Share News

ఈ రోహిణిలో రోళ్లు పగలవ్‌!

ABN , Publish Date - May 27 , 2025 | 12:20 AM

రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయని పెద్దలు అంటుంటారు. సాధారణంగా మే నెలలో ఎండలు ఠారెత్తిస్తాయి. ఈ నెల 25 నుంచే రోహిణి కార్తె మొదలైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండాకాలం చివరిలో పలు ప్రాంతాల్లో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే వి. మండే ఎండలకు జనం ఉక్కిరి బిక్కిరి అయ్యేవారు.

ఈ రోహిణిలో రోళ్లు పగలవ్‌!

వేసవిసంథింగ్‌ స్పెషల్‌

ఇలాంటి కూల్‌ సమ్మర్‌ లేదని నిపుణుల అభిప్రాయం

16ఏళ్ల తర్వాత ముందస్తు రుతుపవనాలు

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయని పెద్దలు అంటుంటారు. సాధారణంగా మే నెలలో ఎండలు ఠారెత్తిస్తాయి. ఈ నెల 25 నుంచే రోహిణి కార్తె మొదలైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండాకాలం చివరిలో పలు ప్రాంతాల్లో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే వి. మండే ఎండలకు జనం ఉక్కిరి బిక్కిరి అయ్యేవారు. ఎండ వేడిమికి తట్టుకోలేక వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయేవారు. అయితే ఈ ఏడాది మాత్రం వేసవి సమ్‌థింగ్‌ స్పెషల్‌గా నిలిచింది.

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది వేసవి ప్రత్యేకతలను సంతరించుకుంది. ఎండల్లో హాయ్‌హాయ్‌.. అనే పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్‌లో విజృంభించే వేసవి ఛాయలు ఈసారి ఫిబ్రవరి నెలాఖరులోనే మొదలయ్యాయి. మే నెలలో మలమలా మాడ్చాల్సిన మండుటెండలు మనసు మార్చుకుని వర్షాలు కురిపిస్తున్నాయి. భయపెట్టే తీవ్ర వడగాడ్పులు జాడే లేకుండా పోయాయి. ఇక జూన్‌ ఆరంభంలోనే తాకాల్సిన నైరుతి రుతుపవనాలు ఎనిమిది రోజుల ముందుగానే కేరళలోకి ప్రవేశించాయి. అన్నింటికీ మించి రోళ్లు పగిలేలా ఎండలు ఉంటాయని చెప్పుకునే రోహిణి కార్తెలో చల్లని వాతావరణం ఏర్పడింది. మరోవైపు వచ్చే వారం పది రోజుల పాటు అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తూ పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణశాఖ తాజాగా ప్రకటించింది.

ఈ ఏడాదిలో 43 డిగ్రీలకు మించలేదు

ఈ ఏడాది వేసవిలో మొత్తం ఉమ్మడి జిల్లాలో 43 డిగ్రీలకు మించి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకాలేదు. అదికూడా ఏప్రిల్‌ నెలలోనే నమోదయ్యాయి. ఈ సారి మే నెలలో 45డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకుంటాయని వాతావరణ నిపుణులు తొలుత అంచనా వేశారు. కానీ, మారిన వాతావరణ పరిస్థితులతో అందుకు భిన్నంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అయితే ఎండాకాలంలో అకాల వర్షాలు, ఈదురుగాలులతో జిల్లాలోని తుర్కపల్లి, రాజపేట, భువనగి రి, భూదాన్‌పోచంపల్లి, ఆలేరు, తదితర మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతులు సుమారు రూ.14కోట్ల మేరకు పంట నష్టాన్ని చవిచూశారు. కాగా, ఈ సారి వడదెబ్బ మరణాలు కూడా చాలా తక్కువగా నమోదయ్యాయి.

16ఏళ్ల తర్వాత ముందస్తు రుతుపవనాలు

గతంలో నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయం కంటే కొన్నిరోజులు ముందుగానే కేరళను తాకిన తరువాత కొద్దిరోజులకు వాతావరణం చల్లబడేది. రోహిణి కార్తె వేళ ఉష్ణతీవ్రత ఉండేద ని వాతావరణ నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా మే నెలంతా కూడా వర్షాలు, మబ్బులతో చల్లదనాన్ని పరిచింది. గడిచిన ఏళ్లలో ఇలాంటి కూల్‌ సమ్మర్‌ను చూడలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎప్పుడైనా మే నెలలో తుఫాన్లు ఏర్పడితే ఐదారు రోజులు చల్లదనం ఉండేది తప్ప ఇంతలా ఎప్పుడూలేదు. 2009లో నైరుతి రుతుపవనా లు తొమ్మిది రోజులు ముందుగా రాగా, ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు ఎండలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరుకు ముందే తుపాన్లు వచ్చే అవకాశం ఉం దని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రుతుపవనాలు ముందుగానే ప్రవేశిస్తే మంచి వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఉంటాయని వాతావరణశాఖ వెల్లడిస్తోంది.

పలకరించిన తొలకరి

తొలకరి పలకరించడంతో పంటలను సాగు చేసేందుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. వానాకాలం పంటలను ముందస్తుగానే సాగుచేసేందుకు సన్నద్ధమవుతున్నారు. వరి నూర్పిడి పను లు చేసిన రైతులంతా దుక్కులు దున్ని, చేలను సిద్ధం చేస్తున్నారు. ఈ సీజన్‌లో జిల్లాలో వానాకాలంలో 4.50లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచింది. అందులో వరి, పత్తి అధికంగా సాగయ్యే అవకాశం ఉంది. సాధారణంగా 2.60లక్షల వరకు వరి సాగుకానుంది. ఈసారి పత్తి 1.15లక్షల ఎకరాల వరకు సాగుచేసే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు 73,750క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉంచారు.జిల్లావ్యాప్తంగా 13,575 ఎకరాల్లో కూరగాయల తోటలు సాగవుతుండగా, ఈసారి కూరగాయల సాగును 20వేల ఎకరాలకు పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పత్తి 1,15,000 ఎకరాల్లో సాగుకానుండగా, అందుకోసం 2,30,600 పత్తి విత్తనాల ప్యాకెట్లు సిద్ధంగా ఉంచారు. కందులు 6,800ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేయగా, 240క్వింటాళ్లు విత్తనాలు, జొన్న 600 ఎకరాలకు 124 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేశారు. ఇతర పంటలు 23,200 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. వీటిలో పెసర్లు 600 ఎకరాలకు 48క్వింటాళ్ల విత్తనాలు, ఉలువలు 100ఎకరాలకు 15క్వింటాళ్లు, మొక్కజొన్న 100ఎకరాలకు 8 క్వింటాళ్ల విత్తనాలను అధికారులు సిద్ధం చేశారు.

Updated Date - May 27 , 2025 | 12:20 AM