యజమానులకు సదస్సులు నిర్వహించి వివరించాం. మునిసిపల్ కార్యాలయంలో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించే ప్లాట్ల యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండ అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఈ నెల 3వ తేదీ వరకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-కె.నర్సింహారెడ్డి, కమిషనర్, చౌటుప్పల్ మునిసిపాలిటీ